ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్‌ ప్ర‌కారం ఎక్కువ టెస్టులు చెయ్యం

కరోనా లక్షణాలు ఉన్నవాళ్లకే చేయిస్తం: ఈటల
ఐసీఎంఆర్‌‌ గైడ్‌లైన్స్ ప్రకారమే నడుస్తున్నం
లక్షల మందికి దగ్గు, జలుబు ఉంది
ప్రైవేటు టెస్టులకు అనుమతిస్తే అంతా లైన్ కడ్తరు
జులై, ఆగస్టుల మళ్లీ వైరస్ వస్తదంటున్నరు
అట్ల వచ్చినా కూడా, బిత్తరపోకుండ
రెడీ అవుతున్నమని మంత్రి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లక్షల మందికి జలుబు, దగ్గు ఉన్నాయని.. కరోనా టెస్టులు చేసేందుకు ప్రైవేటు ల్యాబ్‌లకు పర్మిషన్ ఇస్తే, అంతా ల్యాబ్‌ల దగ్గర లైన్ కడ్తారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. దానివల్ల ప్రజలకు వేల కోట్ల నష్టం జరుగుతుందని, అందుకే ప్రైవేటు ల్యాబ్‌లకు పర్మిషన్ ఇవ్వొద్దని నిర్ణ‌యించామని చెప్పారు. కోఠిలోని కరోనా కమాండ్ సెంటర్లో మంగళవారం సాయంత్రం ఈటల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టెస్టులు తక్కువగా చేస్తున్నారనడం సరికాదని, ఎన్ని టెస్టులు చేశామన్నది ముఖ్యం కాదని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్నవాళ్ల‌కే టెస్టులు చేయిస్తామని స్పష్టం చేశారు. ‘ఇండియన్ కౌన్సిల్‌ ఫర్ మెడికల్ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్)’ ఇచ్చిన గైడ్‌లైన్స్‌ ప్రకారమే నడుచుకుంటున్నామని తెలిపారు. మంగళవారం సాయంత్రం నాటికి దేశవ్యాప్తంగా 7 లక్షల 16 వేల 733 టెస్టులు చేస్తే.. రాష్ట్రంలో 19,063 టెస్టులు చేశామన్నారు.

ప్రతి వంద టెస్టుల్లో జాతీయ స్థాయిలో 4.1 శాతం మందికి పాజిటివ్ వస్తే.. తెలంగాణలో 5.3 శాతం మందికి పాజిటివ్ వచ్చిందన్నా రు. దీన్ని బట్టి తెలంగాణలో అడ్డగోలుగా టెస్టులు చేయలేదని స్పష్టమవుతోందని చెప్పారు. ఇకపై కూడా ఎక్కువగా టెస్టులు చేయబోమని ప్రకటించారు. ప్రస్తుతం రోజుకు 1,540 టెస్టులు చేసే కెపాసిటీ ఉందని, త్వరలోనే అది ఐదు వేలకు పెరుగుతుందని చెప్పారు. జులై, ఆగస్టునెలల్లో వైరస్ మళ్లీ వస్తుందంటున్నారని, అప్పుడు బిత్తర పోకుండా అన్నిరకాలుగా సిద్ధమవుతున్నామని తెలిపారు. అప్పుడు కూడా సింప్టమ్స్ ఉన్నవాళ్ల‌కే టెస్టులు చేస్తామన్నారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కేంద్రం పంపిందని, ఇక్కడ ర్యాపిడ్ టెస్టులు చేయబోమని స్పష్టం చేశారు.

దాడి చేసి కొట్టినా వదల్లేదు

ఫారిన్ రిటర్నీస్‌, మర్కజ్‌ వాళ్ల కాంటాక్ట్స్‌ అందరినీ టెస్ట్ చేశామని ఈటల తెలిపారు. మర్కజ్ వ్యవహారాన్ని మొదట గుర్తించి కేంద్రాన్ని అలర్ట్ చేసింది తామేనని చెప్పారు. మర్కజ్ నుంచి 1,281 మంది వస్తే.. అందులో 1,244 మందిని గుర్తించామన్నారు. వైరస్ ల‌క్షణాలు లేకున్నా పట్టుకుపోతున్నార‌ని మర్కజ్ రిటర్నీస్ దాడి చేశారని, కొట్టారని… అయినా వదల్లేదని వివరించారు. 1,244 మందికి టెస్టులు చేయిస్తే 240 మందికిపైగా పాజిటివ్ వచ్చిందన్నారు. వాళ్ల కాంటాక్టులను కూడా టెస్ట్ చేశామన్నారు. మన దగ్గర అన్నీ మర్కజ్ రిలేటెడ్‌ కేసులే తప్ప.. వేరే కేసులు లేవని స్పష్టం చేశారు. ఐదారు రోజులుగా జీహెచ్‌ఎంసీలో తప్ప, జిల్లాల్లో కేసులు నమోదు కావడం లేదన్నారు. లాక్‌ డౌన్‌ను గ్రామాల్లో పక్కాగా పాటించారని, అందువల్లే వైరస్ కమ్యునిటీలోకి వెళ్లకుండా నివారించగలిగామని చెప్పారు.

