రహాస్య పెళ్లి: కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు.. చంపిన ప్రియుడు

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం, ఎంపరాళ్ల కొత్తూరు వద్ద యువతిపై దాడి చేసింది ప్రియుడిగా గుర్తించారు పోలీసులు. నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండలం, తూర్పుపల్లి గ్రామానికి చెందిన గాయత్రి(17) అనే యువతి.. పూతలపట్టు మండలం, చింతమాకుల పల్లి గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు(19) కొన్ని సంవత్సరాలుగా  ప్రేమించుకున్నారు. అయితే  వీరిద్దరూ రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే గాయత్రి మైనర్ కావడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరు పెనుమూరు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేశారు.

ఈ మేరకు గాయత్రి, ఢిల్లీబాబు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు తల్లిదండ్రులను పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇప్పించారు. గాయత్రి మైనర్ కావడంతో  పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అప్పటి నుంచి గాయత్రి అతడికి దూరంగా ఉంటుంది. దీంతో బాలికపై కక్షగట్టిన ఢిల్లీబాబు కత్తితో అతికిరాతకంగా పొడిచి చంపాడని తెలిపారు పోలీసులు. 15 కత్తిపోట్లతో గాయత్రి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. యువకుడి దాడిలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆగ్రహించిన గాయత్రి బంధువులు.. ఢిల్లీ బాబు ఇంటికి నిప్పుపెట్టారు. నిందితుడి తండ్రిపై దాడి చేశారు. దీంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఢిల్లీ బాబును అదుపులోకి తీసుకున్నామన్నారు.

Latest Updates