ఏం కొనేటట్టు లేదు… ఏం తినేటట్టు లేదు

జంట నగరాల్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. అనూహ్యంగా పెరుగుతోన్న ధరలతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఏం కొనేటట్టు లేదు… ఏం తినేటట్టు లేదని నిట్టూరుస్తున్నారు. రెండు వారాల క్రితం రెండు పదులు దాటని టమాట ధర ఇప్పుడు కిలో రూ.54 అయింది. దాదాపు అన్ని కూరగాయల ధరలు సుమారుగా రూ.50 కాస్త అటు ఇటూగా ఉంటున్నాయి. పచ్చి మిర్చి రూ.60, బజ్జి మిర్చి రూ.65 చేరుకున్నాయి. క్యాప్సికం 45 రూపాయలు, కాకరకాయ 40 రూపాయలు పలుకుతున్నాయి. బీరకాయ రూ. 45 పలుకుతుండగా… చిక్కుడు కాయ రూ. 45, గోకర కాయ 24 రూపాయలకు చేరింది. చామగడ్డ రూ. 30 పలుకుతుండగా… ఉల్లిపొరక రూ. 60 కి చేరింది. రిటైల్‌‌ మార్కెట్లు, తోపుడు బండ్లపై మరో ఐదారు రూపాయలు ఎక్కువగానే పలుకుతున్నాయి. నగరానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చే టమాట దిగుబడి పూర్తిగా పడిపోగా… మొత్తం ఇరుగు పొరుగు రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లి, అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తరాది జిల్లాల నుంచి టమాట వస్తోంది. దూర ప్రాంతాల నుంచి సరకు వస్తుండటంతో రవాణ ఛార్జీలు, ఉత్పత్తి వ్యయం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయని వ్యవసాయ మార్కెటింగ్‌‌ అధికారులు చెప్తున్నారు. బోయిన్‌‌పల్లిలోని హోల్‌‌సేల్‌‌ కూరగాయల మార్కెట్‌‌కు టమాట పంటకాలంలో 2,400 క్వింటాళ్ల వరకు వస్తాయి. ప్రస్తుతం 1,740 క్వింటాళ్లకు పడిపోయింది. రైతు బజార్లకు వచ్చే పంట కూడా భారీగా పడిపోయింది.

మరోవైపు ఎండలు మండిపోతుండటంతో అన్ని రకాల కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. పాలీహౌస్‌‌, గ్రీన్‌‌ హౌస్‌‌లలో పండిస్తున్న పంటలు మాత్రమే మార్కెట్‌‌కు వస్తున్నాయి. ఓ వైపు మండుటెండలు, మరోవైపు అకాల వర్షాల కారణంగా రంగారెడ్డి, మెదక్‌‌, మేడ్చల్‌‌ జిల్లాల నుంచి నగరానికి వచ్చే పంటలు పూర్తిగా నిలిచిపోయాయి. బోరు బావుల్లో నీరు అమాంతం తగ్గిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.  ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎండలు మరింత ముదిరితే పరిస్థితి ఎలా ఉంటుందోనని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ధరలు మండిపోతున్నాయి…

అన్ని రకాల కూరగాయల ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. ఆకు కూరల ధరలు సైతం పెరిగిపోతున్నాయి. ఏ కూరగాయ ధర చూసినా యాభై రూపాయలకు కాస్త అటు ఇటుగా ఉంటున్నాయి. ఎన్నడూ లేని రీతిలో టమాట ధర పెరిగిపోయింది. రైతు బజార్‌లోనే 54 రూపాయలకు అమ్ముతున్నారు.

Latest Updates