స్పేస్ నుంచి భూమికి బయలుదేరిన ‘హయబుస 2’

ఆస్టరాయిడ్కు టాటా చెప్పన ‘హయబుస 2’

30 కోట్ల కిలోమీటర్ల రిటర్న్ జర్నీ ప్రారంభించిన జపాన్ స్పేస్ క్రాఫ్ట్
ర్యూగూ మట్టి శాంపిల్స్, డేటాను తీసుకొస్తున్న హయబుస 2
2020 డిసెంబర్‌‌లో తిరిగి వచ్చి..శాంపిళ్లు విసిరేసి పోతది
ఆస్టరాయిడ్ రాక్ శాంపిళ్లను తేనుండటం ఇదే మొదటిసారి

ఏడాదిన్నర పాటు ర్యూగూ అనే ఆస్టరాయిడ్ చుట్టూ తిరిగి.. దాన్ని ఫొటోలు, వీడియోలు తీసి, రెండుసార్లు దానిపైకి దిగి మట్టి, రాళ్ల శాంపిళ్లను కలెక్ట్ చేసిన జపాన్ హయబుస 2 స్పేస్ క్రాఫ్ట్ ఇక ఆ గ్రహశకలానికి గుడ్ బై చెప్పింది. ర్యూగూ మట్టి శాంపిళ్లను జాగ్రత్తగా క్యాప్సూల్‌‌లో దాచుకున్న హయబుస2 బుధవారం భూమికి రిటర్న్ జర్నీ షురూ చేసింది. వచ్చే ఏడాది డిసెంబర్‌‌లో ఈ స్పేస్ క్రాఫ్ట్ భూమిని చేరుకుంటుందని జపాన్ అంతరిక్ష సంస్థ ‘జాక్సా’ వెల్లడించింది.

ప్రస్తుతం ర్యూగూ ఆస్టరాయిడ్ భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందట. అక్కడ నుంచి బయలుదేరే ముందు హయబుస2 బుధవారం ర్యూగూ ఫొటోలను తీసి పంపిందని జపాన్ సైంటిస్టులు తెలిపారు. కొద్దికొద్దిగా ర్యూగూ నుంచి దూరం జరుగుతూ.. దాన్ని కెమెరాలో బంధిస్తూ హయబుస2 ఈ నెల18న ఆస్టరాయిడ్కు పూర్తిగా గుడ్ బై చెప్పనుందన్నారు. థ్రస్టర్లను మండించి ఆస్టరాయిడ్ గ్రావిటీ నుంచి తప్పించుకుని, భూమి వైపు మళ్లుతుందని పేర్కొన్నారు.

ర్యూగూ చుట్టూ ఏడాదిన్నర
హయబుస2 స్పేస్ క్రాఫ్ట్ ను జాక్సా 2014లో ప్రయోగించింది. అది దాదాపు మూడున్నరేండ్లు ప్రయాణించి, 2018, జూన్ లో ర్యూగూ కక్ష్యలోకి చేరింది. అప్పటి నుంచి దాని చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓసారి, జూలైలో మరో సారి ర్యూగూపైకి కూడా ఈ స్పేస్ క్రాఫ్ట్ దిగింది. మొదటిసారి చిన్న బుల్లెట్ లాంటి దానిని పేల్చింది. ఆస్టరాయిడ్ నుంచి ఎగిరి పడిన మట్టి, దుమ్మును వెంటనే గుప్పిట పట్టింది. రెండోసారి ఏకంగా 2.5 కిలోల ఇంపాక్టర్ నే ర్యూగూపైకి వదిలింది. అది ర్యూగూ నేలపై పడి పేలిపోయి, 10 మీటర్ల లోతైన గుంతను ఏర్పర్చింది. ఆ గుంత లోపలి మట్టిని, రాళ్ల శాంపిళ్లను హయబుస2 సేకరించింది.

హయబుస అంటే.. వెంటాడే డేగ!
జపనీస్ భాషలో హయబుస అంటే డేగ అని అర్థం. డేగలా ఆస్టరాయిడ్లను వెంటాడుతుందని ఈ మిషన్ కు ఈ పేరు పెట్టారు. తొలిసారి హయబుస 1 స్పేస్ క్రాఫ్ట్ ను 2005లో పంపగా, అది ఇటకోవా అనే చిన్న ఆస్టరాయిడ్ నుంచి దుమ్మును మాత్రమే తీసుకురాగలిగింది. 2010లో అది తిరిగి వచ్చి భూమిపై దిగింది. అయితే, ఒక పెద్ద ఫ్రిజ్ అంత సైజున్న హయబుస2 తొలిసారి ఆస్టరాయిడ్ రాక్ శాంపిళ్లను కూడా తేనుంది. ప్రస్తుతం ర్యూగూ ఆస్టరాయిడ్ భూమికి దగ్గరగా ఉన్నందున జస్ట్ ఏడాదిలోనే హయబుస2 తిరిగి రానుంది. ఇది గంటకు 41 వేల కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో ప్రయాణించగలదని సైంటిస్టులు వెల్లడించారు.

శాంపిళ్లు ఇచ్చి మళ్లీ పోతుంది!
హయబుస 2 స్పేస్ క్రాఫ్ట్ 2020 డిసెంబర్ లో మన భూమికి చేరుకుంటుంది. అయితే, అది నేలకు దిగకుండా, అంతరిక్షం నుంచే ర్యూగూ శాంపిళ్లతో కూడిన క్యాప్సూల్ ను భూమి వైపుగా విసిరేస్తుందట. ఆ క్యాప్సూల్ దక్షిణ ఆస్ట్రేలియాలోని ఎడారిలో పడుతుందని, అక్కడ నుంచి జపాన్ సైంటిస్టులు దానిని కలెక్ట్ చేసుకుంటారని చెబుతున్నారు. శాంపిళ్లు అందుకున్న తర్వాత వీలును బట్టి హయబుస 2ను మరో ఆస్టరాయిడ్ వద్దకు పంపాలని జపాన్ సైంటిస్టులు ఆలోచిస్తున్నారట!

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి

Latest Updates