హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.5,568 కోట్లు

  • క్యూ1లో 21 శాతం పెరుగుదల
  • ప్రొవిజన్లకు రూ.2,613 కోట్లు
  • నికరవడ్డీ ఆదాయం రూ.13,294 కోట్లు
  • డిపాజిట్లు విలువ రూ.9,54,554 కోట్లు
  • 17 శాతం పెరిగిన లోన్‌బుక్‌
  • డిపాజిట్లలో 18.5 శాతం పెరుగుదల

హెచ్ డీఎఫ్ సీ బ్యాం కు క్యూ1 ఫలితాలు అంచనాలకు తగ్గట్టే ఉన్నా, మొండి బకాయిలు, స్థూల నిరర్ధక ఆస్తులు
సీక్వెన్షియల్‌గా నాలుగు బేస్‌ పాయింట్లు పెరిగి వరుసగా1.4 శాతానికి, 0.43 శాతానికి చేరుకున్నాయి. వడ్డీ సహా అన్ని
రకాల ఆదాయాల్లో వృద్ధి కనిపించింది. బ్యాంకుకు 25 ఏళ్లు నిండిన సందర్భంగా రూ.రెండు షేరుకు రూ.ఐదు చొప్పున
ప్రత్యేక డివిడెండ్‌ ఇస్తామని ప్రకటించింది.

న్యూఢిల్లీమనదేశంలోని అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు  తొలి క్వార్టర్‌ ఫలితాలు అంచనాలను అందుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ1 లాభాలు రూ.4,601.44 కోట్లతో పోలిస్తే జూన్​తో ముగిసిన క్యూ1లో ఇవి 21 శాతం పెరిగి రూ.5,568 కోట్లకు చేరాయి. నికరవడ్డీ ఆదాయం, వడ్డీయేతర ఆదాయం, నిర్వహణ లాభం పెరగడం వల్ల సత్ఫలితాలు వచ్చాయని శనివారం వెల్లడించింది. సంపాదించిన వడ్డీ, చెల్లించిన వడ్డీకి మధ్య తేడాను నికర వడ్డీ ఆదాయం అంటారు. ఇది గత క్యూ1తో పోలిస్తే ఈ క్వార్టర్‌లో ఏకంగా 23 శాతం పెరిగి రూ.13,294 కోట్లుగా నమోదయింది. ఆస్తుల పెరుగుదల, నికర వడ్డీ మార్జిన్‌ 4.3 శాతం పెరగడమే ఇందుకు కారణం. లోన్ల జారీ కూడా విశ్లేషకుల అంచనాలకు తగ్గట్టే ఉంది. ఏడాదికాలానికి ఇవి 17.1 శాతం పెరిగి ఈ క్యూ1లో రూ.8,29,730 కోట్లకు ఎగిశాయి. వాహన లోన్లు గత ఏడాదితో పోలిస్తే తాజా క్వార్టర్‌లో 8.3 శాతం పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది.

డిపాజిట్లలో భారీ వృద్ధి

గత ఆర్థిక సంవత్సరంలో క్యూ1లో డిపాజిట్లు విలువ రూ.9,54,554 కోట్లు ఉండగా, ప్రస్తుత క్వార్టర్‌లో ఇవి 18.5 శాతం పెరిగాయి. ఇదేకాలానికి సీఏసీఏ డిపాజిట్లు 12.8 శాతం, కాలపరిమితి డిపాజిట్లు 22.5 శాతం పెరిగాయి. స్థూల మొండిబకాయిలు, నికర మొండిబకాయిలు నాలుగు 4 బేస్‌ పాయింట్లు పెరిగి వరుసగా 1.4 శాతం, 0.43శాతం నమోదయ్యాయి. మొండిబాకీలకు కేటాయింపులు (ప్రొవిజన్లు)  గత క్వార్టర్​తో పోలిస్తే 38.3 శాతం పెరిగి రూ.2,613 కోట్లకు చేరాయి. ఏడాదికాలానికి చూస్తే పెరుగుదల ఏకంగా 60.4 శాతం నమోదయింది. నికర ఎన్‌పీఏ నిష్పత్తి 0.39 శాతం నుంచి 0.43 శాతానికి పెరిగింది. క్యాపిటల్‌ అడెక్వసీ నిష్పత్తి 14.6 శాతం నుంచి 16.9 శాతానికి చేరింది. నిర్వహణ లాభం ఏడాదికాలానికి 29 శాతం పెరిగి రూ.11,147 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం 30.2 శాతం వృద్ధి చెంది రూ.4,970.3 కోట్లుగా రికార్డయింది. ఫీజులు, కమీషన్ల ద్వారా వచ్చే రాబడి 12 శాతం పెరిగింది. విదేశీ మారక వ్యాపారం, డెరివేటివ్‌ల నుంచి వచ్చే ఆదాయం 15.4 శాతం పెరిగింది. రికవరీలు, డివిడెండ్ల వంటి చిల్లర ఆదాయం 46.3 శాతం పెరిగింది. ఇదిలా ఉంటే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు 25 ఏళ్లు నిండిన సందర్భంగా రూ.రెండు షేరుకు రూ.ఐదు చొప్పున ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.

Latest Updates