ఎలక్షన్ ట్రిబ్యునల్లోనే సవాల్ చేయండి

ఎలక్షన్ ట్రిబ్యునల్లోనే సవాల్ చేయండి

హైదరాబాద్, వెలుగు:  తుక్కుగూడ మున్సిపాల్టీలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఓటు హక్కు కల్పించడంపై రిట్ పిటిషన్ దాఖలు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఇది పూర్తిగా ఎలక్షన్ ట్రిబ్యునల్ లో దాఖలు చేయాల్సిన ఎలక్షన్ పిటిషన్ అని స్పష్టం చేసింది. ఎనిమిది మంది బీజేపీ కౌన్సిలర్లు దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ ముగిసినట్లేనని, ఈ పిటిషన్ ను డిస్పోజ్​ చేస్తున్నామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్ సురేందరరావు వాదిస్తూ.. ఎన్నిక జరిగిన నెల రోజుల్లోగా సవాల్​ చేసే అవకాశం ఉందని, రాష్ట్రంలో ఎలక్షన్ ట్రిబ్యునల్ లేకపోవడం వల్లే పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కేకే కేటాయింపు జరిగిందని, ఇప్పటికీ ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడిగానే ఆయన ఉన్నట్టు రాజ్యసభ సెక్రటేరియట్​ డాక్యుమెంట్లు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు సీనియర్ లాయర్​ విద్యాసాగర్ వాదిస్తూ.. రాష్ట్రంలో ఎలక్షన్ ట్రిబ్యునల్ ఏర్పాటు జరిగిందని, మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల తీరును లేదా ఎన్నికల ఫలితాలను ఆ ట్రిబ్యునల్ లోనే సవాల్ చేయాలని చెప్పారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 32, మున్సిపల్ చట్టంలోని 19సీ నిబంధన ప్రకారం ఎలక్షన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశామని తెలిపారు.
వాదనలు విన్న హైకోర్టు.. ఎన్నికలకు సంబంధించిన కేసులను ఎలక్షన్ ట్రిబ్యునల్ లోనే సవాల్ చేసుకోవాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందని పేర్కొంది.