అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి.. మ‌ల్కాజిగిరిలో మిస్ట‌రీ

హైదరాబాద్: వ‌ర‌కట్న వేధింపుల‌కు మ‌రో వివాహిత బ‌లి అయింది. భర్త వేధింపులు భరించలేక మల్కాజ్‌గిరిలో ప్ర‌త్యూష(21) అనే మ‌హిళ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె గొంతుపై గోరు గాట్లు కనిపించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్‌గిరికి చెందిన ప్రత్యూష(20)‌కి రెండేళ్ల కిందట రమేష్‌తో వివాహమైంది. కొద్దికాలం సాఫీగానే సాగిన కాపురంలో కలహాలు రేగాయి.

అదనపు కట్నం కోసం భర్త వేధింపులు మొదలైనట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెళ్లి స‌మ‌యంలో ఆమె త‌ల్లితండ్రులు రూ. 5 లక్షల నగదు, 10 తులాల బంగారం, ఒక ఎకరాల భూమిని కట్నంగా ఇచ్చారు. ప్రత్యూష ఒక ఆడపిల్లకి జన్మనిచ్చిన కొన్ని నెలల తర్వాత.. అదనపు కట్నం కోరుతూ రమేష్ ఆమెను వేధించడం ప్రారంభించాడ‌ని స‌మాచారం.

అయితే భర్త వేధింపులు భరించలేకపోయిన ప్రత్యూష ఫ్యాన్‌కు ఉరి బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఆమె గొంతుపై గోరుగాట్లు ఉండడంతో ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ర‌మేష్ తో పాటు అత‌ని త‌ల్లిదండ్రులు , సోద‌రి క‌లిసి ప్ర‌త్యూష‌ను వేధించిన‌ట్టు చెబుతున్నారు

ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మల్కాజ్‌గిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates