కాంగ్రెస్ లీడర్లకు జేడీఎస్ టికెట్లు

బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ కర్నాటక రాజకీయాల్లో కొత్త ప్రయోగానికి తెరలేపారు. తమ పార్టీ టికెట్ పై పోటీ చేయాలని ముగ్గురు కాంగ్రెస్ నాయకులకు ఆఫర్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ కూటమిగా పోటీ చేస్తున్నసంగతి తెలిసిందే. కొన్ని నెలలపాటు చర్చలు జరిపిన తర్వాత మొత్తం 28 లోక్ సభ స్థా నాల్లో జేడీఎస్ కు 8 సీట్లు దక్కాయి . అయితే ఉడుపి చిక్కమగళూరు, ఉత్తర కన్నడ, బెంగళూరు నార్త్ నియోజకవర్గా ల్లో ఆ పార్టీకి అభ్యర్థు లు దొరకలేదు. దేవెగౌడ మనవళ్లు  నిఖిల్ కుమారస్వామి , ప్రజ్వల్ రేవణ్ణ ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్నారు. దేవెగౌడ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ముగ్గురు కాంగ్రెస్ నాయకులకు తమ పార్టీ టికెట్ ఇచ్చే అంశంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కేపీసీసీ చీఫ్ దినేశ్ గుండూరావుతో దేవెగౌడ పలు దఫాలుగా చర్చించారు.

కాంగ్రెస్ నాయకులు ప్రమోద్ మధ్వరాజ్ (ఉడుపి చిక్కమగళూరు), బీఎల్ శంకర్ (బెంగళూరు నార్త్ ), ప్రశాంత్ దేశ్ పాండే లేదా నివేది తా ఆళ్వా (ఉత్తర కన్నడ)కు టికెట్ ఇచ్చేందుకు దేవెగౌడ ప్రతిపాదించారు. అభ్యర్థు లు లేని సీట్లను తమ పార్టీకి ఇవ్వాలని కాంగ్రెస్ అడిగింది. అయితే దేవెగౌడ అందుకు ఒప్పుకోలేదు. దీంతో  ఆయన ప్రతిపాదనకు కాంగ్రెస్ అంగీకరించినట్లు తెలుస్తోంది . ప్రమోద్ మధ్వరాజ్ కు దేవెగౌడ ఇప్పటికే బీ ఫారం ఇచ్చారు. దేవెగౌడ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో నిర్ణయించుకుంటే తనకు సీటు కన్ఫర్మ్ అని బీఎల్ శంకర్ చెప్పారు. దేవెగౌడ తుమకూరును ఎంచుకుంటే తాను బెంగళూరు నార్త్ నుంచి పోటీ చేయాల్సి ఉంటుందని, తన అభ్యర్థిత్వం పై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. బెంగళూరు నార్త్ లోక్ సభ స్థా నం నుంచి రిటైర్డ్ జడ్జి జస్టిస్ వి.గోపాల గౌడ ను బరిలోకి దించాలని జేడీఎస్ మొదట భావించింది. అయితే ఆయన ఆసక్తి చూపలేదు. ఆ స్థా నం నుంచి పోటీకి మంత్రి కృష్ణ బైరేగౌడ పేరు కూడా వినిపిస్తోంది . అవసరమైతే పోటీకి సిద్ధమని ఆయన కూడా ప్రకటించారు. ఉత్తర కన్నడలో పోటీకి ప్రశాంత్ దేశ్ పాండే పేరు వినిపిస్తోంది . అయితే తన కుమారుడు పోటీ చేయట్లేదని ప్రశాంత్ తండ్రి, రెవెన్యూ మంత్రి ఆర్వీ దేశ్ పాండే చెప్పారు. జేడీఎస్ టికెట్ పై పోటీ చేసేది లేదని ఆయన తేల్చిచెప్పారు. అయితే ఇది కొత్త ప్రయోగమేమీ కాదని జేడీఎస్ నాయకులు చెబుతున్నారు.

Latest Updates