
సౌదిలోని జే అండ్ పీ కంపెనీ మోసం తో రోడ్డు పాలైన తెలంగాణకు చెందిన గల్ఫ్బాధితులు 39 మంది సోమవారం స్వదేశానికి చేరుకోనున్నారు. గతేడాది అక్టోబర్‍లో జే అండ్ పీ కంపెనీ ఇతరులకు విక్రయించడంతో సదరు కంపెనీలో పని చేస్తున్న సుమారు 600 మంది తెలంగాణకు చెందిన కార్మికులు రోడ్డు పాలయ్యారు. ఇందులో కొందరు స్వదేశానికి తిరిగి రాగా, అకామా లేనివారిని సౌది ప్రభుత్వం స్వదేశానికి పంపేందుకు నిరాకరించింది. దీంతో అక్కడే క్యాంప్‍లో తలదాచుకున్నారు. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ఇండియన్ ఎంబసీపై ఒత్తిడి తేవడంతో సౌది ప్రభుత్వంతో చర్చలు జరిపి స్వదేశానికి పంపించేలా చర్యలు తీసుకుంది. దీంతో 39 మంది తెలంగాణ వాసులను ఈ నెల 17న సోమవారం సాయంత్రం 4:40 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. మిగిలిన వారు ఈ నెల 20న వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు ఎంబసీ ఆఫీసర్లు తెలిపారు.