ధోనీ ఎప్పటికీ విలువైన ఆటగాడే

ధర్మశాల: క్రికెటర్‌‌గా ఉన్నంతకాలం మహేంద్రసింగ్‌‌ ధోనీ విలువైన ఆటగాడేనని టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ అన్నాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌‌కప్‌‌లో మాజీ కెప్టెన్‌‌ ఆడే అవకాశాలపై కోహ్లీ మాట్లాడుతూ.. మేనేజ్‌‌మెంట్‌‌లానే ధోనీ ఎప్పుడూ ఇండియన్‌‌ క్రికెట్‌‌ భవిష్యత్తు కోసం ఆలోచిస్తాడు. తన దృష్టింతా యంగ్‌‌స్టర్స్‌‌ను తీర్చిదిద్దడం, వారికి చాన్స్‌‌లివ్వడంపైనే ఉంటుందన్నాడు. ‘అనుభవానికి విలువ ఇచ్చి తీరాలి. వీరి పనైపోయిందనే తరహా విమర్శలు ధోనీ సహా చాలామంది క్రీడాకారులు తమ కెరీర్‌‌లో ఎదుర్కొన్నారు. కానీ మహీతోపాటు చాలా మంది అది తప్పని ప్రూవ్‌‌ చేశారు. మహీ ఎప్పటికీ విలువైన ఆటగాడే. రిటైర్మెంట్‌‌ అనేది వ్యక్తిగత నిర్ణయం. అందులో ఇతరుల జోక్యం అవసరం లేదు’ అని కోహ్లీ తెలిపాడు.

ఆ ట్వీట్‌‌ ఓ పాఠం లాంటిది

ధోనీ రిటైర్మెంట్‌‌పై దుమారం లేపిన తన ట్వీట్‌‌పై కోహ్లీ స్పందించాడు. ‘ఇంట్లో కూర్చొని ఏదో ఒక ఫొటో ట్వీట్‌‌ చేస్తే అది వార్త అయిపోయింది. నిజంగా ఇది నాకో పాఠం లాంటిది. నేను ఆలోచించినట్లు  ప్రపంచం అనుకోదని తెలియజెప్పింది. ఆ ఫొటో సోషల్‌‌ మీడియాలో పెట్టే ముందు నేను అంత దూరం వెళుతుందని అస్సలు ఊహించలేదు. క్యాప్షన్‌‌లో రాసినట్టు ఆ గేమ్‌‌లో ప్రతీ నిమిషం నాకు గుర్తుంది. దాని గురించి బయట ఎప్పుడూ మాట్లాడలేదనే పోస్ట్‌‌ చేశా. అయితే జనం ఊహించుకున్న దానిలో అణువంతైనా నిజం లేదు’ అని విరాట్​  స్పష్టం చేశాడు.

Latest Updates