నా కమిట్‌మెంట్‌పై విశ్వాసం

అమెరికా, ఇటలీ వంటి దేశాలను చూసి వణికిపోయామని, రాష్ట్రంలో ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుని కరోనాను కట్టడి చేశామని ఈటల చెప్పారు. ‘‘నా కమిట్‌మెంట్‌, పనితనం మీద ప్రజల్లో వందకు వందశాతం విశ్వాసం ఉంది. నాకు ఫోన్‌ చేసి అప్రిసియేట్ చేస్తున్నారు. అయినా కొందరు విమర్శలు చేస్తున్నారు” అని పేర్కొన్నారు. ఆరు రోజులుగా కేసులు తక్కువగా వస్తుండడం శుభసూచకమన్నారు. కొన్ని పార్టీలు, ర్టీ నాయకులు దీన్ని ఓర్చుకోవడంలేదని విమర్శించారు. టెస్టులు చేయట్లేదని, సమాచారం పూర్తిగా ఇవ్వడం లేదని ప్రచారం చేస్తున్నారన్నారు. ఐసీఎంఆర్ గైడ్‌ లైన్స్‌ ప్రకారం ఇకపై ఐదు కంటే ఎక్కువ కేసులుంటేనే కంటెయిన్ ‌మెంట్ జోన్లుఏర్పాటు చేస్తామని తెలిపారు. మన దగ్గరి కేసుల్లో 50శాతానికి పైగా గ్రేటర్ హైదరాబాద్ ప‌రిధిలోనే, అందులోనూ 70 శాతం 8 సర్కిళ్ల‌లోనే ఉన్నాయని తెలిపారు.

అందరూ క్షేమమే..

కరోనా పేషెంట్లంతా ఆరోగ్యంగానే ఉన్నారనిమంత్రి వెల్లడించారు. కొందరికి 14 రోజులు దాటినా వైరస్ నెగెటివ్ కావడంలేదని.. కొత్తగూడెం అమ్మాయికి 28 రోజుల తర్వాత నెగెటివ్ వచ్చిందని చెప్పారు. లక్షణాల్లేని, తక్కువగా లక్షణాలున్న కరోనా పేషెంట్లను ఇండ్లలోనే ఉంచి ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని.. అయితే రాష్ట్రంలో ఇప్పుడా గైడ్‌ లైన్స్ అమలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే అదే విధంగా చేస్తామన్నారు. మే 8నాటికి రాష్ట్రం కరోనా నుంచి కోలుకునే అవకాశం ఉందన్నారు.

మరణాలు తక్కువే..

కరోనా మరణాల రేటు రాష్ట్రంలో 2.5 శాతం మాత్రమేనని ఈటల చెప్పారు. ఇప్పటివరకు 25 మంది మాత్రమే చనిపోయారని.. ఇందులో ఇద్దరు గుల్బర్గా, ఒకరు ఏపీకి చెందిన వ్యక్తి అని వెల్లడించారు.

రాష్ట్రంలో మరో ఆరు కేసులు

రాష్ట్రంలో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని మంత్రి ఈటల వెల్లడించారు. వారంతా గ్రేటర్ హైదరాబాద్‌ కు చెందినవారేనని చెప్పారు. మొత్తం కేసుల సంఖ్య 1,009కి చేరిందన్నారు. ఇప్పటికే 332 మంది డిశ్చార్జి కాగా.. మంగళవారం మరో 42 మందిని డిశ్చార్జి చేశామని తెలిపారు. ఇంకా 610 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని 22 జిల్లాలు గ్రీన్ జోన్‌లోకి వెళ్లాయని మంత్రి వివరించారు. ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంటే.. తెలంగాణలో తగ్గుతోందని చెప్పారు. ప్రభుత్వ చర్యల పట్ల కేంద్రం సంతృప్తి ప్రకటించిందన్నారు.

Latest Updates