H-1 B వీసా: ఇమ్మిగ్రేషన్ విభాగందే ఫైనల్ నిర్ణయం

హెచ్1బీ వీసాపై అమెరికా వెళ్లడం… అక్కడ ఉండటం ఇక మరింత కష్టతరం కానుంది. డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం ఈ వీసా జారీ నిబంధలను మరింత కఠినం చేసింది. ఈ నిబంధనల ప్రకారం.. హెచ్‌-1బీ వీసా గడువు తీరిపోయిన వారు అమెరికాలో ఎక్కువ రోజులు ఉండటానికి వీల్లేదు.

సెప్టెంబర్‌ 11వ తేదీ నుంచి అమెరికాలో పని చేస్తున్న విదేశీ ఐటీ ఉద్యోగులకు ఇలాంటి ఏ వెసులుబాటూ ఉండదు. అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం వీసా పొడిగింపునకు వచ్చిన దరఖాస్తు సక్రమంగా ఉందని ఇమ్మిగ్రేషన్‌ అధికారి భావిస్తేనే ఆమోదిస్తారు. లేదంటే  రిజక్ట్ తప్పదు. గతంలో మాదిరి నోటీసుల జారీ ఉండదు. అంతేకాదు వీసా పొడిగింపు దరఖాస్తు తిరస్కరించిన వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ నోటీసులు (NTA) జారీ చేస్తారు. అప్పటికీ వెళ్లకపోతే పదేళ్ల పాటు అమెరికా రాకుండా నిషేధం విధిస్తారు. వీసా పొడిగింపు దరఖాస్తులో ఏ లోపాలు లేకపోయినా ఇమ్మిగ్రేషన్‌ విభాగం రిజక్ట్ చేసిందని ఒకవేళ దరఖాస్తుదారుడు భావిస్తే అటార్నీ ద్వారా అప్పీల్‌ చేసుకోవచ్చు. అయితే గతంలో మాదిరిగా ఆ సమయంలో దరఖాస్తుదారుడు ఉద్యోగం చేయడానికి అర్హుడు కాడు.

అప్పీల్‌ పరిష్కారమయ్యే వరకు గరిష్టంగా 240 రోజులు అమెరికాలో ఉండవచ్చు. అప్పటికీ దరఖాస్తులో మార్పు లేకపోతే వెంటనే NTA జారీ చేస్తారు. అప్పుడు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. హెచ్‌1బీ వర్క్‌ వీసా కింద పని చేస్తూ పొడిగింపు  పర్మిషన్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగికి ఇమ్మిగ్రేషన్‌ విభాగం కారణం చెప్పకుండా NTA జారీ చేసి.. అతడిని ఉద్యోగం నుంచి తప్పించాలని కంపెనీని ఆదేశించే నిబంధనను ఇటీవల యూఎస్‌సీఐఎస్‌ అమల్లోకి తెచ్చింది.

అమెరికా ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త నిబంధనల కారణంగా అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది ఈ కంపెనీలకు జారీ చేసిన వర్క్‌ పర్మిట్‌ వీసాలు కేవలం 12 శాతం. అదే అమెరికన్‌ కంపెనీల విషయంలో పెద్దగా ఆంక్షలు లేకపోవడంతో వారు లబ్ధి పొందుతున్నారు. పెద్ద ఎత్తున ఆర్డర్లు చేతిలో ఉన్నా భారతీయ కంపెనీలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఇదే విషయాన్ని నాస్కామ్‌ చైర్‌ పర్సన్‌ దేబయాని ఘోష్‌ ఇటీవల విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ దృష్టికి తీసుకువెళ్లారు. అమెరికాలో ఇప్పటికప్పుడు టెక్నాలజీ రంగంలో 30 లక్షల మందికి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు దొరక్క టెక్నాలజీ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయని నాస్కామ్‌ తెలిపింది.

డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష పగ్గాలు స్వీకరించిన తర్వాత భారత ఐటీ కంపెనీలు నిపుణులైన అమెరికా జాతీయుల కోసం వందల  యూనివర్శిటీల్లో నియామకాలకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. అయినా ఫలితం లేకపోయిందని, ఉద్యోగాల్లో చేరిన తర్వాత 67 శాతం మంది మొదటి ఆరు నెలల్లోనే మానేస్తున్నారని, అందుకు కారణం వారిలో నైపుణ్యం లేకపోవడమేనని టీసీఎస్‌ ఓవర్సీస్‌ రిక్రూట్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వివరించారు. ప్రస్తుత పరిణామాలు రానున్న రోజుల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందిగా మారే అవకాశముందంటున్నారు నిపుణులు.

Posted in Uncategorized

Latest Updates