పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం

పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. మురుగు కాల్వలను శుభ్రం చేయడంతో పాటు…రోడ్లపై చెత్తవేయకుండా చూడాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరంగల్ పట్టణ ప్రగతిలో మంత్రి సత్యవతి రాథోడ్ కు స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36 వ డివిజన్ లో పర్యటించిన మంత్రిని సమస్యలపై నిలదీశారు జనం. ఇందిరానగర్ కాలనీలో సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వారిని సముదాయించేందుకు ప్రయత్నించినా వినలేదు. దీంతో కల్పించుకున్న మంత్రి… వచ్చిన వినతులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని పిలుపునిచ్చారు మంత్రి జగదీష్ రెడ్డి. వార్డుల వారీగా శానిటేషన్ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తడి, పొడి చెత్తను వేరు చేసేవిధంగా ప్రజలను చైతన్య పరచాలన్నారు. పట్టణప్రగతిలో భాగంగా… సూర్యాపేట పట్టణంలోని 33వ వార్డులో పాదయాత్ర నిర్వహించి…పనులను పరిశీలించారు జగదీష్ రెడ్డి. విమర్శలు, ప్రతివిమర్శలకు తావులేకుండా…అభివృద్దికి కృషిచేస్తామన్నారు ఎంపీ బండి సంజయ్. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకేనని… రాష్ట్ర అభివృద్దికోసం అందరు కలిసి ముందుకెళ్లాలన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ ప్రగతిలో ఎంపీ పాల్గొన్నారు. స్కూల్ లో పిల్లలతో కలిసి మొక్కలు నాటారు. పట్టణ ప్రగతిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు. చేయాల్సిన పనులపై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.

Latest Updates