ఉప్పొంగుతున్న పెన్నా నది…సురక్షిత ప్రాంతాలకు ప్రజలు

నివర్ తుపాను ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. ఎగువ ప్రాంతాల్లోనూ వర్ష బీభత్సం కొనసాగడంతో పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది.

ఇప్పటికీ పెన్నా నదికి భారీ వరద వస్తుండడంతో అధికారులు పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పెన్నా నదికి వరద పోటెత్తుతోందని, పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని హెచ్చరించారు. ప్రజలు తక్షణమే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని రాష్ట్ర విపత్తుల శాఖ స్పష్టం చేసింది. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని, వరద నీటిలో పశువులు, గొర్రెలు, మేకలు వదలకూడదని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు చెప్పారు.

పైనుంచి భారీ ఎత్తున వరద నీరు వస్తుండడంతో పలు ప్రాంతాల్లో పెన్నా నదికి కట్టలు తెగిపోయాయి. సమీప గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు రేపు(శనివారం) సీఎం జగన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. శిబిరాల్లో ఉన్న వారికి రూ.5వందలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Latest Updates