నిన్న కాలేజీ.. నేడు హాస్పిటల్: మహిళా ఉద్యోగుల్ని ఒకేసారి నగ్నంగా నిలబెట్టి..

గుజరాత్‌లోని భుజ్‌లో ఓ కాలేజీలో 66 మంది విద్యార్థినులను పీరియడ్స్‌లో ఉన్నారన్న అనుమానంతో దుస్తులు విప్పించి చెక్ చేసిన కొద్ది రోజులకే మరో అనాగరిక ఘటన జరిగింది. అదే రాష్ట్రంలోని సూరత్‌ మున్సిపల్ కార్పొరేషన్ కింద నడిచే ఓ ఆస్పత్రిలో మహిళా ఉద్యోగుల పట్ల లేడీ డాక్టర్లే దారుణంగా ప్రవర్తించారు. తోటి మహిళల్ని గౌరవప్రదంగా చూడాలన్న ఆలోచన కూడా లేకుండా మెడికల్ టెస్టుల పేరుతో ఒకేసారి పది మంది ట్రైనీ ఉద్యోగుల్ని దుస్తులు విప్పించి నగ్నంగా నిలబెట్టారు. గురువారం జరిగిన ఈ ఘటనపై ఆ మహిళల ఫిర్యాదుతో ఎంక్వైరీకి కమిటీని నియమించింది హాస్పిటల్ యాజమాన్యం.

పెళ్లికాని యువతుల్ని కూడా ప్రెగ్నెన్సీ గురించి..

గుజరాత్‌లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ కింద నడిచే సూరత్ మున్సిపల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్స్ (స్మిమర్)లో వేర్వేరు విభాగాల్లో పని చేసే 10 మంది మహిళా ట్రైనీ క్లర్క్‌ల పట్ల గైనకాలజీ డాక్టర్లు అమానుషంగా ప్రవర్తించారు. ఇక్కడ నిబంధనల ప్రకారం మూడేళ్ల పాటు పని చేసిన ట్రైనీ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తారు. అయితే దానికి ముందు వారికి ఫిజికల్ ఫిట్‌నెస్, మెడికల్ టెస్టులు చేస్తారు. ఈ ప్రొసీజర్‌లో భాగంగా పది మంది మహిళా ట్రైనీ క్లర్క్‌లను ఒకేసారి దుస్తులు విప్పించి గైనకాలజీ డిపార్ట్‌మెంట్‌లోని లేడీ డాక్టర్ తన గదిలో నిలబెట్టింది. వారికి ప్రెగ్నెన్సీ ఉందా లేదా అన్న టెస్టులు చేసింది. ఇలా ఒకేసారి పది మందిని గ్రూప్‌గా పిలిచి నగ్నంగా నిలబెట్టడం దారుణమని వారు హాస్పిటల్ డీన్ వందనా దేశాయ్‌కి ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరిని పిలిచి టెస్టులు చేయాల్సిన డాక్టర్ ఇలా ప్రవర్తించడం జుగుప్సాకరంగా ఉందన్నారు.

అలాగే ఆ పది మందిలో కొందరు పెళ్లికాని యువతులు కూడా ఉన్నారు. వారు ఆ విషయం చెప్పినా వినకుండా.. ప్రెగ్నెన్సీతో పాటు ఇతర ప్రైవేటు ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టింది ఆ డాక్టర్. వారికి కూడా ప్రెగ్నెన్సీ టెస్టులు చేసింది. ఇది తోటి ఉద్యోగుల మధ్య తమను అవమానించడమేనని వారు అన్నారు.

ఈ ఘటనపై బాధిత మహిళలు డీన్‌కి ఫిర్యాదు చేయడంతో ముగ్గురు సభ్యుల బృందాన్ని ఎంక్వైరీ చేయాల్సిందిగా ఆదేశించారు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్‌ కూడా ఈ ఘటనపై స్పందించింది. బాధిత మహిళలకు అండగా నిలిచింది. టెస్టులు చేయడానికి తాము వ్యతిరేకంగా కాదని, కానీ ఒకేసారి అలా నగ్నంగా నిలబెట్టడం దారుణమని యూనియన్ నేతలు అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఏం జరిగిందన్న దానిపై తమకు రిపోర్టు పంపాలని, అలాగే తీసుకున్న చర్యలపైనా వేగంగా నివేదించాలని సూచిస్తూ ఆ రాష్ట్ర సీఎస్‌కు లేఖ రాసింది.

ఇటీవల గుజరాత్‌ భుజ్‌లోని ఓ కాలేజీలో అమ్మాయిలు నెలసరిలో ఉన్నారో లేదో పరీక్షించేందుకు ప్రిన్సిపాల్ హాస్టల్ రెక్టార్ కలిసి దుస్తులు విప్పించిన ఘటన జరిగింది. దీనిపై దర్యాప్తుకు ఆదేశించిన ఆ కాలేజీ యాజమాన్యం.. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసింది. అలాగే పలు సెక్షన్ల కింద బాధ్యులపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.

More News:

 వైరల్ వీడియో: డాక్టర్లు తలకి ఆపరేషన్ చేస్తుంటే.. వయోలిన్ వాయించిన పేషెంట్

అమ్మాయిలతో దుస్తులు విప్పించిన ప్రిన్సిపాల్

Latest Updates