బీజేపీ అనూహ్య నిర్ణయం : ఉదిత్ రాజ్ కు షాక్ .. హన్స్ రాజ్ కు టికెట్

న్యూఢిల్లీ: ప్రముఖ దళిత మేధావి, ఆలిండియా కాన్ఫెడరేషన్ ఆఫ్​ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్​ జాతీయ చైర్మన్ , నార్త్​ వెస్ట్​ ఢిల్లీ పార్లమెంట్  నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ ఉదిత్ రాజ్ కు బీజేపీ అధిష్టానం షాకిచ్చింది. ఆ స్థానంలో ప్రముఖ సూఫీ గాయకుడు హన్స్​రాజ్ హన్స్​కు అవకాశం కల్పించింది. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఉదిత్ రాజ్, 2014లో తన చేరిక వల్ల బీజేపీ ఎంత లాభపడిందో పార్టీ పెద్దలకు తెలుసని, దళితు గొంతుల్ని అణిచేయాలన్న కుట్రతోనే టికెట్​ నిరాకరించి ఉండొచ్చన్నారు. హన్స్​ రాజ్ పేరు ప్రకటించిన కొద్దిసేపటికే ఉదిత్ రాజ్ తన ట్విటర్ అకౌంట్లో చౌకీదార్ పక్కన డాక్టర్ పదాన్ని చేర్చుకున్నారు. ఇక హన్స్​రాజ్ విషయానికొస్తే, పంజాబ్ కు చెందిన ఆయన అకాలీ దళ్ తో పొలిటిక్ జర్నీ ప్రారంభించి కొన్నాళ్లు కాంగ్రెస్ లో పనిచేసి 2016 నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు.

పనోడికంటే లోకువయ్యానా?

‘‘దళిత, వెనుకబడిన వర్గాలకు గొంతుకగా ఉండాలన్నదే నా లక్ష్యం. ఎంపీ టికెట్​ ఇవ్వకుంటే ఇక నేను మాట్లాడే అవకాశమేది?పార్టీ అంతర్గత సర్వేల్లో నా పనితీరుకు, పాపులారిటీకి టాప్ మార్కులొచ్చినా . పక్కన పెట్టడం ఆశ్చర్యం కలిగించింది. 2014లో మోడీని గుడ్డిగా నమ్మి మా ఇండియన్ జస్టిస్ పార్టీని బీజేపీలో విలీనం చేశా. దానివల్ల వాళ్లకెంత ఫాయిదా జరిగిందో అందరికీ తెలుసు. తర్వాతి కాలంలో జరిగిన దళిత ఉద్యమాలకు నేను మద్దతు పలకడం పార్టీ నేతలకు నచ్చలేదు. శబరిమల ఇష్యూలో సుప్రీం తీర్పును సమర్థించడం కూడా నేను చేసిన తప్పుల్లో ఒకటై ఉంటుంది. బహుశా అందుకే అదిష్టానం నన్ను శిక్షించి ఉంటుంది. ఇంట్లో పనివాళ్లను తీసేటప్పుడైనా యజమాని ఒక మాట చెబుతాడు. టికెట్ ఇవ్వబోమని నాతో మాటమాత్రంగానైనా చెప్పరా? పనోడికంటే లోకు వయ్యానా ?’’అంటూ ఉదిత్ రాజ్ ఆవేదన చెందారు. ప్రచారానికి సమయం  తక్కు వున్నందున ఇండిపెండెంట్​గా పోటీ చేసినా ఫలితం ఉండదని, దేశం నలుమూలల్లోని తన ఫాలోవర్లతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ లోని రామ్‌‌నగర్‌‌కు చెందిన ఉదిత్ రాజ్, అలహాబాద్ వర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ఎస్సీ, ఎస్టీల కోసం పలు ఉద్యమాలు చేశారు. సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన ఆయన, ఐటీ శాఖలో అడిషనల్ కమిషనర్ గా పనిచేశారు. 2003లో ఉద్యోగాన్ని వదిలేసి ఇండియన్ జస్టిస్ పార్టీ(ఐజేపీ)’ని స్థాపించారు.

Latest Updates