సూర్యాపేటలో దారుణం: కరోనా సోకిందనే భయంతో..

కరోనా వైరస్​ సోకిందనే భయంతో ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్​ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్విరాల గ్రామానికి చెందిన శ్రీనివాస్ వార్డు మెంబర్. అతడి భార్య రేణుక గ్రామంలో రేషన్ డీలర్ కావడంతో అందుకు సంబంధించిన పనులు కూడా చూసుకుంటుండేవాడు. బతుకుదెరువు కోసం కరీంనగర్ పట్టణానికి వలస వెళ్లిన సుమారు 100 మంది కరోనా వైరస్ నేపథ్యంలో  రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో స్వగ్రామం కర్విరాలకు వచ్చారు. ఉగాది పండుగ రోజు శ్రీనివాస్ వారితో ఎప్పటిలాగే కలిసి తిరిగాడు. ఇంతలో కరోనా వైరస్ ఉధృతం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి మండలానికి వచ్చిన వారిలో ఈ వంద మందిని గుర్తించిన వైద్య సిబ్బంది వారి వివరాలు సేకరించడంతోపాటు వారి చేతికి స్టిక్కర్లు వేసి 14 రోజులు క్వారంటైన్​లో ఉండాలని, ఇల్లు దాటి బయటకు రావద్దని సూచించారు.

తాను కూడా వారితో కలిసి తిరిగానని, తనకు కూడా వైరస్ వచ్చిందేమోనని శ్రీనివాస్​ భయాందోళన చెందాడు. ఆ భయంతో మూడు రోజులు జ్వరంతో బాధపడ్డాడు. ఈ నెల 26న సూర్యాపేటలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చెకప్ కూడా చేయించుకున్నాడు. నార్మల్ జ్వరమే అని డాక్టర్లు నిర్ధారించి కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చి పంపారు. అయినా అతనిలో భయం తగ్గలేదు. దిగాలుగా ఉంటూ బాధపడుతూ ఉండే వాడని భార్య తెలిపింది. శుక్రవారం రాత్రి తన వ్యవసాయ పొలంలోకి వెళ్లి వస్తానని చెప్పిన శ్రీనివాస్ అక్కడ ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.

ఆన్ లైన్ ట్యుటోరియల్స్ .. మస్త్ టైంపాస్

Latest Updates