ఇవాళ్టి నుంచి గురుకుల ఉద్యోగాల రాత పరీక్షలు

ఇవాళ్టి నుంచి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో జూనియర్, డిగ్రీ లెక్చరర్ల నియామక రాత పరీక్షలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులకు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణకు గాను హైదరాబాద్ జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలో 37 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తంగా 19,888 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు. 14, 15, 17 తేదీల్లో డిగ్రీ లెక్చరర్లు, 16, 17 తేదీల్లో జూనియర్ లెక్చరర్లకు పలు రకాలైన సబ్జెక్ట్‌ లకు రాత పరీక్షను నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్, పరీక్షల చీఫ్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ జి.రవి, జిల్లా ఇన్‌చార్జి డీఆర్వో వెంకటేశ్వర్లు తెలిపారు.

ఉదయం 10 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 170 మంది సీఎస్‌డీవో, 425 హాల్ సూపరింటెండెంట్లు, 935 ఇన్విజిలేటర్లను, ఆరు రూట్లకు గాను రూట్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం జిల్లా కలెక్టరేట్‌ లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని, అభ్యర్థులు ఏవైనా సందేహాలుంటే 040 -23204833, 94408 15865/52 నంబర్లను సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులను పూర్తిగా తనిఖీ, బయోమెట్రిక్ హాజరును నమోదు చేసిన తర్వాతే పరీక్షా కేంద్రం హాల్లోకి అనుమతిస్తామని వారు తెలిపారు..

Latest Updates