GST, నోట్ల రద్దుని ప్రశ్నిస్తావా : అన్నదాత సుఖీభవ మూవీకి సెన్సార్ బ్రేక్

narayanaకేంద్ర ప్రభుత్వ విధానాలను వేలెత్తి చూపిస్తావా.. జీఎస్టీని ప్రశ్నిస్తావా.. నోట్ల రద్దు నిర్ణయం తప్పు అంటావా.. రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదని చూపిస్తావా.. పేదలను బ్యాంకు వాళ్లు వేధిస్తున్నారని విమర్శిస్తావా.. ఇన్ని చేసిన తర్వాత కూడా నీ సినిమాకి ఎలా సర్టిఫికెట్ ఇస్తాం అంటున్నారు సెన్సార్ బోర్డు సభ్యులు. ఆర్.నారాయణమూర్తి తీసిన అన్నదాత సుఖీభవ సినిమా పూర్తయ్యి నెల రోజులు. విడుదల కోసం సెన్సార్ బోర్డ్ కు వెళ్లారు ఆర్.నారాయణమూర్తి. అయితే పైన చెప్పిన అంశాలను సినిమా నుంచి తొలగించాలని.. అప్పుడే సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేస్తాం అంటూ మూవీ విడుదలను అడ్డుకున్నారు సెన్సార్ బోర్డ్ సభ్యులు. ఈ కట్స్ అన్నీ చేసి.. మళ్లీ రావాలని.. అప్పుడు పరిశీలిస్తామని చెబుతున్నారంటూ అన్నదాత సుఖీభవ నిర్మాత, దర్శకుడు నారాయణ మూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలతో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నది మూవీలో వివరించాం అని.. ఎక్కడా వాస్తవానికి విరుద్ధంగా వెళ్లలేదని చెబుతున్నారు ఎర్రదండు స్టార్. నోట్ల రద్దు తర్వాత దేశంలోని ఆర్థిక పరిణామాలు, పేదలు పడిన ఇబ్బందులను ఎత్తి చూపామంటున్నారు. వీటితోపాటు రైతులకు గిట్టుబాటు ధర వస్తుందా అని ప్రశ్నించారు. పేదలు తీసుకునే అప్పులపై బ్యాంకు వాళ్లు నోటీసులు ఇవ్వటం.. ఇంట్లోని వస్తువులు వేలం వేయటం నిజం కాదా అంటున్నారు. గ్రామంలో అన్నదాత ఇబ్బందులను చూపిస్తే సెన్సార్ బోర్డ్ ఎందుకు అభ్యంతరం చెబుతుందో అర్థం కావటం లేదన్నారు. సెన్సార్ బోర్డ్ చెప్పిన కట్స్ అన్నీ తొలగిస్తే సినిమాలో ఏమీ ఉండదని.. ఆ డైలాగ్స్ లేకుండా సినిమా లేదన్నారు నారాయణమూర్తి. సెన్సార్ బోర్డు సభ్యుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
Posted in Uncategorized

Latest Updates