నీళ్లొస్తున్నయ్‌ : కృష్ణా, గోదావరుల్లో పెరుగుతున్న ప్రవాహం

నారాయణపుర నుంచి జూరాలకు 1.02 లక్షల క్యూసెక్కులు

జూరాల ఎగువన తీరప్రాంతాలవారికి అలర్ట్

గోదావరిలో మేడిగడ్డ నుంచి 105 కి.మీ. బ్యాక్వాటర్

భద్రాచలం వద్ద 16 ఫీట్ల నీటిమట్టం

నిండుకుండలా తాలిపేరు జలాశయం

21 గేట్లు ఎత్తి 84 వేల క్యూసెక్కుల విడుదల

గద్వాల, ఆత్మకూరు, భద్రాచలం, ఖనాపూర్‌‌‌‌, వెలుగు: ఎగువన కర్నాటక, మహారాష్ట్ర, చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో ప్రవాహం పెరిగింది. కృష్ణానదిపై ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులు నిండుకుండళ్లా మారాయి. ఆదివారం రాత్రి 10 గంటలకు నారయణపుర నుంచి 18 గేట్లు ఎత్తి లక్ష కూసెక్కులకు పైగా నీటిని ప్రియదర్శిని జూరాలకు ప్రాజెక్టు(పీజేపీ)కు విడుదల చేశారు. మరోవైపు ప్రాణహితలో కొన్ని రోజులుగా నిలకడగా ప్రవాహం కొనసాగుతుండడం, చత్తీస్‌‌గఢ్‌‌లో మూడు రోజులుగా ఎడతెరిపి లేని వానలతో గోదావరికి భారీగా వరద చేరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ నుంచి 105 కిలోమీటర్ల మేర బ్యాక్‌‌వాటర్‌‌ నిలిచి జలకళ సంతరించుకుంది. దిగువన భద్రాచలం వద్ద నీటిమట్టం16 అడుగులకు చేరుకుంది. సోమవారం 20 అడుగులకు చేరుంతుందని ఇరిగేషన్‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు.

కృష్ణానది పరవళ్లు తొక్కుతుండడంతో ఆల్మట్టి, నారాయణపుర డ్యామ్‌‌లు నిండిపోయాయి. ఆదివారం రాత్రి 10.30 గంటలకు నారాయణపుర డ్యామ్‌‌ 18గేట్ల ఎత్తి 1,02,240 క్యూసెక్కులను నీటిని దిగువన జూరాలకు  విడుదల చేశారు. ఈ నీరు సోమవారం అర్ధరాత్రి వరకు చేరుకునే అవకాశం ఉన్నట్లు ప్రాజెక్ట్​ ఈఈ శ్రీధర్​ చెప్పారు. ఎగువ నుంచి వరద వచ్చే అవకాశం ఉన్నందున మరో మూడు రోజుల్లో జూరాల ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ఠ స్థాయి చేరుకునే అవకాశం ఉందన్నారు. జూరాల ప్రాజెక్ట్​ నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో 1.98 టీఎంసీల నీరు ఉంది. ఆల్మట్టి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 127.67 టీఎంసీలు ఉన్నాయి. నారాయణపుర డ్యామ్‌‌ నీటి నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 36.40 టిఎంసిల వాటర్ ఉన్నాయి. నీటి విడుదల నేపథ్యంలో జూరాల ఎగువ భాగాన కృష్ణానది తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల, జీవాల కాపరుల, జాలర్లు నదిలోకి వెళ్లవద్దని ఇరిగేషన్‌‌ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

వరద రాగానే పంపింగ్‌‌..

జూరాలకు వరద రాగానే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, సీమ ఎత్తిపోతల పథకం లిఫ్ట్-1. లఫ్ట్‌‌-2, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు నీటిని పంప్‌‌ చేసేందుకు ఇరిగేషన్‌‌ ఆఫీసర్లు రెడీ అవుతున్నరు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తతం 1.98 టీఎంసీల నీరు ఉంది.

తాలిపేరు నుంచి 84 వేల క్యూసెక్కులు

చత్తీస్‌‌గఢ్‌‌లో భారీ వర్షాలతో తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి 84 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 21 గేట్లలో ఆరు గేట్లను పూర్తిగా మరో 15 గేట్లను ఐదు ఫీట్ల ఎత్తు లేపి మొత్తం 84 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.

Latest Updates