పేపర్ ప్లేట్లతో క్యాన్సర్ ముప్పు..లివర్, బ్రెస్ట్, ఇతర క్యాన్సర్ల బారిన పడుతున్న జనం

పేపర్ ప్లేట్లతో క్యాన్సర్ ముప్పు..లివర్, బ్రెస్ట్, ఇతర క్యాన్సర్ల బారిన పడుతున్న జనం

 

  •  హైదరాబాద్ వినాయక మండపాల్లో ఇప్పటికే  కోట్ల సంఖ్యలో  పేపర్ ప్లేట్ల వాడకం 
  • ఫంక్షన్ హాల్స్, పెళ్లిళ్లలో విచ్చలవిడిగా వినియోగం 
  • ప్రత్యామ్నాయంగా స్టీల్‌‌‌‌‌‌‌‌ వాడితేనే ఆరోగ్య భవిష్యత్తు 
  • ‘స్టీల్ బ్యాంకు’తో ఆదర్శంగా నిజామాబాద్ జిల్లా చౌట్‌‌‌‌‌‌‌‌పల్లి 
  • అన్ని చోట్లా స్టీల్ వాడకంపై దృష్టి పెట్టాలంటున్న నిపుణులు  

హైదరాబాద్ సిటీ, వెలుగు: పేపర్​ప్లేట్లలో వేడి వేడి ఫుడ్ తింటున్నారా.. అయితే, మీరు క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొని తెచ్చుకున్నట్లే. ప్లాస్టిక్, రంగుల పూతతో ఉన్న పేపర్ ప్లేట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వేడి వేడి అన్నం, కూరలు వీటిలో వడ్డించినప్పుడు ప్లేట్లలోని రసాయనాలు కరిగి నేరుగా మన కడుపులోకి చేరుతున్నాయి. దీర్ఘకాలంలో ఇవి ప్రాణాంతక క్యాన్సర్లకు దారితీస్తున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాగితం నానిపోకుండా, నూనె కారకుండా తయారీదారులు వాటికి పాలిథిన్ కోటింగ్ లేదా కృత్రిమ రంగులను వాడుతున్నారు.

ఈ ప్లేట్లలో ఎక్కువ వేడి ఉన్న ఆహార పదార్థాలు వడ్డించినప్పుడు, ఆ కెమికల్స్ కరిగి ఆహారంలో కలిసిపోతున్నాయి. ఇవి క్రమంగా జీర్ణవ్యవస్థలోకి వెళ్లి లివర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్లకు, మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ద్వారా బ్రెస్ట్‌‌‌‌‌‌‌‌ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌కు దారితీస్తున్నాయని రీసెర్చ్‌‌‌‌‌‌‌‌లు చెబుతున్నాయి.

దీనికి తోడు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతోంది. ఐసీఎంఆర్, నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ అంచనాల ప్రకారం..2025లో తెలంగాణలో దాదాపు 50 వేల పైనే క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 29 వేల మందికి పైగా వివిధ రకాల క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో చనిపోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  

ఏమిటీ ఈ కెమికల్..? 

కలర్ పేపర్ ప్లేట్లను ఎక్కువగా వినియోగిస్తే అందులో ఉండే బిస్ఫినాల్ అనే కెమికల్ మనిషి శరీరంలోకి చేరుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధులైన కాలేయ క్యాన్సర్, కిడ్నీల రోగాలతో పాటు నర్వ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీస్తుంది. కాగితపు ప్లేట్లను బయో ప్లాస్టిక్, పెట్రోలియం ప్లాస్టిక్ పూతతో తయారు చేయడం వల్ల వేడి ఆహారం తినే సమయాల్లో ఈ కోటింగ్ రసాయనంగా మారి శరీరాల్లోకి చేరి అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది.

రంగు రంగుల కాగితపు ప్లేట్లు, డిస్పోజబుల్ కప్పులు, ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న వస్తువుల తయారీలో విస్తృతంగా ఉండే ఒక ప్రమాదకరమైన రసాయనమే బిస్ఫినాల్- ఏ. అలాగే, ఆకర్షణీయమైన రంగుల కోసం రసాయన ఇండస్ట్రియల్ డైస్‌‌‌‌‌‌‌‌ను వాడతారు. ఇలా రంగులు, ప్లాస్టిక్ కోటింగ్, పాలిథిన్‌‌‌‌‌‌‌‌లు ఉండే పేపర్ ప్లేట్లలో వేడి వేడి ఫుడ్ వేసుకుని తినడం వల్ల ప్రమాదకరమైన కెమికల్స్ నేరుగా పొట్టలోకి చేరుతున్నాయి. 

లక్షకుపైగా మండపాలు.. కోట్ల ప్లాస్టిక్ ప్లేట్లు..  

ప్రస్తుతం వినాయక నవరాత్రుల సందర్భంగా అంతటా అన్నదానాలు నిర్వహించారు. ఎక్కడ చూసినా రంగురంగుల కలర్ ప్లేట్లలోనే తిన్నారు. అప్పటికప్పుడు వీటిని కొనుగోలు చేసే సౌకర్యం, ఒకేసారి వినియోగించి పడేసే వీలు ఉండటంతో కలర్ పేపర్ ప్లేట్లనే ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో  దాదాపు 1.40 లక్షలకు పైగా వినాయక మండపాలను ఏర్పాటు చేశారు. చిన్న విగ్రహాల వద్ద కూడా అన్నదానాలు చేశారు. దాదాపు పది రోజులుగా ప్రతీ ఏరియాలో రోజూ ఏదో ఓ మండపం వద్ద అన్నదానం చేశారు.

