హైదరాబాద్ తొలి కరోనా పేషెంట్.. రెండు మూడ్రోజుల్లో డిశ్చార్జ్

ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు లేవని చెప్పారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర. హైదరాబాద్ తొలి కరోనా పేషెంట్‌కు పూర్తిగా నయమైపోయిందని, మరో రెండు మూడ్రోజుల్లో అతడిని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడిన మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలెవరూ కరోనా గురించి భయపడాల్సింది లేదని, ఇటీవల కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చేరిన యువకుడికి పూర్తిగా నయమైందని చెప్పారు. అతడికి సోమవారం, మంగళవారం.. రెండు సార్లు టెస్టులు చేయగా.. కరోనా లేదని రిపోర్ట్స్ వచ్చినట్లు తెలిపారు.

బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ దుబాయ్ వెళ్లి వచ్చిన సికింద్రాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడికి కరోనా సోకి.. మార్చి 2న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అతడికి డాక్టర్ల చికిత్స అనంతరం సోమవారానికి కరోనా తగ్గిపోయిందని మంత్రి చెప్పారు మంత్రి ఈటల. ఆ రోజున చేసిన టెస్టుల నెగటివ్ రావడంతో మరోసారి మంగళవారం కూడా చేశామని, మళ్లీ కూడా నెగటివ్ వచ్చిందని తెలిపారు. అతడిని మరో రెండు మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.

ఈ మందులు వాడాం

కరోనా ప్రత్యేకంగా మందులేమీ లేవని, సాధారణంగా వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఇచ్చే మందులనే వాడామని చెప్పారు మంత్రి ఈటల. ఆ యువకుడికి కరోనా నయమైందన్నారు. రాష్ట్రంలో కరోనా లేదని, విదేశాల నుంచి వచ్చేవారికి ఎవరికైనా వైరస్ సోకినట్లు గుర్తిస్తే ఇలాగే ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడుతామని తెలిపారు. ప్రజలు ఆందోళన వద్దని, కరోనా వస్తే చావుతప్పదని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమంతా అవాస్తవమని దీనితో తేలిందని అన్నారు. కరోనా టెస్టులు చేసేందుకు గాంధీ ఆస్పత్రి, ఉస్మానియా హాస్పిటల్‌తో పాటు నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్, నారాయణ గూడలోని ఐపీఎం, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కూడా వసతులు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. కరోనా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసిన ఆస్పత్రుల సమీపంలో నివసించే వాళ్లెవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని, ఆ గదుల్లో నుంచి బయటకి వచ్చే గాలిని ఎఫా ఫిల్టర్ల ద్వారా ప్యూరిఫై చేసి, స్వచ్ఛమైన గాలినే బయటకు పంపుతామని చెప్పారు మంత్రి ఈటల.

తమిళనాడునూ కరోనా ఫ్రీ స్టేట్

తమిళనాడులోనూ ఈ నెల 7న కరోనాతో చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన యువకుడికి పూర్తిగా నయమైందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.విజయభాస్కర్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క కరోనా పేషెంట్‌ వేగంగా కోలుకున్నాడని, అతడికి సోమవారం టెస్టు చేయగా నెగటివ్ వచ్చిందని చెప్పారు. రాష్ట్రానికి గుడ్ న్యూస్ అంటూ ఆయన ట్వీట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తమిళనాడు కరోనా ప్రీ స్టేట్ అని, డాక్టర్లు, వైద్య శాఖ అధికారుల కృషిని అభినందించారు.

Latest Updates