ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చిన గురజాడ పత్రిక  ‘ప్రకాశిక’

సమాజం కోసం, సమాజానికి ఉపయోగపడే సాహిత్యం కోసం తన జీవితంలోని ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసుకున్న ధన్యకవి గురజాడ. అహరహం సాంఘిక పరివర్తన కోసం శ్రమించారాయన. అందరికీ అర్ధమయ్యే జీవభాషలో రచనలు చేశారు. కానీ ఇప్పటి వరకూ ఎవరికీ పెద్దగా తెలియని ఆయన కృషి ఒకటుంది. అదేంటంటే, గురజాడ కొంతకాలం పత్రిక కూడా నడిపారు. దానిపేరు ‘ప్రకాశిక’.  ఇది పదిహేను రోజులకోసారి వచ్చే పక్ష పత్రిక.1886లో దీనిని స్థాపించారాయన. ముద్రణ రూపంలో కాకుండా, రాతప్రతులుగా దీన్ని తీసుకువచ్చారు. పేరుకు తగ్గట్టుగా కొంతకాలం అది ప్రకాశించింది. తర్వాత కనుమరుగై పోయింది. గురజాడ సాహిత్య, జీవిత విశేషాల్లోనూ ఈ పత్రిక గురించి పెద్దగా ప్రస్తావనలోకి రాకపోవడం విస్మయం కలిగించే విషయం. ఈ పత్రిక గురించి 1911లో ఒక స్నేహితుడికి గురజాడ ఉత్తరం రాశారు. 25ఏళ్ల క్రితం ప్రకాశిక అనే పత్రిక స్థాపించినట్లుగా అందులో ప్రస్తావించారు. గురజాడపై డాక్టర్  కామిశెట్టి సత్యనారాయణ రాసిన పరిశోధనా గ్రంథం ద్వారా ‘ప్రకాశిక’ విషయం ఆ లేఖలో రాసినట్లు బయటపడింది.

 

అప్పట్లో గురజాడ ఇంట్లో పెద్ద దొంగతనం జరిగింది. ఆ దొంగలు బోలెడు సాహిత్య సంపదను కూడా పట్టుకుపోయారు. ఇన్నేళ్లకు, ఇన్నాళ్లకు  గురజాడ కుటుంబ సభ్యులు మళ్లీ ఈ పత్రికను బయటకు తెస్తున్నారు. గురజాడ 105వ వర్ధంతి సందర్బంగా నవంబర్ 30 నుంచి ‘ప్రకాశిక’ను  అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గురజాడ ఫౌండేషన్ (అమెరికా) ఈ బాధ్యతను తీసుకుంది.  డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ, గురజాడ అప్పారావు మనుమరాలు అరుణ ఇందులో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. గురజాడ మనుమడు రవీంద్రుడు తగు సమాచారం, సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ లో త్రైమాసిక పత్రికగా వెలువడనుంది. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ముద్రణా రూపంలోనూ బయటకు రానుంది. గురజాడ రచనలు, ఆయన చెప్పిన రసగుళికల్లాంటి మాటలు ఇందులో పొందుపరుస్తున్నారు. పేరు ప్రతిష్టలున్న సాహితీవేత్తలు,  జర్నలిస్టులు వ్యాసాలు అందిస్తున్నారు. మమత, సమత, మానవతకు ప్రకాశిక పత్రిక వేదికవుతుంది. ఈ మూడింటినీ చాటి చెప్పే అక్షరాలకు ఇది భూమిక అవుతుంది. నూతన ఆవిష్కరణలు, ఆధునిక ఆలోచనలు, ప్రాపంచిక దృక్పథం, దార్శనికత, దేశభక్తి, విశాల దృక్పథం, అభ్యుదయ భావాలు, సమాజ శ్రేయస్సు, సాంప్రదాయ నిరతి చుట్టూ ఈ పత్రిక ప్రయాణం ఉంటుంది. గురజాడ ఆలోచనలన్నీ ఇవే.

ఈ పత్రిక రాకతో సామాజిక హితానికి సాహిత్యం ఊతమవుతుంది. గురజాడ అప్పారావు ఎప్పుడో 1886లో 134 ఏళ్ల క్రితం ఈ పత్రిక తెచ్చారు.               ఆనాటి సమస్యలను, సమాజంలోని తీరుతెన్నుల్ని పత్రికలో గుదిగుచ్చి చెప్పారు. ఇప్పుకీ దాదాపుగా అవే సమస్యలు ఉన్నాయి. వాటికి తోడు కొత్త సమస్యలు వచ్చి చేరాయి. అప్పటి రచయితలు, పాఠకుల తీరు వేరు, ఇప్పటి రూపం వేరు. ఏది చెప్పినా వాడుక భాషలోనే చెప్పాలన్నది గురజాడ ఉద్దేశ్యం. ఇప్పటి పత్రికలు కూడా ఎలాగూ వాడుకభాషలోనే సంగతులన్నీ చెబుతున్నాయి. అక్కడక్కడా, అప్పుడప్పుడూ కాస్త కవిత్వం తొంగి చూస్తున్నా, ఎక్కువ శాతం అందరికీ అర్ధమయ్యే భాషలోనే నేటి పత్రికలు వస్తున్నాయి.

 

ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియా విస్తృత రూపం దాల్చింది. శాటిలైట్, యూట్యూబ్ చానెల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇన్నింటి మధ్య ‘ప్రకాశిక’ వికసించాలి. అరచేతిలో సాంకేతికత ఉన్న నేపథ్యంలో ప్రపంచంలో ఎక్కడ నుంచైనా పత్రికను చదువుకోవచ్చు. వ్యాసాలు తెప్పించుకోవచ్చు. ఇది నేటి ‘ప్రకాశిక’కు దొరికిన  వెసులుబాటు. 

కందుకూరి వీరేశిలింగం వివేకవర్దిని పత్రిక నడిపారు. కాళ్లకూరి నారాయణరావు మనోరంజని పత్రికను స్థాపించారు. ఆ కాలంలో కవులు, సాహితీవేత్తలు ఎందరో పత్రికలు నడిపారు. నేడు ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎక్కడో ఒకటి ఉంటే ఉండొచ్చు. ఇటువంటి వాతావరణంలో, గురజాడ వర్ధంతినాడు ఆయన ఏనాడో స్థాపించిన పత్రికను పునఃప్రకాశం చెయ్యాలనే ఆలోచన వచ్చిన వారి కుటుంబ సభ్యులకు, ఈ యజ్ఞానికి సహకరిస్తున్న అందరికీ అభినందనలు తెలుపుదాం. ప్రకాశిక ప్రకాశమానం, సామాజిక వికాసమానం అవ్వాలని అభిలషిద్దాం. -మా శర్మ, సీనియర్ జర్నలిస్ట్.

 

Latest Updates