హఫీజ్​పేట భూ కబ్జాలపై మళ్లీ పోరాటం తప్పదు

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

హైదరాబాద్‌‌లో భూ మాఫియా, కబ్జాల వ్యవహారం కొద్ది రోజుల నుంచి హాట్ టాపిక్‌‌గా మారింది. హఫీజ్ పేట భూముల విషయంలో కిడ్నాప్ వ్యవహారం, ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టుతో ల్యాండ్ మాఫియా దందా అందరికీ తెలిసింది. అయితే ఈ వ్యవహారం ఇప్పటిది కాదు. దాని మూలాల్లోకి వెళ్తే ప్రభుత్వ భూమిని కాజేసి కోట్లలో దందా చేయాలని ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరిగాయి. ఈ భూముల విషయంలో ఎప్పటి నుంచో సీపీఐ పోరాటాలు చేసినా రక్షణ కరువైంది. ప్రభుత్వ భూమిని కాపాడేందుకే దిక్కులేదంటే, ఇక సామాన్యుల భూములకు రక్షణెక్కడిది? హఫీజ్ పేట భూముల విషయంలో స్వయంగా సీఎం కేసీఆర్ బంధువులనే కిడ్నాప్ చేశారన్న వార్త మామూలు జనాల్లో మరింత ఆందోళన పెంచుతోంది. ఆంధ్రోళ్ల పెత్తనం, దోపిడీ అని మాట్లాడే టీఆర్ఎస్ అధినేత ఇప్పుడు ఆయన ప్రభుత్వమే బద్నాం అయ్యే పరిస్థితి వచ్చే దాకా భూ మాఫియాపై యాక్షన్ తీసుకోలేకపోయారంటే ఏం అర్థం చేసుకోవాలి.

వైఎస్ హయాంలోనే బయటికొచ్చింది

హఫీజ్ పేట భూముల అక్రమ దందా ఇయ్యాల్టిది కాదు. అక్కడ ఉన్న భూములన్నీ ప్రభుత్వ భూములే. కోట్ల రూపాయల్లో విలువ చేసే ఆ స్థలాలకు ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దోచుకోవాలని భూ మాఫియా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయం వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే సీపీఐ పార్టీ దృష్టికి వచ్చింది. కొండాపూర్‌‌‌‌లోని స్థానిక సీపీఐ నాయకుడు, దివంగత రక్తం నగేష్ గౌడ్ మా దృష్టికి తీసుకురాగా.. రంగారెడ్డి జిల్లా నాయకత్వం తో కలిసి అక్కడికి వెళ్లి పరిశీలించాం. మూడు సెంట్ల స్థలం చొప్పున షెడ్లు వేస్తుండడం గమనించి, ఈ స్థలాలను ఎవరు అమ్ముతున్నారన్న దానిపై అడిగితే అక్కడ సమాధానం చెప్పేవారు లేరు. ఆ స్థలం ప్రభుత్వ భూమి అని పక్కాగా తెలుసు కాబట్టి ఆ షెడ్లను పగలకొట్టాం. దానిని అక్కడ ఎవరూ వ్యతిరేకించలేదు.

