జీఎస్టీ పరిహారం వెంటనే ఇయ్యాలె

నిధులు, బకాయిలు విడుదల చేయాలె
నీతి ఆయోగ్​ సిఫార్సు చేసిన మేర ఆర్థిక సాయం చేయాలి
నిధుల విషయంలో తెలంగాణకు అన్యాయం
లోక్ సభ, రాజ్య సభల్లో వాయిదా తీర్మానాలు

న్యూఢిల్లీ,వెలుగు: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ పరిహారాన్ని, బకాయిలను వెంటనే విడుదల చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. నీతి ఆయోగ్​సిఫార్సు చేసిన మేరకు రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు కేకే, నామా, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, సంతోష్, మాలోతు కవిత, బీబీ పాటిల్, దయాకర్, లింగయ్య యాదవ్  ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. తర్వాత ఇదే డిమాండ్లతో లోక్​సభ, రాజ్యసభల్లో వాయిదా తీర్మానాలు అందించారు.

రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది: నామా

జీఎస్టీ పరిహారం, నిధుల బకాయిపై మాట్లాడేందుకు అవకాశం కల్పించాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ నినాదాలు చేశారు. దీంతో జీరో అవర్​లో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పడంతో ఆందోళన విరమించారు. జీరో అవర్​లో స్పీకర్  టైం కేటాయించడంతో.. పార్టీ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర్ రావు సభలో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులకు సీఎం కేసీఆర్​ ఎన్నిసార్లు లేఖలు రాసినా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని చెప్పారు. కేంద్రంలోని వివిధ శాఖల నుంచి రాష్ట్రానికి దాదాపు రూ.29, 891 కోట్లు రావాలన్నారు. జీఎస్టీ పరిహారం కింద రూ. 4,531 కోట్లు రావాల్సి ఉందని, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.450 కోట్లు, గ్రామీణాభివృద్ధికి ఆర్థిక సంఘం నిధులు రూ.312 కోట్లు, యూఎల్ బీ గ్రాంట్ కింద రూ.393 కోట్లు విడుదల చేయాల్సి ఉందన్నారు. మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు, మిషన్ కాకతీయకు రూ. 5 వేల కోట్లు ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి నీతి ఆయోగ్​ సిఫార్సు చేసిందని.. ఆ మేరకు నిధులు ఇవ్వాలని కోరారు. కేంద్రం నుంచి నిధులు అందక  ఇబ్బందులెదురవుతున్నాయన్నారు.

వాటా తక్కువ ఇచ్చారు: కేకే

దేశంలో ఆర్థిక మాంద్యం ప్రభావం లేదని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఎందుకు విడుదల చేయడం లేదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు ప్రశ్నించారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్నుల్లో రాష్ట్ర వాటాగా ఇప్పటివరకు గతేడాది కంటే 2.13% తక్కువ ఇచ్చారని చెప్పారు. వాస్తవానికి గతేడాదికంటే 6.2 % అదనంగా రావాల్సి ఉందన్నారు. అంటే 8.3 శాతం మేర నిధులు తక్కువగా వచ్చాయని పేర్కొన్నారు. అందుకే సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రికి లేఖ రాశారని చెప్పారు.

 

Latest Updates