ముంబైలో భారీ వర్షాలు.. 24 గంటల్లో 280 మి.మీ వర్షపాతం

ముంబైలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి రైలు మరియు రోడ్డు మార్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ వదరనీటిలో మనిగిపోయాయి. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత 24 గంటల్లో పశ్చిమ ముంబై శివారు ప్రాంతాల్లో 280 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. దాంతో వర్షాల వల్ల ప్రస్తుత సమయంలో కరోనా నిబంధనలను పాటించడం కష్టంగా మారింది. రాబోయే 24 గంటల్లో కూడా మరింత ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అధికారులు భావిస్తున్నారు. రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల ఉద్యోగులు, ప్రజలు మోకాలి పైకి ఉన్న నీటిలో వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల వల్ల నాయర్ హాస్పిటల్ చిన్నపాటి చెరువులా మారింది.

వరద నీటి వల్ల సెంట్రల్ మరియు హార్బర్ లైన్లలో రైలు సర్వీసులు నిలిపివేయబడ్డాయని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఈ ఉదయం ట్వీట్ చేసింది. ‘గడిచిన 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ రోజు ఉదయం 8:30 గంటల వరకు కురిసిన వర్షానికి శాంటాక్రూజ్ అబ్జర్వేటరీలో (పశ్చిమ శివారు ప్రాంతాల్లో) 286.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొలాబా అబ్జర్వేటరీలో (దక్షిణ ముంబైలో) 147.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది’ అని IMD యొక్క ముంబై సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కెఎస్ హోసాలికర్ తెలిపారు. ప్రమాదకర ప్రదేశాలలో నివసించే ప్రజలు జాగ్రత్త వహించాలని ప్రాంతీయ వాతావరణ కేంద్రం మంగళవారం అర్థరాత్రి ఒక ప్రకటన విడుదలచేసింది. అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం మరియు విద్యుత్ కోత గురించి కూడా ప్రజలను హెచ్చరించింది.

మహారాష్ట్రలో నిన్నటినుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న భారీవర్షాలతో.. ముంబై మహానగరం మళ్లీ నీట మునిగింది. పశ్చిమ, ఉత్తర ముంబైలోని అంధేరి, వొర్లి, సియోన్, వదాలా, జోగేశ్వరి, గోరేగావ్, మలాద్, బోరివలి, కింగ్ సర్కిల్ ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. గ్రాంట్ రోడ్డు నుంచి చార్మి రోడ్డు వరకు మొత్తం చెరువును తలపిస్తోంది. లోయర్ పరేల్ నుంచి ప్రభాదేవి రోడ్డులో నడుంలోతు వరద పారుతోంది. దాదర్ నుంచి మాతుంగ, మాతుంగ నుంచి మాహిమ్ ఏరియాల్లో కూడా వరద బీభత్సం కొనసాగుతోంది.

నిత్యావసరాల కోసం బయటకొస్తున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వరద నీరు నిలవడంతో రోడ్లపైకి వచ్చే వీలు లేకుండా పోయిందని.. ప్రభుత్వం సహాయం అందించాలని కోరుతున్నారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, ఫైర్ బ్రిగేడ్, బృహన్ ముంబై నగర పాలక సంస్థ సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు.

 

For More News..

రాజ్యసభ నుంచి 11 మంది ఎంపీలు రిటైర్.. వాళ్లు ఎవరంటే?

సీసీటీవీ ఫుటేజ్: అబిడ్స్‌లో ఆక్సిడెంట్.. క్షణాల్లో గాలిలో కలిసిన ప్రాణాలు

రాష్ట్రంలో మరో 2,296 కరోనా పాజిటివ్ కేసులు

Latest Updates