నిండా ముంచిన గోదారి

మూడు జిల్లాల్లో 30 వేల ఎకరాల్లో పంట నష్టం

గోదావరి, ఉపనదుల వెంట ఈసారి అదనపు ముంపు

కొత్త రిజర్వాయర్లతో పెరిగిన ఎగపోటు

రిజర్వాయర్ల వెంట కరకట్టలు లేక వందల ఎకరాల్లో దెబ్బతింటున్న పంటలు

జయశంకర్ భూపాలపల్లి/భద్రాచలం, వెలుగు: గోదావరి వరదల కారణంగా వివిధ జిల్లాల్లో పంటనష్టం ఈసారి అంచనాలకు మించి పెరిగింది. ఈ నదిపై కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుం దిళ్ల రిజర్వాయర్ తోపాటు కొత్తగా నిర్మాణంలో ఉన్న తుపాకులగూడెం, దిగువన ఏపీలోని కాపర్ డ్యాం కారణంగా ముం పు ప్రాంతం పెరి గి, రైతులు వేలాది ఎకరాల్లో పంటలు నష్ట పోయారు. గోదావరి ప్రవాహం సాఫీగా కిం దికి వెళ్లకపోవడంతో మానేరు లాంటి ఉపనదుల వెంట పంట నష్టం జరిగింది. అదీగాక మేడిగడ్డ, అన్నారం, సుం దిళ్ల బ్యారేజీల వద్ద గోదావరికి ఇరువైపులా కరకట్టలు నిర్మించక పోవడంతో బ్యాక్ వాటర్ కారణంగా పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 30 వేల ఎకరాల్లో వరి, పత్తి తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఈసారి గోదావరి వరద ఉధృతి పదిరోజులకుపైగా ఉండడంతో పంటలన్నీ పోయినట్లేనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఏటా 20 వేల ఎకరాల్లో పంట నష్టం

గతంలో గోదావరికి ఇదే స్థాయిలో వరదలు వచ్చినప్పటికీ తీరం వెంట ఉన్న జిల్లాల్లో ఎప్పుడూ కూడా 20 వేల ఎకరాలకు మించి పంట నష్టం జరిగేది కాదు. ఈసారి పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కలిపి తీరం వెంట సుమారు 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిం దని ఆఫీసర్లు అంటున్నారు. పెద్దపల్లి, మంచిర్యా ల జిల్లాలో నష్టం పాక్షికంగానే ఉన్నప్పటికీ మిగిలిన మూడు జిల్లాల్లో నే 30 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. గోదావరి తోపాటు మానేరు, మేడివాగు, జంపన్నవాగు, శబరి, సోకిలేరు, కిన్నెరసాని ఉపనదులకు వచ్చిన ఎగపోటు వల్ల నష్ట తీవ్రత పెరిగినట్లు చెబుతున్నారు. ప్రధానంగా పత్తి, వరి పంటలకు ఎక్కువ నష్టం జరిగింది.

కరకట్టలు లేక..

రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై కొత్తగా భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లాలో సుందిళ్ల రిజర్వా యర్లను నిర్మించింది. ములుగు జిల్లాలో కొత్తగా తుపాకుల గూడెం కడుతున్నారు. ఒక్కో రిజర్వా యర్ 10 నుంచి 25 కిలోమీటర్ల మేర గోదావరి నీటి ని ఆపేస్తోంది. ఇరువైపులా ఎలాంటి కరకట్టల నిర్మాణం చేపట్టకపోవడంతో గోదావరికి వరద వచ్చి నప్పుడల్లా ఈ మూడు జిల్లాల్లోని వందలాది ఎకరాల్లో కి నీళ్లు చేరి రైతులు పంటలు నష్టపోతున్నారు. గతేడాది పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని చెప్పిన ఆఫీసర్లు పత్తా లేకుండా పోయారు. 2019లో ఒక్క మేడిగడ్డ రిజర్వా యర్ ఎగువన మహాదేవపూర్ మండలం లోని బొమ్మాపూర్, బ్రాహ్మణ పల్లి, మహదేవ్ పూర్, బీరసాగర్, ఎడపల్లి, సూరారం, బెగులూరు, ఎళికేశ్వరం, కుదురుపల్లి గ్రామాలకు చెం దిన సుమారు వెయ్యి మంది రైతులు పంట నష్టపోయారు. వ్యవసాయ, రెవె న్యూ శాఖ ఆఫీసర్లు జాయిం ట్ సర్వే చేసి వెళ్లారు తప్ప ఒక్క రైతుకూ పరిహారం ఇవ్వలేదు. ఈ క్రమంలో ఈసారైనా తమకు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

కాపర్ డ్యామ్ తో ఎగపోటు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి తీరం వెంట పంటలకు ఈసారి భారీగా నష్టం వాటిల్లింది. జిల్లావ్యా ప్తంగా ఈసారి 21వేల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, ఒక్క గోదావరి వెంటే 17వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని ఆఫీసర్లు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఎగువన నిర్మించి న కాపర్ డ్యా మ్ వల్ల గోదావరి ఎగపోటు వేసినట్లు చెబుతున్నారు. శబరి, సోకిలేరు, కిన్నెరసాని ఉపనదులు కూడా వెనక్కి పోటెత్తాయి. వ్యవసాయాధికారుల అంచనా ప్రకారం ఎగపోటు కారణంగా తీరం వెంట అదనంగా 5వేల ఎకరాల్లో పంట గోదావరి పాలైంది.

బంగారం పండే చెలక గోదారి పాలైంది

మేడిగడ్డ బ్యారేజీ ఎగువన గోదావరిని ఆనుకొని నాకు మూడు ఎకరాలుంది. భారీ వర్షా లు పడినప్పుడల్లా గోదావరి నీళ్లతో పొలం మొత్తం నిండిపోతోంది. గతేడాది ఇట్లనే జరిగింది. ఈసారి కూడా పత్తి పంట వేస్తే వరదల వల్ల నష్టమే వచ్చింది. పెట్టుబడి కింద రూ.60 వేలకు పైగా నష్టపోయాను. సర్కారు సాయం చేయాలె.

సూరం పోషిరెడ్డి, రైతు, సూరారం, భూపాలపల్లి జిల్లా

మూడెకరాలు. మునిగింది

ఎకరాకు రూ. 22 వేల చొప్పున మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి వేసిన. ఎకరాకు రూ. 12 వేల చొప్పున రూ. 36 వేలు ఖర్చు పెట్టిన. పది రోజులుగా ఎడతెరిపి లేని వానలు, గోదావరి వరదల కారణంగా మూడెకరాలు పూర్తిగా నీటిలో మునిగింది. లక్ష రూపాయల దాకా నష్టం వచ్చింది. ప్రభుత్వం ఆదుకోవాలె.

ముత్తినేని సత్యనారాయణ, రామన్నగూడెం , ములుగు జిల్లా.

Latest Updates