జిల్లాల్లోనూ జీఎస్‌టీ సెషన్స్‌

సమస్యల పరిష్కారానికి కొత్త పద్ధతి

హైదరాబాద్‌‌, వెలుగు: జీఎస్‌‌టీలో ఇబ్బందుల పరిష్కారానికి హైదరాబాద్‌‌లోనే కాకుండా జిల్లా కేంద్రాలలోనూ సెషన్స్‌‌ నిర్వహించాల్సిందిగా అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ సూచించారు. అమలులోకి వచ్చి మూడేళ్లవుతున్నా జీఎస్‌‌టీ విధానంలో ఇంకా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పరిశ్రమ, వాణిజ్య వర్గాలు చెప్పడంతో అప్పటికప్పుడే ఆర్థిక మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశమంతటా జిల్లా కేంద్రాలలో ఇలాంటి సెషన్స్‌‌ నిర్వహించాలని వారిని కోరారు. జన్‌‌ జన్‌‌ బడ్జెట్‌‌ 2020 పేరిట ప్రవేశ పెట్టిన బడ్జెట్‌‌పై వ్యాపార, పరిశ్రమ వర్గాల ప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి హైదరాబాద్‌‌లో ఆదివారం నాడు ఇష్టాగోష్టి నిర్వహించారు. ఇలాంటి సెషన్స్‌‌ను ముంబై, కోల్‌‌కత్తా, చెన్నైలలో ఇప్పటికే నిర్వహించారు. బడ్జెట్‌‌ తర్వాత ఇలాంటి సెషన్స్‌‌ నిర్వహించడం ఈ ఏడాదే మొదలు పెట్టారు. సుదీర్ఘ బడ్జెట్‌‌ ప్రసంగం చేసిన వ్యక్తిగానే కాకుండా, జులై–ఫిబ్రవరి మధ్య (సుదీర్ఘ) కాలంలో బడ్జెట్‌‌ రూపొందించిన వ్యక్తిగా నిలిచిపోవడానికి ఇష్టపడతానని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌‌ తెలిపారు. ఆదివారమైనా ఆసక్తితో వచ్చిన అందరికీ కృతజ్ఞతలు చెబుతూ, సెలవు రోజున కూడా ఆర్థిక శాఖ పనిచేస్తోందనడానికి ఈ ఇష్టాగోష్టే నిదర్శనమని చమత్కరించారు. ఒక్క పరిశ్రమ, వ్యాపారులు, ఛార్టర్డ్‌‌ అకౌంటెంట్స్‌‌ వంటి ప్రొఫెషనల్స్‌‌ కోసమే కాకుండా, జనం అందరికీ కనెక్ట్‌‌ అయ్యేలా బడ్జెట్‌‌ ప్రసంగం ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కోరారని, అందుకనుగుణంగానే ఆర్థిక శాఖ కసరత్తు చేసిందని చెప్పారు. జులై–ఫిబ్రవరి మధ్యలో వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులను కలుసుకుని, వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకుని శ్రద్ధతో జన్‌‌ జన్‌‌  బడ్జెట్‌‌ రూపొందించినట్లు వెల్లడించారు.

బల్క్‌‌డ్రగ్‌‌లో మళ్లీ లీడరవ్వాలి…

బల్క్‌‌డ్రగ్స్‌‌ (యాక్టివ్‌‌ ఫార్మా ఇన్‌‌గ్రీడియెంట్స్‌‌) రంగంలో మళ్లీ ఇండియా ముందంజ వేసేలా ఒక ప్లాన్‌‌ రూపొందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఏపీఐ తయారీలో ఒకప్పుడు మనమే రారాజులమని, మళ్లీ మన పరిశ్రమ పాత వైభవం పొందేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇండియాలో యాపీఐ తయారీలో తెలంగాణ రాష్ట్రం కూడా కీలకమైనది. ఎంఎస్‌‌ఎంఈల కోసమూ బడ్జెట్లో ఎన్నో చర్యలు ప్రకటించామని, బ్యాంకుల నుంచి ఎక్కువ నిధులు వాటికి దొరికేలా చొరవ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రెండు సెషన్స్‌‌గా సాగిన ఆదివారం కార్యక్రమంలో ఆర్థిక మంత్రితోపాటు, రెవెన్యూ సెక్రటరీ అజయ్‌‌ భూషణ్‌‌ పాండే, ఫైనాన్స్‌‌ సెక్రటరీ  రాజీవ్‌‌ కుమార్‌‌, ఫైనాన్షియల్‌‌ ఎఫైర్స్‌‌ సెక్రటరీ అతను చక్రవర్తి, అగ్రికల్చర్‌‌ సెక్రటరీ సోమనాథన్‌‌, సీబీడీటీ ఛైర్మన్‌‌ పీ సీ మోడి, సీబీఐసీ ఛైర్మన్‌‌ అజిత్‌‌ కుమార్‌‌లు కూడా పాల్గొన్నారు. పరిశ్రమ, వ్యాపార వర్గాలతోపాటు, ఎకానమిస్టులు, ప్రొఫెషనల్స్‌‌ వ్యక్తం చేసిన సందేహాలకు ఆర్థిక మంత్రి, అధికారులు సమాధానమిచ్చారు. పౌల్ట్రీ, స్పోర్ట్స్‌‌ ఎక్విప్‌‌మెంట్‌‌, మెడికల్‌‌ ఎక్విప్‌‌మెంట్‌‌, కో–ఆపరేటివ్‌‌ సెక్టార్‌‌, బ్యాంకింగ్‌‌ వంటి వాటిపై ప్రతినిధులు ఇచ్చిన సలహాలను తీసుకున్నారు.

ఎఫ్‌‌ఆర్‌‌బీఎం రూల్స్‌‌ ప్రకారమే…

ఆర్థిక వ్యవస్థలోని అన్ని అంశాలను స్పర్శించడం కూడా ఈ బడ్జెట్‌‌ ప్రత్యేకతగా ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఎకానమీలో స్లోడౌన్‌‌ అరికట్టేందుకు వినియోగం (కన్సంప్షన్‌‌) పెంచేలా బడ్జెట్లో చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే, ఇదే సమయంలో వాజ్‌‌పేయి నాటి నుంచి పెట్టుకున్న రూల్స్‌‌ను అనుసరించే బడ్జెట్‌‌ రూపొందించామన్నారు. అప్పటి నుంచే పాటిస్తున్న ఫిస్కల్‌‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌‌ బడ్జెట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ (ఎఫ్‌‌ఆర్‌‌బీఎం) నిబంధనలకు అనుగుణంగానే తాజా బడ్జెట్‌‌ తయారైందని తెలిపారు. ఫిస్కల్‌‌ డిసిప్లిన్‌‌ చాలా ముఖ్యమైనదని, అందులో రాజీ పడే ప్రసక్తే లేదని నిర్మలా సీతారామన్‌‌ చెప్పారు. ఎకానమీ స్లోడౌన్‌‌ దృష్టిలో పెట్టుకునే బడ్జెట్‌‌ కంటే ముందు నుంచే వివిధ రంగాలకు ఊతమిచ్చేందుకు చర్యలు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్‌‌బీఎఫ్‌‌సీలు, బ్యాంకుల మెర్జర్‌‌, కార్పొరేట్‌‌ ట్యాక్స్‌‌ తగ్గింపు వంటి చర్యలను ప్రస్తావించారు.

Latest Updates