100 కోట్ల ఫోన్లకు హ్యాకింగ్​ రిస్క్

  •     ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మంది ఓల్డ్ వెర్షన్ ఓఎస్ నే వినియోగిస్తున్నరు
  •     ఆండ్రాయిడ్ 7, అంతకుముందు ఓఎస్​ ఉన్న వాటికే ప్రమాదం
  •     సెక్యూరిటీ అప్​డేట్స్ సపోర్ట్ చేయకపోవడమే కారణం
  •     కన్జ్యూమర్ వాచ్ డాగ్ ‘విచ్’ రిపోర్టులో వెల్లడి

వందలు.. వేలు… లక్షలు కాదు… ఏకంగా 100 కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లకు హ్యాకింగ్ ముప్పు పొంచి ఉందట. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మంది ఓల్డ్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) ను వినియోగిస్తున్నరట. ఇలాంటి ఓఎస్​లతో నడుస్తున్న డివైస్​లు సెక్యూరిటీ అప్ డేట్స్​ను సపోర్ట్ చేయవట. ఫలితంగా అవన్నీ హ్యాకింగ్​కు గురయ్యే ప్రమాదం ఉందట. హ్యాకర్లు వాటిలోని డేటా దొంగిలించడం, ర్యాన్సమ్ వేర్ (డేటాను దొంగిలించి డబ్బులు డిమాండ్ చేయడం), మాల్వేర్ ఎటాక్ లాంటి వాటికి పాల్పడే ప్రమాదం ఉందట. ఆండ్రాయిడ్ 7, అంతకంటే కిందిస్థాయి ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)తో నడుస్తున్న ఫోన్లు, టాబ్లెట్లకు ఈ హ్యాకింగ్ ముప్పు ఉందట. మరీ ముఖ్యంగా ఆండ్రాయిడ్ 4, అంతకంటే కిందిస్థాయి ఓఎస్ తో నడుస్తున్న డివైస్​లకు రిస్క్ ఎక్కువట.  కొనుగోలు చేసి రెండేండ్లయి, ఓల్డ్ ఓఎస్​లతో నడుస్తున్న ఫోన్లకు డెవలపర్స్ నుంచి సెక్యూరిటీ అప్ డేట్స్ రావట. కన్జ్యూమర్ వాచ్ డాగ్ ‘విచ్’ రిపోర్టులో ఈ మేరకు వెల్లడైంది. గూగుల్ డేటా ఆధారంగా ఈ స్టడీ చేసిన ‘విచ్’… యూజర్లు వెంటనే తమ డివైస్​ల సాఫ్ట్​వేర్ ను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. ప్రస్తుత ఓఎస్ వెర్షన్ ఆండ్రాయిడ్ 10. ఆండ్రాయిడ్ 9, 8 ఓఎస్​లను కూడా కొంతమంది వినియోగిస్తున్నారు. వీటిని గూగుల్ కంపెనీ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుండడంతో ప్రమాదమేమీ లేదు.

ఐదింటిలో రెండింటికి ముప్పు…

ప్రపంచ వ్యాప్తంగా 42.1 శాతం యూజర్లు ఆండ్రాయిడ్ 6, అంతకంటే కిందిస్థాయి ఓఎస్​లను వినియోగిస్తున్నారని గూగుల్ డేటాలో తేలింది. అదే విధంగా ఆండ్రాయిడ్ 7 కంటే తక్కువ ఓఎస్ లకు సంబంధించి 2019లో ఎలాంటి సెక్యూరిటీ అప్​డేట్స్ రిలీజ్ చేయలేదని ఆండ్రాయిడ్ బులెటిన్ పేర్కొంది. ఈ డేటాను విశ్లేషించిన విచ్​ కంపెనీ… ప్రపంచంలో ఓల్డ్ ఓఎస్​తో నడుస్తున్న డివైస్​లలోని ఐదింటిలో రెండు ఎలాంటి సెక్యూరిటీ అప్ డేట్స్ రిసీవ్ చేసుకోవడం లేదని వెల్లడించింది. మోటరోలా ఎక్స్, సామ్ సంగ్ గ్యాలక్సీ ఏ5, సోనీ ఎక్స్ పీరియా జెడ్‌‌2, గూగుల్ నెక్సాస్ 5, సామ్ సంగ్ గ్యాలక్సీ ఎస్6 ఫోన్లలోకి మాల్వేర్ ను ప్రవేశపెట్టగా సక్సెస్ అయింది. ఈ స్టడీ రిజల్ట్స్ ను గూగుల్ తో కూడా పంచుకుంది. దీనిపై టెక్ దిగ్గజం గూగుల్ స్పందించనేలేదు. ఈ నేపథ్యంలో ఎక్కువ కాలం సెక్యూరిటీ అప్​డేట్స్ ను రిసీవ్ చేసుకోలేని డివైస్​ల సెక్యూరిటీ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని విచ్​ పేర్కొంది. ‘‘ఖరీదైన ఆండ్రాయిడ్ డివైస్​లు సెక్యూరిటీ సపోర్ట్​ను కోల్పోతే యూజర్లు హ్యాకర్ల చేతికి చిక్కినట్టే. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ అప్ డేట్స్ కు సంబంధించి గూగుల్, ఫోన్ తయారీ సంస్థలు ముందుకొచ్చి వివరాలు వెల్లడించాలి. ఇలాంటి డివైజ్ లు ఎంతకాలం సెక్యూరిటీ సపోర్ట్ ను కలిగి ఉంటాయి. ” అని ‘విచ్’ కంప్యూటింగ్ ఎడిటర్ కేట్ బేవన్ అన్నారు.

మీ ఫోన్ కు హ్యాకింగ్ ముప్పు ఉందా

  • మీరు ఫోన్ కొనుగోలు చేసి రెండేండ్లు అయిందా? అయితే ఓఎస్ పాతదా? కొత్తదా? చెక్ చేసుకోండి. ఒకవేళ ఓల్డ్ వెర్షన్ ఓఎస్ అయితే వెంటనే అప్ డేట్ చేసుకోండి.
  • ఫోన్ ఓఎస్ 7.0 కంటే ముందుది అయితే అప్ డేట్ చేసుకునేందుకు ప్రయత్నించండి. ఒకవేళ అప్ డేట్ కాకపోతే హ్యాకింగ్ ప్రమాదం ఉన్నట్టే లెక్క.
  • ముఖ్యంగా ఆండ్రాయిడ్ 4, అంతకుముందు ఓఎస్ ఉన్న డివైస్​లను వాడుతున్న యూజర్లు జాగ్రత్తగా ఉండాలి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తప్ప.. మరే ప్లాట్ ఫామ్ నుంచి యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవద్దు.
  • అనుమానాస్పద ఎస్సెమ్మెస్ లు, ఎంఎంఎస్ ల విషయంలో కేర్ ఫుల్ గా ఉండాలి.
  • యాప్ ద్వారా మొబైల్ యాంటీ వైరస్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. అయితే ఇది పూర్తిస్థాయి సెక్యూరిటీని ఇస్తుందని చెప్పలేం.

Latest Updates