
లాక్డౌన్లో ఉండి గమనించారో లేదో గానీ ఈ సారి టెంపరేచర్లు అంతగా లేవు. ఉక్కపోత అయితే ఉందిగానీ, పోయినేడాది ఉన్నంత వేడి మాత్రం లేదు. అది కరోనా ఎఫెక్టో.. లాక్డౌన్ ఎఫెక్టో కాదు! మండుతూ, మసులుతూ, తిరుగుతూ 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే అతిపెద్ద థర్మోన్యూక్లియర్ రియాక్టర్ పని తగ్గించింది! సింపుల్‌గా చెప్పాలంటే మన బతుకుకు ఆధారమైన ‘సూర్యుడూ లాక్డౌన్’ అయిపోయిండు మరి!! ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే సూర్యుడు తన పనిని తగ్గించేశాడు. దాన్నే ‘సోలార్ మినిమమ్’ అంటారు. దీంతో అక్కడి అయస్కాంత క్షేత్రాలు బలహీనంగా మారాయి. ఆ ఎఫెక్ట్‌తో అల్లంత దూరంలోని కాస్మిక్ కిరణాలు మన వాతావరణంలోకి వచ్చేస్తాయి. పిడుగులతో కూడిన తుఫాన్లకు కారణమవుతాయి. అంతేకాదు, స్పేస్‌లో పనిచేస్తున్న ఆస్ట్రోనాట్లనూ ఇబ్బంది పెడతాయి. కొన్ని స్పేస్ హార్డ్‌వేర్‌లపై ఎఫెక్ట్ పడుతుంది. భూమిపైన టెంపరేచర్ తగ్గిపోతుంది. కొన్ని కొన్ని సార్లు ఆ టెంపరేచర్లు మరీ ఎక్కువగా పడిపోయే అవకాశమూ ఉంటుంది. ప్రస్తుతం టెంపరేచర్లు తగ్గడానికి ఇదే కారణమని అంటున్నారు నిపుణులు. ఒక్కోసారి మినీ ఐస్ఏజ్కు దారితీసే అవకాశమూ ఉంటుందట. 17, 18వ శతాబ్దాల్లో యూరప్ లిటిల్ ఐస్ ఏజ్‌కు ఇదే కారణమట. అయితే, దీని వల్ల ప్రమాదమేమీ లేదంటున్నారు ప్రపంచ వాతావరణ సంస్థ, రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ నిపుణులు. సూర్యుడిపై జరుగుతున్న యాక్టివిటీలను ఆ రెండు సంస్థల సైంటిస్టులు పరిశీలిస్తున్నారు. సోలార్ మినిమమ్లతో పెద్ద డేంజర్ ఏం లేదని, ఇది 11 ఏళ్లకోసారి జరిగేదేనని, సోలార్ మ్యాగ్జిమమ్ (ఎక్కువ వేడి, ఎక్కువ యాక్టివ్) నుంచి సోలార్ మినిమమ్కు సూర్యుడు ఎప్పుడూ వస్తూనే ఉంటాడని అంటున్నారు.