తెలంగాణలో కరోనా నియంత్రణ చర్యలు భేష్

వెలుగు: కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్​ హర్షవర్ధన్​ అభినందించారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామన్నారు. అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​, స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ శాంతకుమారి, ఫ్యామిలీ వెల్ఫేర్​ కమిషనర్​ యోగితా రాణా పాల్గొన్నారు. వైరస్​ నియంత్రణకు తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రికి ఈటల వివరించారు. ఎన్​95 మాస్కుల కొరత ఉందని, వాటిని పంపించాలని కోరారు. కరోనా టెస్టులకు రాష్ట్రంలో ఇంకో ల్యాబ్​ ఏర్పాటు చేయాలన్నారు. కాగా, కరోనాను కంట్రోల్​ చేసేందుకు 15 మంది అధికారులతో రాష్ట్ర సర్కారు ర్యాపిడ్​ రెస్పాన్స్​ టీమ్​ను ఏర్పాటు చేసింది. జిల్లాల్లోనూ టీమ్​లను ఏర్పాటు చేశారు. కరోనా అనుమానితులను గుర్తించి హాస్పిటళ్లకు తరలించడం, పాజిటివ్​ కేసులతో కాంటాక్ట్​ అయిన వాళ్లను గుర్తించడం, ఆయా ఏరియాల్లో శానిటేషన్​ చేయడం వంటివి ఈ టీమ్​లు చేస్తాయి. రాష్ట్రంలోని 40 ప్రైవేట్​, కార్పొరేట్​ ఆస్పత్రుల్లో కరోనా ఐసోలేషన్​ వార్డులను ఏర్పాటు చేశారు.

గాంధీలో తగ్గిన ఓపీ… 

గాంధీ ఆస్పత్రిలో కరోనా హైరానా తగ్గినట్టు కనిపించట్లేదు. ఎప్పుడూ జనం రద్దీతో కిటకిటలాడే ఆస్పత్రి శుక్రవారం ఖాళీగా కనిపించింది. రోగుల ఓపీ సగానికి పైగా తగ్గింది. రోజూ 2 వేల దాకా ఉండే ఓపీ, శుక్రవారం 930కి తగ్గిపోయింది. ఇక కరోనా అనుమానంతో 53 మంది గాంధీకి రాగా,  18 మందికి ఆ లక్షణాలు లేకపోవడంతో ఇంటికి పంపించారు. ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉండాలని సూచించారు. లక్షణాలున్న 15 మంది శాంపిళ్లను  టెస్టులకు పంపించారు. అందులో ఆరుగురికి నెగెటివ్​ రాగా, మరో 9 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. 12 మంది ఐసోలేషన్ వార్డులో ఉన్నారు. ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న వ్యక్తి కోలుకుంటున్నాడని పబ్లిక్​ హెల్త్​ డైరెక్టర్​ డాక్టర్​ శ్రీనివాసరావు తెలిపారు. మరోవైపు శుక్రవారం డిపార్ట్​మెంట్​ ఆఫ్​ మెడికల్​ ఎడ్యుకేషన్​ (డీఎంఈ) అధికారులు గాంధీలో కరోనా ఏర్పాట్లను పరిశీలించారు. వేగంగా టెస్టులు చేయాలని, వాళ్లను ఎప్పటికప్పుడు ఐసోలేషన్​ వార్డుల్లో పరిశీలించాలని సూచించారు. శంషాబాద్​ ఎయిర్​పోర్టులో 5,233 మందిని స్క్రీన్​ చేశారు. అందులో ముగ్గురికి లక్షణాలుండడంతో గాంధీకి పంపించారు. కరోనా హెల్ప్​లైన్​కు 250 ఫోన్లు వచ్చినట్టు అధికారులు చెప్పారు. కరోనా వైరస్​ను నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే ముందస్తు చర్యలు తీసుకుంటోంది. జోనల్​ రైల్వే హాస్పిటల్​తో పాటు ఆరు డివిజన్​ కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో కరోనా అనుమానితుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. ప్రధాన స్టేషన్లలో సూచనల బోర్డులు, అనౌన్స్​మెంట్లతో ప్రయాణికులకు అవగాహన కల్పిస్తోంది.

ట్రీట్​మెంట్​ చేసే లోపే వెళ్లిపోయిండు

ఓ వ్యక్తి రెండు రోజుల కిందట దుబాయ్​ నుంచి సొంతూరుకు వచ్చాడు. దగ్గు, జలుబు ఉండడంతో ఆస్పత్రికి వెళ్లాడు. కరోనాగా అనుమానించి డాక్టర్లు ట్రీట్​మెంట్​ చేసే లోపే ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలో జరిగింది. లింగాల గణపురం మండలం ఆర్టీసీ కాలనీకి చెందిన వ్యక్తి, శుక్రవారం స్నేహితుడితో కలిసి జనగామ ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. అతడు దుబాయ్​ నుంచి రావడం, కరోనా లక్షణాలుండడం వంటి కారణాలతో ట్రీట్​మెంట్​ చేయడానికి డాక్టర్లు సిద్ధమవుతుండగా, అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే డాక్టర్లు అతడి కుటుంబ సభ్యులకు ఫోన్​ చేసి ట్రీట్​మెంట్​కు సహకరించాలని కోరారు. అయితే, తానెక్కడికి వెళ్లలేదని, ఇంట్లోనే ఉన్నానని, ఇబ్బంది ఉంటే తానే హైదరాబాద్​ గాంధీ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ చేయించుకుంటానని చెప్పాడు.

దుబాయ్​ నుంచి వచ్చిన జగిత్యాల వ్యక్తికి..

జగిత్యాల జిల్లా గోపాల్​రావుపేటకు చెందిన శైలెట్టి శ్రీహరి అనే వ్యక్తి కొంతకాలంగా దుబాయ్​లో ఉంటున్నాడు. గత నెల 29న దుబాయ్​ నుంచి హైదరాబాద్​కు వచ్చాడు. స్నేహితుల దగ్గర ఓ రోజు ఉండి, తర్వాతి రోజు సొంతూరుకు వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి జలుబు, దగ్గు, జ్వరం రావడంతో ప్రైవేట్​ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ చేయించుకున్నాడు. నయం కాకపోవడంతో శుక్రవారం జిల్లా ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. టెస్టులు చేసిన డాక్టర్లు కరోనా లక్షణాలున్నట్టు అనుమానించారు. వెంటనే అతడిని గాంధీ ఆస్పత్రికి ప్రత్యేక అంబులెన్సులో తరలించారు. అతడి స్నేహితులు, బంధువుల వివరాలు తీసుకుంటున్నట్టు డీఎంహెచ్​వో శ్రీధర్​ తెలిపారు.

వరంగల్​ యువకుడికి…

వరంగల్​కు చెందిన ఓ యువకుడు (24) కొంతకాలంగా ఇటలీలో ఉంటూ బుధవారం ఇంటికి వచ్చాడు. గురువారం అతడికి జలుబు, జ్వరం వచ్చినట్టు అనిపించడంతో కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడి శాంపిళ్లను టెస్టుల కోసం గాంధీకి పంపించారు.

Latest Updates