‘ఎంఎస్ ధోని వారసుడు అతడే’

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ఆడినా, ఆడకున్నా అతడి గురించి మాజీలు, ఎక్స్ పర్ట్స్, క్రికెట్ పండితులు ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతుంటారు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ నుంచి క్రికెట్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. టీమ్ లో ఏ ప్లేస్ లో అయినా వచ్చి సమయాన్ని బట్టి డిఫెన్స్, హిట్టింగ్ చేస్తూ విజయతీరాలకు చేర్చడంలో ధోనీది అందెవేసిన చెయ్యి. జట్టులో ధోని లేకపోవడంతో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా యంగ్ గన్ రిషబ్ పంత్ కు టీమ్ మేనేజ్ మెంట్ పలు అవకాశాలు ఇచ్చింది. కానీ చాన్సెస్ ను అందిపుచ్చుకోవడంలో పంత్ విఫలమయ్యాడు. దీంతో ఆలోచనలో పడిన టీమ్ యంత్రాంగం కేఎల్ రాహుల్ ను బ్యాట్స్ మన్ కమ్ కీపర్ గా కొత్త బాధ్యతలను అప్పగించింది. బ్యాటింగ్ లో హిట్టవుతున్న రాహుల్ కీపర్ గానూ ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో లాంగ్ టైమ్ లో ధోని వారసుడు ఎవరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తాజాగా దీనిపై సీనియర్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప స్పందించాడు. గతేడాది ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించిన యంగ్ క్రికెటర్ రియాన్ పరాగ్ ధోని వారసుడిగా సమర్థవంతంగా తన బాధ్యతలు నెరవర్చుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘ప్రస్తుతం ఉన్న యంగ్ ప్లేయర్స్ లో నన్ను బాగా ఆకర్షిస్తున్న క్రికెటర్ రియాన్ పరాగ్. అతడి ఆటను చూడటం చాలా ఉత్సుకతగా ఉంటుంది. ఇండియాకు దీర్ఘ కాలం పాటు విజయవంతంగా ప్రాతినిధ్యం వహించగల సత్తా పరాగ్ లో కనిపిస్తోంది. ఎంఎస్ ధోని తర్వాత ఎవరనే ప్రశ్నకు జవాబుగా పరాగ్ ను చెప్పొచ్చు’ అని రాబిన్ చెప్పాడు.

‘పరాగ్ గేమ్ ఆకట్టుకునే విధంగా ఉంది. నెట్స్ లో అతడి ఆటను గమనించా. పరాగ్ కు మంచి భవిష్యత్ ఉంది. నేను 17 ఏళ్లు ఉన్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా. మీరు యంగేజ్ లో ఉన్నప్పుడే టీమ్ లోకి వస్తే నిర్భయంగా, అలవోకగా షాట్లు ఆడొచ్చు’ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రశంసించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున 7 మ్యాచ్ లు ఆడిన పరాగ్.. 160 రన్స్ చేసి రెండు వికెట్లు పడగొట్టాడు.

Latest Updates