‘దొంగలంతా మోడీలే’ అనడంలో తప్పేంలేదు: రాహుల్ గాంధీ

సూరత్: దొంగలంతా పేరు చివరన మోడీ అనే పేరు ఉన్నవారే అని గత లోక్ సభ ఎన్నికల ప్రచారంలో చేసిన కామెంట్ లో తప్పేంలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు. ఈ కామెంట్ పై దాఖలైన పరువు నష్టం కేసులో విచారణకు గురువారం రాహుల్ సూరత్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట తన వాదన చెప్పుకొన్నారు. తాను చేసిన కామెంట్లో తప్పేం లేదని అన్నారు.

వాదనలు ముగిసిన తర్వాత ఈ కేసు విచారణను కోర్టు డిసెంబరు 10వ తేదీకి వాయిదా వేసింది.

ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి రాహుల్ కు మినహాయింపు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీని విచారణను కూడా డిసెంబరు 10నే చేపట్టనున్నట్లు న్యాయమూర్తి చెప్పారు. అయితే ఆ రోజున రాహుల్ కోర్టుకు రావాల్సిన అవసరం లేదన్నారు.

ఇదీ కేసు

లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్ లో రాహుల్ సభ నిర్వహించారు. ‘నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ.. వీరందరి సర్ నేమ్ ఒకటే ఎలా అయింది? దొంగలందరి పేరు చివరనా మోడీ అని కామన్ గా ఎలా ఉంది?’ అని రాహుల్ గాంధీ అన్నారు.

రాహుల్ చేసిన ఈ కామెంట్ మోడీ కమ్యూనిటీ గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే (సూరత్ వెస్ట్ నియోజకవర్గం) పూర్ణేశ్ మోడీ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ పై సూరత్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ సూట్ ఫైల్ చేశారు. ఆయన పిటిషన్ స్వీకరించిన సూరత్ కోర్టు జూన్ నుంచి విచారణ చేస్తోంది.

Latest Updates