ఇందులో చాలా చోట్ల ప్లాస్టిక్ కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన పేపర్ల ప్లేట్లలో భోజనాలు పెట్టారు. ప్రతి మండపం వద్ద కనీసం ఒక్క రోజు అన్నదానం జరిగినా, సుమారు 200 మంది చొప్పున తిన్నా.. కోట్లలో పేపర్ ప్లేట్ల వినియోగం జరిగింది. కేవలం పది రోజుల్లో కోట్లాది కాగితపు ప్లేట్లు చెత్తాచెదారంగా మారి నగర పర్యావరణాన్ని సైతం కలుషితం చేశాయి. 

‘స్టీల్ బ్యాంకు’లపై ఫోకస్ పెట్టాలి.. 

హానికరమైన కెమికల్స్ ప్రమాదం నుంచి బయటపడటానికి పేపర్, ప్లాస్టిక్ ప్లేట్ల స్థానంలో రీయూజ్ చేసే స్టీల్ వస్తువులను ప్రోత్సహించాల్సిన టైం వచ్చిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రజల్లో దీనిపై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని, ప్రభుత్వాలు, ఉత్సవ కమిటీలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్టిక్ కలర్ పేపర్ ప్లేట్ల నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని సూచిస్తున్నారు.

వీటి స్థానంలో అరిటాకులు, మోదుగు ఆకుల విస్తరాకులు వాడటం ఉత్తమమని.. లేదా పండగలు, సామూహిక భోజనాల సమయంలో 'స్టీల్ బాంక్'ను అమలు చేయడం సమర్థమైన ప్రత్యామ్నాయంగా మారాలని చెప్తున్నారు. ఇటీవల కొన్ని గ్రామాలు, యువజన సంఘాలు స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేసుకుంటున్నాయి.

తెలంగాణలోని కొన్ని గ్రామాలు, గ్రామ పంచాయతీ, యువసేనల ఆధ్వర్యంలో 'స్టీల్ ప్లేట్లు, గ్లాసుల బ్యాంకు'లను ఏర్పాటు చేశాయి. ఏ ఇంటిలో శుభకార్యం జరిగినా, లేదా ఏ సామూహిక అన్నదానం జరిగినా ఉచితంగా స్టీల్ ప్లేట్లను అందిస్తున్నారు. వాటిని తీసుకువెళ్లి, భోజనాలు ముగిశాక శుభ్రం చేసి తిరిగి ఇస్తున్నారు.

 ఈ విధానం ద్వారా కొన్ని గ్రామాలు ప్లాస్టిక్ పేపర్ వ్యర్థాలను పూర్తిగా నిరోధించగలిగాయి. ఈ కేస్ స్టడీలను స్ఫూర్తిగా తీసుకుని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని కాలనీలు, బస్తీ సంఘాలు స్వచ్ఛందంగా స్టీల్ ప్లేట్ల వాడకాన్ని ఉద్యమంలా చేపట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఆదర్శం చౌట్‌‌‌‌‌‌‌‌పల్లి.. 

ప్లాస్టిక్ కవర్లు, పేపర్ ప్లేట్లతో తినడం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయన్న డాక్టర్ల సూచనలతో నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలం చౌట్‌‌‌‌‌‌‌‌పల్లిలో మే1, 2026 నుంచి ప్లాస్టిక్ ప్లేట్లలో తినడం నిషేధించారు. గ్రామంలో ఎక్కడ ఫంక్షన్ జరిగినా.. పెళ్లిళ్లు, బర్త్ డే పార్టీలు, శారీ ఫంక్షన్లు అన్నింటికీ ఉచితంగా స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులను అందిస్తున్నారు. గ్రామంలోని గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్, శ్రీలక్ష్మీనారాయణ స్వామి ట్రస్ట్ మొత్తం 1,000 ప్లేట్లు, గ్లాసులు స్పాన్సర్ చేశారు. దీనికి ఒక ప్రత్యేక ప్రతినిధిని నియమించి ‘స్టీల్ బ్యాంకు’ ఏర్పాటు చేశారు.

ఊళ్లో ఉత్సవాలు జరిగినా, పెళ్లిళ్లు, బర్త్ డే పార్టీలు, అన్నింటికీ ఈ ప్లేట్లను యూజ్ చేస్తున్నారు. ఫంక్షన్ చేసుకునే వారు ముందుగా ఈ స్టీల్ బ్యాంకుకు చెందిన వ్యక్తికి  ఫోన్ చేస్తే స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అరేంజ్ చేస్తున్నారు. ఊళ్లో మార్కెట్‌‌‌‌‌‌‌‌తో పాటు, కిరాణాషాపులు, టీ హోటల్స్‌‌‌‌‌‌‌‌లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ టీ కప్పులను నిషేధించి ఈ గ్రామ పంచాయతీ ఆదర్శంగా నిలుస్తోంది.  

మనుషులకు, పశువులకూ ముప్పే 

ప్లాస్టిక్ ప్లేట్లలో వేడి వేడిగా ఉన్న ఆహారం వేసుకుని తింటే రోగాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. కలర్ పేపర్ ప్లేట్లలో అన్నం తింటే మైక్రోప్లాస్టిక్స్ కడుపులోకి వెళ్లి క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దారి తీస్తాయి. తిన్న ప్లేట్లను బయటపడేస్తే పశువులు తినడం వల్ల వాటికీ ముప్పు కలుగుతుంది. అందుకే వీలైనంత మేరకు ప్లాస్టిక్, పేపర్ ప్లేట్లకు దూరంగా ఉండాలి.  - ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డాక్టర్ నరేశ్, ఆర్థోపెడిక్ ఆంకాలజిస్టు, అపోలో హాస్పిటల్స్