భూ కబ్జా గ్యాంగ్ షెడ్డులో నోటరీలు

హఫీజ్ పేటలోని ఆ భూమి చాలా పెద్ద ఓపెన్ ప్లేస్‌‌. అక్కడ ఒక మూలన ఒక పెద్ద షెడ్డు, దాని దగ్గర ఆగి ఉన్న రెండు జీపులు, కొంత మంది మనుషులు అనుమానాస్పదంగా కనిపించారు. వాళ్లెవరని అడిగితే అక్కడికి వచ్చిన జనాల్లో ఒకరు.. ‘అది వాళ్ల దందా ఆఫీస్. అక్కడ రౌడీలు ఉంటారు. మారణాయుధాలు ఉంటాయి. వాళ్లే ఇక్కడ దందా చేస్తుంటారు’ అని చెప్పారు. దీంతో అంతా కలిసి అటు వైపు వెళ్లాం. వెంటనే ల్యాండ్ మాఫియా గ్యాంగ్ రెండు జీపులు స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. మేము ఆ షెడ్డును పగలకొట్టాం . లోపల చూస్తే నోటరీ డాక్యుమెంట్స్ చాలా ఉన్నాయి. నోటరీ పేపర్లలో పేర్లు ఉండాల్సిన చోట ఖాళీలు ఉన్నాయి. సర్వే నెంబర్ వేసి, ఫ్లాట్స్ నంబర్ వేసి  నోటరీలో సంతకాలు చేయించి ఉన్నాయి. ఒక్కో చిన్న  షెడ్డుకు లక్షల్లో రేటు కట్టి ఆ ల్యాండ్ మాఫియా అమ్ముతున్నట్టు ఆ డాక్యుమెంట్ల ద్వారా తెలిసింది.

సీఎంను కలిసినా లాభం లేక నిరాహార దీక్ష

ల్యాండ్ మాఫియా గ్యాంగ్ షెడ్డులో దొరికిన నోటరీ డాక్యుమెంట్లు తీసుకుని నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌‌‌‌కు అప్పగించి, ఆ భూ కబ్జాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరాం. దాదాపు నెల రోజుల పైగా ఆగి చూసినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దీంతో పార్టీ తరఫున నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నాం. నాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న చాడ వెంకటరెడ్డి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. అప్పట్లో హోమ్ మినిస్టర్‌‌‌‌గా ఉన్న సబితా ఇంద్రా రెడ్డిని, చాడ వెంకట్ రెడ్డిని సీఎం వైఎస్ఆర్ దీక్షా శిబిరం వద్దకు పంపారు. దాదాపు ఒక గంటపాటు అక్కడే ఉండి హోం మంత్రి అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆక్రమణకు గురైన ప్రాంతమంతా చూపించాం. అదంతా నిజాం కాలం నుంచి ప్రభుత్వ భూమి అని, దానికి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి భూ దందా చేస్తున్నారని వివరాలతో సహా చెప్పాం. ఈ భూమి మొత్తాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హోం మంత్రి హామీ ఇచ్చారు. విలేకరులతో కూడా మాట్లాడారు. అక్కడి నుంచి సబితా ఇంద్రారెడ్డి వెళ్లిన 10 నిమిషాల తర్వాత ఆనాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.జనార్దన్ రెడ్డి కూడా వచ్చారు. దాదాపు 30 నిమిషాలు మాతో ఉండి అన్ని వివరాలు తెలుసుకున్నారు.

ఫేక్ డాక్యుమెంట్లతో వచ్చిన భూమా లాయర్

హఫీజ్ పేటలో ఆక్రమణకు గురైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని నాటి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇవ్వడంతో నిరాహార దీక్ష విరమించాం. ఆ మరుసటి రోజే ఒక లాయర్ సీపీఐ ఆఫీస్‌‌కు వచ్చి.. ‘నేను భూమా నాగిరెడ్డి లాయర్‌‌‌‌ని. ఈ డాక్యుమెంట్లు మీకు చూపించమని ఆయన పంపారు’ అని ఒక పెద్ద ఫైలు చూపించారు. ‘అంత పెద్ద ఫైలు చూసే ఓపిక నాకు లేదు. ఆ భూమి మూలాలు, వాటి వివరాలు మేం తెలుసుకున్నాం. అది ప్రభుత్వ భూమి. రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురిచేసి  నకిలీ డాక్యుమెంట్లు సృష్టించుకుని కోర్టులను ఆశ్రయించి విలువైన ప్రభుత్వ భూమిని కాజేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మీతో మాట్లాడే ప్రసక్తే లేదు’ అని చెప్పి పంపించేశాను.

