గుండెపోటుతో పాండ్యా తండ్రి మృతి

భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యాల తండ్రి హిమాన్షు పాండ్యా శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. హిమాన్షు సూరత్‌లో కార్ల ఫైనాన్స్ వ్యాపారాన్ని నడిపేవాడు. అయితే కొడుకుల క్రికెట్ శిక్షణ కోసం ఆ వ్యాపారాన్ని వదిలేసి.. వడోదరకు వచ్చి స్థిరపడ్డాడు.

వడోదరకు వచ్చిన తర్వాత హిమాన్షు తన కొడుకులిద్దరినీ మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోర్ యొక్క క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ క్రమక్రమంగా భారత జట్టులో తమ స్థానాలను సంపాదించుకున్నారు.

ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ పూర్తయిన తరువాత హార్దిక్ పాండ్యా గత నెలలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. హార్దిక్ గతంలో వెన్నునొప్పికి గురయ్యాడు. దాంతో భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేయబడలేదు. ఈ విరామ సమయంలో హార్దిక్ తన భార్య నటాసా స్టాంకోవిక్ మరియు వారి కూతురుతో గడిపాడు.

కాగా.. క్రునాల్ పాండ్యా వడోదరాలో జరుగుతున్న సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2021లో భాగంగా బరోడాకు నాయకత్వం వహించాడు. తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో 2 ఇన్నింగ్స్‌లలో 4 వికెట్లు తీసి 77 పరుగులు చేశాడు. క్రునాల్ బరోడాను ఎలైట్ సి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిపాడు.

Latest Updates