
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మాధవ్‌సింగ్ సోలంకి (94) శనివారం ఉదయం కన్నుమూశారు. మాధవ్‌సింగ్ సోలంకి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా విదేశాంగ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సోలంకి సీఎం కావడానికి ముందు లాయర్‌గా పనిచేసేవారు. సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను సోలంకి ప్రవేశపెట్టారు.
మాధవ్‌సింగ్ సోలంకి మొదటిసారిగా 1976లో సీఎంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత గుజరాత్లో విద్యుత్ సమస్యలను తీర్చడానికి ఆయన KHAM కూటమిని ఏర్పాటుచేశారు. KHAM (క్షత్రియా, హరిజన్, ఆదివాసీ, ముస్లిం) సహకారంతో ఆయన 1980లో మరోసారి అధికారంలోకి చేపట్టారు.
మాధవ్‌సింగ్ సోలంకి 1985లో తన సీఎం పదవికి రాజీనామా చేసి.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో భారీగా సీట్లను గెలుచుకున్నారు. రాష్ట్రంలోని 182 అసెంబ్లీ స్థానాల్లో 149 గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో బీజేపీ కేవలం తొమ్మిది స్థానాలను మాత్రమే గెలుచుకుంది.
మాధవ్‌సింగ్ సోలంకి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తన సంతాపాన్ని ప్రకటించారు. దశాబ్దాలుగా గుజరాత్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాధవ్‌సింగ్ సోలంకి చాలా గొప్ప నాయకుడు అని ప్రధాని మోడీ అన్నారు.
‘గుజరాత్ రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన శ్రీ మాధవ్‌సింగ్ సోలంకి జీ బలీయమైన నాయకుడు. సమాజానికి ఆయన చేసిన గొప్ప సేవ.. ఆయనను ఎప్పటికీ గుర్తుండేలా చేస్తుంది. ఆయన మరణం చాలా దిగ్ర్బాంతి కలిగించింది. ఆయన కుమారుడు భరత్‌తో మాట్లాడి ధైర్యం చెప్పాను. ఓం శాంతి.’
‘రాజకీయాలను పక్కనపెడితే.. మాధవ్‌సింగ్ సోలంకి చదవడం పట్ల ఎంతో ఇష్టంగా ఉండేవారు. ఆయన సంస్కృతి పట్ల మక్కువ కలిగి ఉన్నారు. నేను ఆయనను కలిసినప్పుడు లేదా ఆయనతో మాట్లాడినప్పుడల్లా పుస్తకాల గురించి తప్పకుండా చర్చిస్తాం. ఆయన ఇటీవల చదివిన కొత్త పుస్తకం గురించి నాకు చెప్పాడు. నేను ఆయనను కలవడానికి ఎప్పుడూ ఇష్టంగానే ఉంటాను’అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
For More News..