అందరికీ ఆరోగ్య బీమా

అమలులో ఉన్న వైద్య పథకాలన్ని కలిపి ప్రత్యేక స్కీమ్‌‌

నీతి ఆయోగ్‌‌ ప్రపోజల్‌‌

ఆయుష్మాన్‌‌ భారత్‌‌, నేషనల్‌‌ హెల్త్‌‌ మిషన్‌‌ వంటి ఎన్ని పథకాలు ఉన్నా, మధ్యతరగతి వారికి ఆరోగ్య బీమా అందని ద్రాక్షగానే మారిందని నీతిఆయోగ్‌‌ పేర్కొంది. వీరి కోసం ప్రత్యేక హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ స్కీమ్‌‌ తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించింది. ఇప్పుడున్న వైద్య సంరక్షణ పథకాలను కలిపి, హెల్త్‌‌కేర్‌‌ సిస్టమ్‌‌ను తయారు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడింది. ఇప్పటికీ 50 శాతం మందికి బీమా సదుపాయం లేదని తెలిపింది.

న్యూఢిల్లీపేద, ధనిక తేడాలు లేకుండా, అందరికీ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని వర్తింపజేయాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరినీ తప్పనిసరిగా హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ స్కీమ్‌‌లోకి తీసుకురావాలని నీతి ఆయోగ్‌‌ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ముఖ్యంగా మధ్యతరగతి వారి కోసం ఒక బీమా పథకం తప్పక తీసుకురావాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ఇప్పుడున్న అన్ని ఆరోగ్య సంరక్షణ, బీమా పథకాలను కలిపేయాలని సూచించింది. దీనివల్ల ఆరోగ్యరంగంపై పెట్టే ఖర్చు తగ్గుతుందని, మారుమూల ప్రాంతాలకూ వైద్యసేవలు అందుతాయని అభిప్రాయపడింది. ‘హెల్త్‌‌ సిస్టమ్‌‌ ఫర్‌‌ న్యూ ఇండియా’ పేరుతో నీతి ఆయోగ్‌‌ సోమవారం విడుదల చేసిన రిపోర్టులోని వివరాలు ఇలా ఉన్నాయి. అన్ని ఇన్సూరెన్స్‌‌ స్కీములకు వర్తించేలా ఒక స్టాండర్డ్‌‌ బెనిఫిట్‌‌ ప్యాకేజీ ఉండాలి. ఇప్పుడున్న ఆయుష్మాన్‌‌ భారత్‌‌, నేషనల్‌‌ హెల్త్‌‌ మిషన్‌‌ వంటి స్కీములు పేదలకు మాత్రమే వర్తిస్తున్నాయి. వీటి పరిధిలోకి రానివాళ్లు వైద్యచికిత్సల కోసం విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. జీడీపీలో 1.4 శాతాన్ని ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

కర్ణాటక విధానం బెస్ట్‌‌

ప్రజలు దేశంలో ఎక్కడికి వెళ్లినా తమ జేబు నుంచి ఖర్చు పెట్టకుండా, బీమా పథకం ద్వారా వైద్యసేవలు అందేలా చూడాలని ఈ రిపోర్టు సూచించింది. ఈ విషయంలో కర్ణాటక, మేఘాలయ రాష్ట్రాలు అమలు చేస్తున్న హెల్త్‌‌ స్కీములు బాగున్నాయని ప్రశంసించింది. ‘‘సువర్ణ ఆరోగ్య సురక్ష ట్రస్ట్‌‌’ పేరుతో కర్ణాటక నిర్వహిస్తున్న పథకం లబ్ధిదారులు స్వరాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల్లోనూ  చికిత్సలు చేయించుకోవచ్చు. అంతేకాదు రాష్ట్రంలోని మొత్తం 6.4 కోట్ల మందికీ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేయడానికి కర్ణాటక కృషి చేస్తోంది. ఇందుకోసం అన్ని పథకాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తోంది”అని పేర్కొంది.

నాలుగు అంశాలు ముఖ్యం..

నీతి అయోగ్‌‌ రిపోర్టు నాలుగు అంశాలపై ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపాలని సూచించింది. మనదేశంలో అత్యధికులు వైద్యసేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్తున్నారని, అవి తమకు నచ్చిన రీతిలో ఫీజులు, చార్జీలు వసూలు చేస్తున్నాయని పేర్కొంది. ‘‘ప్రభుత్వరంగంలోనూ ఆరోగ్య సంరక్షణ కోసం చాలా పథకాలు ఉన్నాయి. దీనివల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. ప్రభుత్వాలు పెట్టే ఖర్చూ ఎక్కువ అవుతోంది. మధ్య తరగతి ప్రజలు ఏ పథకంలోకి రావడం లేదు. వీరి కోసం త్వరలోనే ఒక పథకాన్ని ప్రతిపాదిస్తాం.  ఇండియాలో అతితక్కువ మందికి మాత్రమే హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ సదుపాయం ఉంది. దేశమంతటికీ ఒకే స్కీమ్​ ఉండాలి ’’ అని నీతి ఆయోగ్‌‌ వైస్​ చైర్మన్​ రాజీవ్​ కుమార్​ అన్నారు.

Latest Updates