జీఎస్టీతో చిన్నతరహా వ్యాపారాలు, యువత ఉద్యోగాలకు ఎదురుదెబ్బ

మరోసారి కేంద్రంపై రాహుల్ విమర్శలు
న్యూఢిల్లీ: జీఎస్టీతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు దెబ్బ తిన్నాయని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. తన తాజా వీడియో సిరీస్ లో మరోమారు కేంద్రంపై ఆయన విమర్శలు గుప్పించారు. దేశ ఎకానమీపై గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ)తో దారుణంగా దెబ్బ పడిందని రాహుల్ చెప్పారు. ఇండియన్ ఎకానమీలో జీఎస్టీ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం చెల్లించలేకపోతోందని, దీంతో తమ ఉద్యోగులు, టీచర్లకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్రాలు ఉన్నాయని పేర్కొన్నారు.

‘దేశ జీడీపీ చారిత్రక క్షీణతకు మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చిన గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ) కారణం. లక్షలాది చిన్న వ్యాపారాలను, యువత ఉద్యోగాలను ఇది వృథా చేసింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను చూస్తుంటే జీఎస్టీ అంటే వినాశకారిలా కనిపిస్తోంది. చిన్న, మధ్య తరహా వ్యాపారులు ట్యాక్స్ చెల్లించలేరు. అదే పెద్ద కంపెనీలు పది, పదిహేను మంది అకౌంటెంట్స్ ను నియమించుకోవడం ద్వారా సులువుగా పన్నులు కట్టేస్తాయి. రేట్లలో అంత వైవిధ్యత ఎందుకు మరి?’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఇండియాలో 15-20 మంది పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారని, వారు జీఎస్టీ పాలసీలో తాము కోరుకున్న ఏ చట్టాన్నయినా మార్చుకునే సౌలభ్యం ఉందని రాహుల్ ఆరోపించారు.

Latest Updates