నరకయాతన నుంచి విడుదల.. హైదరాబాద్‌కు చేరిన గల్ఫ్ బాధితులు

ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి.. ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులు తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఇరాక్‌లో చిక్కుకున్న 16 మంది తెలంగాణ బిడ్డలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో శనివారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సొంత ప్రాంతానికి రప్పించేందుకు  సాయం చేసినందుకు మంత్రి కేటీఆర్‌కు వాళ్లు కృతజ్ఞతలు తెలిపారు.

సొంత ఊరిలో ఉపాధి లేక పొట్ట చేతబట్టుకుని వలస బాటపట్టారు. నాలుగేళ్ల క్రితం గల్ఫ్ ఏజెంట్ల ద్వారా ఇరాక్ చేరిన 16 మంది తీరా అక్కడికి చేరాక అడ్డంగా మోసపోయామని తెలుసుకున్నారు. కానీ తిరిగి స్వస్థలానికి రాలేని పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. నకిలీ ఏజెంట్ల మోసంతో నానాకష్టాలు పడుతున్నామని, కనీసం తాగడానికి నీరు, తినడానికి తిండి కూడా లేక నరకయాతన అనుభవిస్తున్నామని మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీని ఆయన స్పందించి భారత విదేశాంగ సహాయంతో వారిని స్వస్థలానికి రప్పించే ప్రయత్నం చేశారు. నిన్న రాత్రి ఇరాక్‌లో బయలుదేరిన 16 మంది బాధితులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆపదలో ఉన్న తమను రక్షించి తిరిగి రాష్ట్రానికి చేర్చినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారంతా ధన్యవాదాలు తెలిపారు.

Latest Updates