ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. పరువు కోసం ప్రాణాలు తీశాడు

మేడ్చల్ జిల్లా ఘాట్ కేసర్ మండలంలోని కొండాపూర్ లో దారుణం జరిగింది. పక్కా ప్లాన్ తో భార్యబిడ్డల్ని చంపి.. వారి మృతదేహాలకు నిప్పుపెట్టాడు ఓ కిరాతకుడు. భర్త క్రూరత్వానికి 24 ఏళ్ల సుశ్రుతతో పాటు… 4 నెలల పసికందు బలయ్యారు.

వరంగల్ జిల్లా బొల్లికుంటకు చెందిన సుశ్రుత.. జనగామ జిల్లా గూడూరుకు చెందిన రమేష్ రెండేళ్ల కిందట ఆర్య సమాజ్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అమ్మాయి దళితురాలు కావటంతో అబ్బాయి వాళ్లింట్లో పెళ్లిని అంగీకరించలేదు. దాంతో ఇంట్లో వాళ్లకు దూరంగా హైదరాబాద్  ఉప్పల్ లో కాపురం పెట్టారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా ఆ తరువాత రమేష్ కు, సుశ్రుతకు మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో 8 నెలలుగా సుశ్రుత భర్తకు దూరంగా తల్లిదగ్గరే ఉంటోంది.

గతంలో రమేష్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ వచ్చి అతన్ని ఎత్తుకెళ్లి బంధించినట్లు ఆరోపణలున్నాయి. అందుకే తన భర్తను అప్పగించాలంటూ గతంలో న్యాయపోరాటం కూడా చేసింది సుశ్రుత. విషయం పోలీసులు, ప్రజాప్రతినిధుల వరకూ వెళ్లింది. రమేష్, అతని కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు.

సుశ్రుతను కాపురానికి తీసుకెళ్లాలంటూ ఆమె కుటుంబ సభ్యులు రమేష్ ను కోరుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే బాబును తీసుకుని శనివారం ఉప్పల్ లోని భర్త ఇంటికి వచ్చింది సుశ్రుత. భార్యబిడ్డల్ని ఎలాగైనా వదిలించుకోవాలని చూస్తున్న రమేశ్ ఇందుకు ముందే ప్లాన్ రెడీ చేశాడు. బైక్ పై భార్యాబిడ్డను ఘట్ కేసర్ ఔటర్ రింగ్ రోడ్ వైపు తీసుకెళ్లాడు. కొండాపూర్ శివారులో వెంటతెచ్చిన మత్తుగోలీలను భార్యతో మింగించాడు. బాబుకు పాలల్లో కలిపి తాగించాడు. ఇద్దర్ని గొంతు నులిమి కిరాతకంగా చంపేశాడు.

భార్యపిల్లల్ని చంపాక.. పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ తెచ్చి మృతదేహాలను తగల బెట్టాడు నిందితుడు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయాక అక్కడి నుంచి పాలకుర్తికి వెళ్ళిపోయాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయి విషయం చెప్పడంతో…..వారే ఘాట్కేసర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇంత దారుణానికి ఒడిగట్టిన రమేష్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు సుశ్రుత కుటుంబ సభ్యులు. పెళ్లయిన నాటి నుంచే రమేష్ కుటుంబ సభ్యులు.. సుశ్రుతను కులంపేరుతో వేధించారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Latest Updates