ఉల్లి రైతుకు కన్నీరు మిగిల్చిన వానలు

  • దెబ్బ తీసిన వానలు ధరలు పెరిగినా దక్కని ఫలితం
  • ఇతర రాష్ట్రా ల నుంచి నిలిచిన సరఫరా

గద్వాల/నారాయణపేట టౌన్, వెలుగు: ఇటీవలి భారీ వర్షాలు, వరదలు ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని ఉల్లి రైతులను దెబ్బతీశాయి. ప్రస్తుతం మార్కెట్​లో కిలో ఉల్లి రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. అనుకున్న దిగుబడులు వస్తే  లాభాల పంట పండేది. కానీ తమ ఆశలను వర్షాలు అడియాసలు చేశాయని రైతులు వాపోతున్నారు.

5 వేలకు పైగా ఎకరాల్లో సాగు

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో సుమారు 5 వేల ఎకరాల్లో రైతులు ఉల్లి సాగు చేశారు. ఒక్క జోగులాంబ గద్వాల జిల్లాలోనే 3,410 ఎకరాల్లో ఉల్లి సాగైనట్లు అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇటీవలి వర్షాల కారణంగా దాదాపు 80 శాతం పంట దెబ్బతిందని గుర్తించారు. సాధారణంగా ఎకరా ఉల్లి సాగు చేస్తే 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అంటే ఒక్క మహబూబ్​నగర్​ జిల్లాలోనే 1.75 లక్షల క్వింటాళ్ల ఉల్లి పండేది. కానీ వర్షాలు, వరదల కారణంగా గడ్డలు నీటిలోనే మురిగి 5 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.

పోయిన పెట్టుబడి

మహబూబ్​నగర్​జిల్లాలో ఉల్లి సాగుచేసిన రైతులు ఎకరాకు రూ.50 వేల చొప్పున, కౌలు రైతులైతే  రూ.60 వేల  చొప్పున పెట్టుబడి పెట్టారు. కానీ పంట చేతికి రాకపోవడంతో మొత్తానికి మొత్తం మునగాల్సిన పరిస్థితి నెలకొంది. గడ్డలు భూమిలోనే మురిగిపోయాయని, కూలీలతో తీయిస్తే కూలి డబ్బు కూడా వచ్చేలా లేదని చేన్లలోనే వదిలేస్తున్నారు. కొందరు రైతులు మంచి ఉల్లిగడ్డలను ఏరుకుని రోడ్ల మీద ఆరబోస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి నిలిచిన సరఫరా

రాష్ట్రానికి మహారాష్ట్ర, కర్నాటక నుంచి ఉల్లి గడ్డలు సరఫరా అవుతుంటాయి. అక్కడ కూడా వర్షాలు, వరదలకు పంట దెబ్బతినడంతో దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఉల్లి ధర పెరుగుతోంది. కొద్దిరోజుల క్రితం వరకు రూ.30 కిలో పలికిన ఉల్లిగడ్డలు ప్రస్తుతం రూ.80 నుంచి రూ.100 పలుకుతున్నాయి. ఆదిలాబాద్​ లాంటి పట్టణాల్లో కిలో రూ.120‌‌‌‌ దాకా అమ్ముతున్నారు. దీంతో సామాన్యులు ఉల్లి కొనేందుకు ఇబ్బంది పడుతున్నారు.

 సర్కారు ఆదుకోవాలి 

ఉల్లి పంట వేసి వానలతో పూర్తిగా నష్టపోయినం. గడ్డలు భూమిలనే మురిగిపోయినయి. ఏరిస్తే కూలీల ఖర్చు కూడా రావట్లేదు. ఎకరానికి రూ.50వేల దాకా పెట్టుబడి అయింది. సర్కారే మమ్మల్ని ఆదుకోవాలె.

– రైతు జయన్న, కాశీపురం, గద్వాల జిల్లా

Latest Updates