బీమా డబ్బుల కోసం పాలేరును ట్రాక్టర్ తో తొక్కించి…

  • బీమా డబ్బుకోసం దారుణం
  • లాయర్​, ఇన్సూరెన్స్​ ఏజెంట్లతో కలిసి 15 లక్షలు కొట్టేసిన యజమాని
  • లేని సోదరుడిని సృష్టించి ఇన్సూరెన్స్ క్లెయిమ్
  • ఆకాశ రామన్న ఉత్తరంతో  ఐదేళ్ల తర్వాత వెలుగులోకి..
  • కర్నూలు జిల్లా అవుకు మండలంలో ఘటన                   

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ లాయర్ ఇచ్చిన క్రిమినల్ ఐడియా అనాథను బలి తీసుకుంది. ఇన్సూరెన్స్ చేయించి ఓ యజమాని ఆ డబ్బుల కోసం తన వద్ద పనిచేసే వ్యక్తినే దారుణంగా చంపించాడు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. లేని సోదరుడిని సృష్టించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి డబ్బులు స్వాహా చేశాడు. కర్నూలు జిల్లా అవుకు మండలంలో ఐదేళ్ల తర్వాత ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని ఓ ఆకాశరామన్న రాసిన ఉత్తరంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు డెత్ మిస్టరీని ఛేదించారు. యజమాని సహా నలుగురిని  అరెస్టు చేశారు. లాయర్, ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులు పరారీలో ఉన్నారు.

గొంతు నులిమి చంపి.. ట్రాక్టర్ తో తొక్కించారు

కర్నూలు ఎస్పీ ఫకీరప్ప తెలిపిన వివరాల ప్రకారం.. 2015 డిసెంబర్ 5న రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి సుబ్బరాయుడు స్వగ్రామం కర్నూలు జిల్లాలోని ప్యాపిలి మండలం గార్లదిన్నె . 2001లో అవుకు మండలం మెట్టుపల్లికి చెందిన సి.జె.భాస్కర్ రెడ్డి వద్ద పశువుల కాపరిగా చేరాడు. 15 ఏళ్లుగా అక్కడే పని చేస్తున్నాడు. నంద్యాలకు చెందిన లాయర్ మహేశ్వర్ రెడ్డి..   సుబ్బరాయుడు అనాథ కాబట్టి అతని పేరు మీద ఇన్సూరెన్స్ చేయించి యాక్సిడెంట్​లో చంపేస్తే రెట్టింపు డబ్బులు వస్తాయని యజమాని భాస్కర్ రెడ్డికి  సలహా ఇచ్చాడు. డబ్బులకు ఆశపడిన భాస్కర్ రెడ్డి..  సుబ్బరాయుడి పేరుమీద  మొదట లక్ష రూపాయలు బీమా చేయించాడు. కొద్దిరోజల తర్వాత  రూ.15 లక్షలకు ఇన్సూరెన్స్ చేయించాడు. 2015 డిసెంబర్ 5న తన మిత్రులైన చంద్రశేఖర్ రెడ్డి, పెట్నికోట షేక్షావలి, జీనుగ వెంకటకృష్ణ, జీనుగ శివశంకర్​లతో కలిసి పక్కా ప్లాన్ వేశాడు. షేక్షావలి తన బైకుపై తెల్లవారుజామున సుబ్బరాయుడిని ఎక్కించుకుని మెట్టుపల్లి శివారులోకి తీసుకెళ్లాడు. రోడ్డుపక్కన జమ్మిచెట్టు వద్ద ఆపి అందరూ కలిసి  సుబ్బరాయుడి  గొంతు నులిమి చంపేశారు. ట్రాక్టర్​తో తలపైకి ఎక్కించారు. యాక్సిడెంట్​గా చిత్రీకరించి 108కు ఫోన్ చేశారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో  చనిపోయినట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు  శవాన్ని పోస్టుమార్టంకు పంపారు. తర్వాత యజమాని భాస్కర్ రెడ్డి..  సుబ్బరాయుడికి సోదరుడు వడ్డె భాస్కర్ ఉన్నట్లు తప్పుడు ఓటరు కార్డు సృష్టించి, బ్యాంకు అకౌంట్ తెరిచి ఇన్సూరెన్స్ సొమ్ము తీసుకున్నారు.

కేసు దర్యాప్తు సాగిందిలా

సుబ్బరాయుడు అనాథ అని తెలుసుకున్న పోలీసులు  అతని సోదరుడెవరో ఇన్సూరెన్స్ సొమ్ము తీసుకున్నట్లు గుర్తించారు. అతని వివరాలు ఆరా తీస్తే ఎక్కడా ఆచూకీ దొరకలేదు. సుబ్బరాయుడు యజమాని ట్రాక్టర్ కింద పడి చనిపోవడం యాదృచ్ఛికమని అందరూ భావించినా.. పోలీసులు ఆ యాంగిల్ లోనే దర్యాప్తు మొదలు పెట్టారు.కర్నూలు సీసీఎస్ డీఎస్పీ వినోద్ కుమార్, సీఐ జి.నిరంజన్ రెడ్డిలతో ప్రత్యేక టీమ్ ను ఎస్పీ ఫక్కీరప్ప రంగంలోకి దించారు. రాజకీయ అండదండలున్న  యజ మాని భాస్కర్ రెడ్డి తనకేమీ తెలియదని  బుకాయించాడు.  బ్యాంకు ఖాతాలు, చనిపోయే ముందు ఎవరి బైకుపై వెళ్తూ యాక్సిడెంట్ కు గురయ్యాడనే వివరాలు ఆరా తీయగా తీగ దొరికింది. బైకుపై తీసుకెళ్లిన వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా డబ్బు వచ్చినట్లు గుర్తించి తమదైన శైలిలో ప్రశ్నించగా.. కేసు మిస్టరీ వీడింది. చనిపోయిన వ్యక్తి వికలాంగుడు కాబట్టి అతని వారసులకు నెలకు 15 వేలు పెన్షన్ రూపంలో వస్తోంది. దాన్ని కూడా వడ్డె భాస్కర్ పేరుతో యజమాని భాస్కర్ రెడ్డి తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

Latest Updates