
యాదాద్రి, కోదాడ, చిట్యాల, మేళ్లచెరువు, మఠంపల్లి, హాలియా, వెలుగు : మూడు రోజులుగా కురుస్తున్న వానలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు చెరువుల్లో నీరు చేరుతోంది. వరద నీటితో వంగులు, వంకలు పొంగిపొర్లాయి. పలుచోట్ల చెరువులుఅలుగు పారాయి. హైదరాబాద్లో కురుస్తున్న వానలకు మూసీకి వరద ప్రవాహం పెరిగింది. దీంతో మూసీ ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తి 10,150 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వలిగొండ మండలం సంగెం వద్ద లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ ప్రవహిస్తోంది. కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టులో వరద నీరు చేరుతోంది.
రోడ్లపైకి వరద నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని 30 మండలాల్లో అధికంగా వాన కురియగా, అందులో మూడు మండలాలు సూర్యాపేట జిల్లాకు చెందినవే ఉన్నాయి. జిల్లాలోని మేళ్లచెరువులో 126 ఎంఎం, పాలకవీడులో 106.6 ఎంఎం, నడిగూడెంలో 101.3 ఎంఎం, కోదాడలో 94.7 ఎంఎం వర్షపాతం నమోదైంది. జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని ఆఫీసర్లు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
దెబ్బతిన్న రోడ్లు..
వర్షాల కారణంగా పలుచోట్ల రోడ్లు దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. ఒక్కోచోట అడుగులోతు గుంతలు ఏర్పడ్డాయి. చిట్యాల-భువనగిరి రోడ్డుపై ఏర్పడిన గుంతలను ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.
వాహనాల రాకపోకలకు అంతరాయం..
ఉమ్మడి జిల్లాలో కురిసిన వర్షాలకు వంగులు, వంకలు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోలకు అంతరాయం ఏర్పడింది. కోదాడ పట్టణంలో కురిసిన వర్షానికి వాగుల పక్కన ఉన్న కాలనీలు జలమయమయ్యాయి. పట్టణంలోని పెద్ద చెరువుకు ఎగువ నుంచి భారీగా వరద రావడంతో అలుగు పారింది. దీంతో అనంతగిరి రోడ్ లో మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. కోదాడకు 8 గ్రామాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అనుముల మండలం పేరూరు సోమసముద్రం చెరువు అలుగుపోస్తుంది.
దీంతో పేరూరు, చిలకాపురం వీర్లగడ్డతండా, పుల్లారెడ్, ఇగూడెం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తిరుమలగిరి సాగర్మండలంలో రంగుడ్ల వాగు ఉప్పొంగడంతో వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో రాజవరం, బోయగూడెం, కొంపెల్లి, యల్లాపురం, గరికెనట్తండా, డొక్కలబావి, నేతాపురం తదితర గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అనుముల, తిరుమలగిరి పెద్దవూర, హాలియా, నిడమనూరు మండలాల పరిధిలో ప్రవహిస్తున్న హాలియా పెద్దవాగుకు వరద ఉధృతి పెరిగింది.
మేళ్లచెరువు మండల కేంద్రంలోని నాగుల చెరువు పూర్తిగా నిండి అలుగుపోస్తుంది. కోదాడ వైపు వెళ్లే ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో వాహనాలను పోలీసులు నిలిపివేశారు. మఠంపల్లి మండల వ్యాప్తంగా కురిసిన వర్షాలతో పలు చెరువులు అలుగుపోస్తున్నాయి.