వారి కృషి వ‌ల్లే సంగారెడ్డి కరోనా లేని జిల్లాగా అవ‌త‌రించింది

సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు లేవన్నారు మంత్రి హ‌రీష్ రావు. మున్సిపల్ కార్మికులు, పోలీసుల, వైద్యుల కృషి వల్ల సంగారెడ్డి కరోనా కేసులు లేని జిల్లాగా అవతరించిందని అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో పర్యటించిన హరీష్ రావు.. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో గల ఐసోలేషన్ వార్డును సందర్శించారు. కరోనా అనుమానితుల శాంపుల్స్ కలెక్షన్ కిట్ ను ప్రారంభించారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ… లాక్‌డౌన్ సమయంలో రక్తదానం చేయడం చాలా అవసరం అని చెప్పారు. రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవ‌చ్చ‌న్నారు. సోమవారం నాడు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానం చేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

మున్సిపల్ కార్మికుల సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్.. ఐదువేల రూపాయల ప్రోత్సాహకాన్ని ఇచ్చారని హరీష్ రావు తెలిపారు. దీని వల్ల మున్సిపల్ కార్మికుల బాధ్యత మరింత పెరిగిందని, సంగారెడ్డి పట్టణంలో ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ కార్మికులపై ఉందన్నారు. మున్సిపల్ కార్మికులకు డ్రెస్సులు పంపిణీ చేశారు.

రేషన్ బియ్యం మీకు అవసరం లేక‌పోతే…

తెలంగాణలో ఎవరూ ఆకలితో, పేదరికంతో ఉండకూడదన్నారు హరీష్ రావు . అన్నం లేకుండా బాధపడకూడదన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏడున్నర లక్షల మంది వలస కూలీలకు 12 కిలోల చొప్పున బియ్యం, ఐదు వందల రూపాయలు నగదు అందించామని చెప్పారు. రేషన్ బియ్యం అవసరం లేని వారు ఆయా గ్రామాల సర్పంచులకు, లేదంటే వీఆర్వోలకు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు సూచించారు. ఆ బియ్యాన్ని పేదవారికి పంచి వారి ఆకలిని తీరుద్దామని పిలుపునిచ్చారు.

అంత‌కు ముందు సంగారెడ్డిలోని పీఎస్ఆర్ గార్డెన్ లో బసవేశ్వర 887 వ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.

Harish Rao visits Sangareddy today and meet municipal workers

Latest Updates