రాఖీ పండుగ శుభాకాంక్షలు

రక్షా బంధన్… ఓ ప్రవిత్ర బంధం. సోదరి కట్టే రాఖీ..సోదరుడిపై గల అమితమైన ప్రేమకు ఓ తీపిగుర్తు. ఆడబిడ్డలకు తల్లిదండ్రుల తర్వాత.. తోడబుట్టిన వాడు ముఖ్యం. అక్కా,చెల్లెల్ల సుఖ సంతోషాలలో సకల సౌభాగ్యాలలో తోడు నీడగా ఉంటాడు సోదరుడు. అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీఇస్తాడు. అక్కల అనురాగం… తమ్ముళ్ల ఆత్మీయత.. అమ్మ నానలో సగమై చెల్లెమ్మకు తోడు నీడై ఉండే అన్నాల పండుగ రాఖీ.

అమ్మలో సగం…. నాన్నలో సగం కలిస్తే నిండైన అన్న. అమ్మలోని అప్యాయత.. నాన్నలోని బాధ్యత కలగలిసిన అనురాగానికి నిలువెత్తు ప్రతిరూపం అక్క. అంతులేని ప్రేమకు చిరునామా అన్నాచెల్లెళ్ల అనుబంధం. అక్కా తమ్ముడు, అన్నా చెల్లెళ్ల అనుబంధానికి అందమైన నిర్వచనమే రక్షాబంధన్. అన్ని వేళలా, అన్నివిధాలా తనకు రక్షగా ఉండేందుకు అన్నకు చెల్లి ఇచ్చే కానుక రాఖీ. అన్నా చెల్లెళ్లు…. అక్కా తమ్ముళ్లు సంబురంగా జరుపుకునే తీయనైన వేడుక రాఖీ పౌర్ణమి.

రాఖీ పేరు వినగానే అన్నా చెల్లెళ్ల అనురాగం….. అక్కా తమ్ముళ్ల ఆత్మీయత కళ్ల ముందు కనిపిస్తుంది. తోడబుట్టిన వారు కలకలం ఆనందంగా ఉండాలని కోరుతూ కట్టే బంధనమే రక్షా బంధనం. ఏటా శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ… సోదర ప్రేమకి ప్రతీక. సోదరుడి చేతికి రాఖీ కట్టి పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటారు తోబుట్టువులు. అన్నల ఆశీస్సులు తమకు శ్రీరామ రక్షలా ఉండాలని ప్రార్థిస్తూ… జన్మ జన్మలకు ఇలాగే తమ రక్తసంబంధం కొనసాగాలని దేవుడిని వేడుకుంటారు ఆడబిడ్డలు.

అన్నాచెల్లెళ్లు…. అక్కాతమ్ముళ్లంటే ఒకరి సుఖాన్ని, ఉజ్వల భవితవ్యాన్ని మరొకరు కాంక్షించే అందమైన బంధం. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు… ప్రతీ గడపలో ఎదురు చూపు… ప్రతీ మనసులో మైమరుపు. అక్కా, చెల్లి వస్తుందన్న ఆనందంతో సోదరుల మనసు పులకరిస్తుంది. అన్నదమ్ములను చూస్తానన్న సంతోషంతో అక్క మనసు పరవశిస్తుంది. తియ్యని పిండివంటలు సోదరులకు పెట్టి అక్కా చెళ్లెల్లు తమ ఆత్మీయతను అందిస్తే… నిండు నూరేళ్లు చల్లగా ఉండాలంటూ…. అక్కా చెల్లెళ్లకు దీవెనలిస్తారు సోదరులు.

అన్నా.. అన్న పిలుపులో ఎంత ఆనందముంటుందో.. అక్కా అన్న పలకరింపులో అంతటి అనురాగం ప్రతిధ్వనిస్తుంది. అనుభవించే కొద్ది అలరించే అనుభూతుల సమ్మేళనం అక్కతమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల అనుబంధం. ఈ బంధాలు ఎన్నడూ తరగనివి. ఎప్పటికీ మరువనివి. ఈ అనుబంధాలు ఎప్పుడూ ఉండేవే అయినా.. ప్రతీసారి కొత్తగానే ఉంటాయి. అలాంటి అక్క, తమ్ముడికి, అన్న చెల్లెళ్లలందరికీ మరోసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు.

Latest Updates