పాజిటివ్ వచ్చినా పట్టించుకుంటలే..ఆందోళనలో గల్ఫ్ కార్మికులు

నిజామాబాద్/ఆదిలాబాద్, వెలుగు తెలంగాణ జిల్లాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన లక్షలాది మంది జీవితాలు కరోనాతో ప్రమాదంలో పడ్డాయి. సౌదీ అరేబియాలో నెల రోజుల క్రితం ప్రతి రోజు పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్  కేసులు నమోదయ్యేవి. ప్రస్తుతం రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం నాటికి సౌదీలో  15 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇతర గల్ఫ్ దేశాలు దుబాయి, మస్కట్, ఖతార్‍లలో కూడా పరిస్థితి అలాగే ఉంది. ఇప్పటికే చాలామంది కార్మికులు పనులకు వెళ్లకుండా లేబర్  క్యాంపులోని వారుండే గదులకే పరిమితమయ్యారు. కొంతమంది మాత్రం రెండు రోజులకోసారి షిఫ్టుల వారీగా పనులకు వెళుతున్నారు. వారు పని చేస్తున్నచోట కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో భయం భయంగానే పని చేస్తున్నట్లు కార్మికులు చెబుతున్నారు. క్యాంపుల్లోని గదుల్లో  వందల మంది ఉన్నారని, వీరిలో ఎందరికి వైరస్ సోకిందో ఎవరికీ అంతుబట్టని విధంగా ఉందని మెదక్ జిల్లాకు చెందిన మధుసూదన్‍ తెలిపారు. కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన వారితో కలిసుంటున్నామని, ఇతర గదుల్లో కూడా వేర్వేరు జిల్లాలు,  రాష్ట్రాలకు చెందిన వారు కలిసి ఉంటున్నారని వరంగల్ కు చెందిన రాధాకిషన్ పేర్కొన్నారు.

అందరిలో భయం

పాజిటివ్ వ్యక్తుల్లో తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వారితో పాటు, కేరళ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినవారు కూడా ఉన్నారు. వీరంతా ఇప్పుడు చిన్న చిన్న గదుల్లో పక్కపక్కనే ఉంటున్నారు.  ఐదారుగురు వ్యక్తులకు ఒక గది చొప్పున  కేటాయించారు. పేరుకు వేర్వేరు గదుల్లో ఉంటున్నప్పటికీ, క్యాంపులోని వారు వాడుకునే బాత్‍రూంలు, వంటగదులన్నీ కామనే. ప్రమాదకరమని తెలిసినా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో పాటే కలిసి ఉండాల్సి వస్తోంది. కరోనా పాజిటివ్ వ్యక్తులకు భోజనాలు కిటికీ గుండా అందిస్తున్నారని చెబుతున్నారు. వారి పక్కనే ఉంటున్న తమకు కూడా వైరస్​ అంటుకుంటుందేమోననే భయంతో గడుపుతున్నారు. సౌదీ అరేబియాలో పాజిటివ్ అని తేలిన వ్యక్తులను కూడా ఐసోలేషన్ కు తరలించకుండా వారుంటున్న రూంలోనే ఉంచుతున్నారు. తినడానికి తిండి పెడుతున్నారే తప్ప మరేం చర్యలు చేపట్టడం లేదని వారు వాపోతున్నారు. దుబాయిలోని అజ్మా న్‍అల్జుర్ఫ్ బెల్హాసా లేబర్ క్యాంపులో ఉంటున్న తెలంగాణ కార్మికులు 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిని ఐసోలేషన్ సెంటర్‍కు తరలించలేదు. యూఏఈలో ఉంటున్న ఇండియన్స్​లో సస్పెక్టెడ్​లను గుర్తించి రూముల్లో బందీ చేస్తున్నారు. వారికి కనీస వైద్యం కూడా చేయడం లేదు. ఒకే గదిలో పాజిటివ్, నెగిటివ్​ వ్యక్తులను కలిపి ఉంచుతుండడంతో అందరికీ వైరస్​సోకుతోంది. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం అసలే పట్టించుకోవడం లేదు. బకెట్లకు తాళ్లు కట్టి వాటిలో ఆహారం, నీళ్లు పంపిస్తున్నారు. నేరుగా వారిని అసలే  కలవడం లేదు. భారత ప్రభుత్వం, తెలంగాణ సర్కారు తమ పరిస్థితిని గుర్తించి ప్రత్యేక ఫ్లయిట్లు ఏర్పాటు చేసైనా తమను దేశానికి రప్పించాలని ప్రధాని మోడీని, సీఎం కేసీఆర్ ను గల్ఫ్​కార్మికులు వేడుకుంటున్నారు.

గల్ఫ్ బాధితులను ఆదుకోవాలి

గల్ఫ్ దేశాల్లో తెలంగాణ జిల్లాల్లోని వేల మంది కార్మికులు దీనావస్థలో ఉన్నారు. వారు అక్కడ అనుభవిస్తున్న కష్టాలను వీడియోల్లో చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఇండియన్ ఎంబసీ ద్వారా వారిని ఆదుకునే చర్యలు చేపట్టాలి. ప్రత్యేక ఫ్లయిట్లను ఏర్పాటు చేసి స్వదేశానికి రప్పించాలి. ఈ  పరిస్థితుల్లో వారక్కడే ఉంటే చాలామంది ప్రాణాలు కోల్పోయేలా ఉన్నారు.

-పాట్కూరి బసంత్ రెడ్డి, తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్

Latest Updates