మహారాష్ట్రలో ఎడతెరపి లేకుండా వర్షాలు

మహారాష్ట్రను వర్షాలు వీడడం లేదు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది. మహానగరం ముంబై మునిగిపోయింది. నగరంలోని రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. కుర్లా, పరేల్, అంధేరిలో ఇళ్లలోకి వరద చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిథి రివర్ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలకు NDRF బృందాలను పంపించింది సర్కార్. బీఎంసీ సిబ్బంది వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో నీటిని తోడేస్తున్నారు.

వరదతో ముంబై రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సాధారణ జన జీవనానికి అంతరాయం ఏర్పడింది. సియాన్, వడాల రోడ్డు రైల్వేస్టేషన్లు నీట మునిగాయి. దీంతో సూరత్, బాంద్రా మార్గంలో రైళ్లను రద్దు చేశారు. ముంబై వరదలపై అప్రమత్తంగా ఉన్నామని రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేశారు. కొన్ని విమాన సర్వీసులను రద్దు చేయడంతో ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

థానే, కొంకణ్ ప్రాంతాల్లోనూ  వరద బీభత్సం ఎక్కువగా ఉంది. విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇవాళ  కూడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించడంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది.

Latest Updates