టీఆర్ఎస్ సర్కారు బద్నామైంది

ఆంధ్రుల పెత్తనం, దోపిడీ అంటూ ఎప్పుడూ చెప్పి రాజకీయాలు చేసే టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బంధువులనే ఇప్పుడు హఫీజ్ పేట ల్యాండ్ మాఫియా ఇష్యూలో కిడ్నాప్ చేశారు. ఇది ఒక రకంగా చూస్తే నేరుగా టీఆర్ఎస్ సర్కారే బద్నాం అయినట్లు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నా ల్యాండ్ మాఫియా సేఫ్‌‌గానే తన పని చేసుకుంటూ ఉంటుంది. సామాన్య ప్రజలే అభద్రతగా ఉండే పరిస్థితి  ఏర్పడుతున్నది. దీన్ని అధిగమించాలంటే ప్రభుత్వాలు సీరియస్‌‌గా యాక్షన్ తీసుకోవాలి. కానీ ప్రభుత్వంలో ఆ చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రత్యక్ష ఆందోళనకు సమాయత్తమై ఉద్యమించడమే మార్గంగా కనిపిస్తోంది.

ఉద్యమం కంటిన్యూ చేయలేకపోవడం వల్లే..

నాటి హోం మంత్రి హఫీజ్​పేట భూములను స్వాధీనం చేసుకుంటామని చెప్పిన రెండు మూడు నెలల తర్వాత మళ్లీ భూ మాఫియా రాత్రుల్లో షెడ్లు నిర్మించి వెళ్తున్నట్లు తెలిసింది. ఇక లాభం లేదని జనాలతో వెళ్లి ఆ భూమిలో గుడిసెలు వేయడానికి ప్రయత్నించాం. కానీ, వందల మంది పోలీసులు మమ్మల్ని అడ్డగించారు. దానిపై మళ్లీ ఆందోళన చేశాం. షెడ్లు పగలగొట్టాం. ఆశ్చర్యమేమిటంటే షేడ్లు పగలగొడితే వాటి యజమానులన్నా  మాపై కేసులు పెట్టాలి లేదా పోలీసులన్నా మాపై కేసులు పెట్టాలి. కానీ రెండూ జరగలేదు. ఇక రాత్రింబవళ్లు జనాలతో కలిసి రోజూ కాపలాకాస్తే తప్ప ఆ భూమిని కాపాడలేం అనిపించింది. అక్కడున్న జనం కూడా మేం వెళ్లినప్పుడే కదులుతారు. లేకపోతే ఎవరూ అక్కడ ఏం జరిగినా పట్టించుకోరు. అయితే ఆ సమయంలో ఉమ్మడి ఏపీ పార్టీ కార్యదర్శిగా ఉండడంతో పార్టీ కార్యక్రమాలను చూసుకుంటూ, ఇతర పనులు చూసుకుంటూ ఈ ఉద్యమానికి ఫుల్ టైమ్ కేటాయించే అంత వ్యవధి లేకపోయింది. ఒక ఉద్యమం ప్రారంభించాక అటో ఇటో తేలేవరకూ అది  కొనసాగాలి. అలా జరగలేదు. దాని ఫలితమే ల్యాండ్ మాఫియా రగడ, ఇప్పుడు కిడ్నాప్‌‌లు, మాజీ మంత్రి డెకాయిట్‌‌గా నిర్బంధం వరకు పరిస్థితి వచ్చింది.

ఇవి కూడా చదవండి

4 నెలల క్లాసులకే మొత్తం ఫీజులా..?

చీటింగ్ పెట్రోల్ బంకులపై కేసుల్లేవ్.. ఓన్లీ జరిమానాలే!

ఫేస్ బుక్-వాట్సప్‌లలో చర్చిస్తారు.. ఓఎల్‌‌ఎక్స్ లో అమ్మేస్తారు

పోలీసులే దొంగలైతే!.. చెకింగ్ పేరుతో లూటీ

Latest Updates