నయా లుక్ తో ‘హమారా బజాజ్’ చేతక్ రీఎంట్రీ

న్యూఢిల్లీ : కోట్లాది మధ్య తరగతి ఇళ్లలో ఆదరణ పొందిన బజాజ్‌‌ చేతక్‌‌ రీ ఎంట్రీ ఇస్తోంది. దేశంలో రెండో అతిపెద్ద మోటార్‌‌‌‌సైకిల్ తయారీ సంస్థ బజాజ్ ఆటో స్కూటర్ సెగ్మెంట్‌‌లో చేతక్‌‌ రీలాంఛ్‌‌ ద్వారా సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌ మొదలెడుతోంది. పదేళ్ల గ్యాప్ తర్వాత.. ఐకానిక్ స్కూటర్ బ్రాండ్ చేతక్ బ్రాండ్‌‌ను ఎలక్ట్రిక్ అవతార్‌‌‌‌లో ఇండియన్ రోడ్లపై పరిగెత్తించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. జనవరి నుంచి పుణే, ఆ తర్వాత బెంగళూరులో చేతక్ బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలను ప్రారంభిస్తామని తెలిపింది. వినియోగదారుల నుంచి వచ్చిన రెస్పాన్స్ మేరకు చేతక్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమవుతుందని పేర్కొంది. ఇతర లొకేషన్లకు కూడా తమ ఆపరేషన్స్‌‌ను విస్తరిస్తామని తెలిపింది. కంపెనీకి చెందిన చకన్ ప్లాంట్‌‌ నుంచే ఈ–స్కూటర్‌‌‌‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే దీని ధరను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. లక్షన్నరకు మించి దీని ధర ఉండదని మార్కెట్ వర్గాల అంచనా. చేతక్ బైక్‌‌ను తమ డీలర్‌‌‌‌షిప్‌‌ల నుంచి అమ్మనున్నామని బజాజ్ ఆటో వెల్లడించింది.

చేతక్ స్కూటర్స్‌‌ తయారీని బజాజ్ 2009లో ఆపివేసింది. మోటార్‌‌‌‌సైకిల్స్‌‌పై ఫోకస్ చేయడంతో స్కూటర్స్‌‌ను నిర్లక్ష్యం చేసింది. కొత్త చేతక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఒకటి 85 కిలోమీటర్ రేంజ్‌‌లో, మరొకటి 95 కిలోమీటర్ల రేంజ్‌‌లో ఉంటాయి. సుమారు ఐదు గంటల పాటు ఛార్జ్ చేస్తే.. ఇన్ని కిలోమీటర్లు ఈ వెహికిల్ ప్రయాణించనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ మోడల్‌‌ను యూరప్‌‌లోని పలు మార్కెట్లకు కూడా ఎగుమతి చేయాలని ప్లాన్‌‌లో ఉన్నట్టు బజాజ్ ఆటో వెల్లడించింది. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్‌‌ పర్యవేక్షణలో  కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ ఈ–స్కూటర్‌‌‌‌ను లాంచ్ చేశారు. భవిష్యత్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ అంతా ఎలక్ట్రిక్ వాహనాలు, బయోఫ్యూయల్స్ వంటి ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్‌‌తో రూపొందనుందని గడ్కారీ తెలిపారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ గ్లోబల్‌‌ మాన్యుఫాక్చరింగ్ హబ్‌‌ స్థానాన్ని ఇండియా కోల్పోకూడదని కాంత్ అన్నారు.  ఈ రంగం భవిష్యత్ అంతా రైడ్ షేరింగ్, కనెక్టెడ్, అటానమస్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ వెహికిల్స్‌‌గా ఉండనుందని పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌‌లోకి ప్రవేశించడంపై స్పందించిన కంపెనీ… ఈ సెగ్మెంట్‌‌లోకి మారిన తొలి ప్లేయర్ తామేనని తెలిపింది. మార్కెట్‌‌కి ముందుండమే తమకు ఎంతో ముఖ్యమని,  వాల్యుమ్ స్పేస్‌‌ కోసం తాము ఎలక్ట్రిక్ చేతక్‌‌ను రూపొందించలేదని, త్రీవీలర్స్, సూపర్‌‌‌‌బైక్స్, ఎలక్ట్రిక్ స్కూటర్స్‌‌ల్లో కూడా మెరుగైన స్థానంలో ఉండటం కోసమే ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

Latest Updates