స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడుతున్నారా ?

guidelines for swimming safety in swimming pool
  • చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి
  • లోతు ప్రాంతాల్లోకి వెళ్లకుండా చూడాలి
  • నిర్వాహకులు ఎప్పటికప్పుడు నీటిని మార్చాలి
  • అప్రమత్తం గా ఉంటే హాయిగా ఈత నేర్చుకోవచ్చు

హైదరాబాద్‌, వెలుగు: సమ్మర్‌లో చిన్నారులు ఈత కొట్టేందుకు ఆసక్తి చూపుతారు. స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగి  జలకాలాడాలని తహతహలాడతారు. కానీ ఇటీవలి కాలంలో జంట నగరాల్లోని పలు స్విమ్మింగ్‌ పూల్స్‌లో  అజాగ్రత్త, నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. సరదాగా ఈత కొడదామని వచ్చిన వారు అకారణంగా మునిగి చనిపోతున్నారు. చిన్నారులు, వెంట వెళ్లే పెద్దలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్వాహకులు సైతం నిబంధనలు పాటించాలి. లేకుంటే దురదృష్టవశాత్తూ ఘటనలు జరిగి విలువైన ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి.

రబ్బరు ట్యూబులు వాడాలి

చిన్నారులు రబ్బరు ట్యూబులు వేసుకోవాలి. ఇవి వేసుకుంటే నీటిలో మునిగిపోయే అవకాశం ఉండదు. చిన్నారులు నీళ్లలో ఉన్నప్పుడు పెద్దలు అనుక్షణం గమనిస్తూ ఉండాలి. ఒంటరిగా విడిచిపెట్టి బయటకు వెళ్లకూడదు.  చిన్న పిల్లలు లోతులోకి వెళ్లకుండా చూసుకోవాలి.  ట్రైనర్లు ఈత నేర్పడంలో పిల్లలకు సాయపడటంతో పాటు నీటిలో ఎలా ఉండాలనే దానిపై అవగాహక కల్పించాలి.  స్విమ్మింగ్‌ పూల్‌లోని నీటిని తాగరాదు.  వాటిలోకి దిగే ముందే నీరు పరిశుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి.

ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి

స్విమ్మింగ్‌ పూల్‌లో ఎన్ని గంటలు ఈత కొడుతున్నారనే లెక్కల ఆధారంగా నిర్వాహకులు నీటిని మారుస్తుండాలి. ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలి. ఎక్కడ ఎంత లోతు ఉందన్న వివరాలను బోర్డుపై  రాసి పెట్టాలి.  సమ్మర్‌లో పిల్లలకు డయారియా సోకే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి ఉన్న పిల్లలు ఈత కొడితే  ఇతరులకు సోకుతుంది. అలాంటి సందర్భాల్లో  పిల్లలను అనుమతించకపోవడమే మంచిది. చిన్న పిల్లలకు ఈత నేర్పేటప్పుడు కూడా ఎక్కువ లోతు లేని ప్రాంతంలో నేర్పించాలి. దూకేటపుడు ముక్కు మూసుకుని దూకమని పిల్లలకు చెప్పాలి. అలా చేయడం వల్ల జలుబు వంటి వ్యాధులు దరిచేరవు.

వ్యాధులున్న వారు జాగ్రత్త

స్విమ్మింగ్ పూల్‌లో రకరకాల వ్యక్తులు, వ్యాధులు ఉన్నవారు ఈత కొడుతుంటారు. వీరు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఇక ఈతకు ముందు మరుగుదొడ్లకు వెళ్లి వస్తే చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కుని స్విమ్మింగ్ పూల్‌లోకి దిగాలి. లేకుంటే రోగకారక క్రిములు స్విమ్మింగ్‌ పూల్‌ లోకి చేరుతాయి. తద్వారా వ్యాధులు వచ్చే అవకాశం లేకపోలేదు. నీటి మీద తెట్టు వంటి పొర కనబడ కూడదు. తెట్టులాంటి పొర కనిపిస్తే, పూల్ యజమానికి ఫిర్యాదు చేసి నీటిని శుభ్రపరచమని చెప్పాలి.

ట్రైనర్లు తరచూ గమనించాలి

స్విమ్మింగ్ పూల్‌లో అడుగున ఉన్న భాగం స్పష్టంగా కనిపిస్తుండాలి. లేదంటే ఆ నీటిలో ఏదో తేడా ఉన్నట్లు గుర్తించాలి. ఎక్కువలోతులోకి ఈత వచ్చిన వారు మాత్రమే వెళ్లాలి. ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని ట్రైనర్లు తరచూ గమనిస్తూ ఉండాలి. ఏ ఒక్కరు తక్కువైనా వెంటనే అప్రమత్తం కావాల్సి ఉంటుంది. ఎవరైనా  నీటిని మింగి అపస్మారక స్థితిలోకి వెళ్తే,  వెంటనే ఒడ్డుకు తీసుకొచ్చి నీరు బయటకు వచ్చేలా ప్రాథమిక చికిత్స చేయాలి. ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. అన్నింటికీ మించి స్విమ్మింగ్‌ పూల్‌లో నీటిని క్లోరిన్‌తో శుభ్రం చేయాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలు సులభంగా ఈత నేర్చుకుంటారు.

Latest Updates