భారీ వర్షాలకు 25 లక్షల ఎకరాల్లో నష్టం

కోతకొచ్చిన పంట చేతికందలేదు.. సాయం కోసం రైతన్నల ఎదురుచూపులు

నేలకొరిగిన వరి, కల్లాల్లోనే మొలకెత్తిన వడ్లు.. రాలిపోతున్న పత్తికాయలు.. వేళ్లతోపాటు కుళ్లిన కంది

జాలువారిన పత్తి.. ఎర్రబారుతున్న చేన్లు… వేల ఎకరాల్లో కూరగాయల పంటలూ నాశనం

రెండేళ్లుగా ఫసల్ బీమా ప్రీమియం కట్టని సర్కారు

పరిహారం పొందే అవకాశం కోల్పోయిన రైతన్నలు

క్షేత్ర స్థాయిలో పరిస్థితి దయనీయం

ఇన్ పుట్ సబ్సిడీ ఇప్పించాలని వేడుకుంటున్న రైతులు

 (వెలుగు, నెట్​వర్క్​)

ఈ వానాకాలం సీజన్​లో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, మూడు, నాలుగుసార్లు వచ్చిన వరదలు రైతులను నిండా ముంచాయి. ఇప్పటికి సుమారు 25 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు అగ్రికల్చర్​ ఆఫీసర్లు  ప్రభుత్వానికి రిపోర్టులు పంపారు. ఈ నెల 12 నుంచి కురుస్తున్న వర్షాలతో దాదాపు అన్ని జిల్లాల్లో కోతకొచ్చిన వరి, సోయా, ఫస్ట్​ పికింగ్​ దశలో ఉన్న పత్తి, కంది, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. లక్షలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగి, పై నుంచి వరద నీరు పారింది. కొన్నిచోట్ల ఇంకా గొలకలపైనే నీళ్లు నిలిచి ఉండడంతో మొలకలు వస్తున్నాయి. అలాగే ఉంచితే 100శాతం పంట దెబ్బతినే ప్రమాదం ఉండడంతో రైతులు కూలీలను పెట్టి జెడలు కట్టిస్తున్నారు.  కొన్ని జిల్లాల్లో వరి కోతలు ప్రారంభమైనా కొనుగోలు కేంద్రాలు ఇంకా తెరుచుకోకపోవడంతో కుప్పలుగా పోసిన వడ్లు తడిసి మొలకెత్తుతున్నాయి. వేలాది ఎకరాల్లో పత్తిచేన్లు జాలువారి ఎరుపెక్కుతున్నాయి. పత్తికాయలు పగిలి, అందులోకి నీళ్లు చేరి మొలకెత్తుతున్నాయి. నిజామాబాద్​, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్​ జిల్లాలో ఇప్పటికే 50శాతం సోయా దెబ్బతినగా, తాజాగా కురుస్తున్న వర్షాలకు మిగిలిన పంట కూడా చేతికివచ్చేలా కనిపించడం లేదు.

ఆదుకునేందుకు ఫసల్​ బీమా లేదు..

ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులకు పరిహారం అందేలా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫసల్​ బీమా పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చింది. రెండేళ్లుగా తన వంతు వాటా ప్రీమియం రూ.513.50 కోట్లు కట్టకపోవడంతో  కేంద్ర ప్రభుత్వమూ తన వాటాను ఆపేసింది. ఫలితంగా తాజా వరదలకు నష్టపోయిన రైతులకు బీమా కంపెనీల నుంచి ఎలాంటి పరిహారం అందే చాన్స్​ లేదు. ఇలా రాష్ట్ర సర్కారు చేసిన తప్పుకు లక్షలాది రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఇన్​పుట్​ సబ్సిడీ ఇవ్వట్లేదు..

ఈ సీజన్​లో కోటి 25 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని సర్కారు అంచనా వేయగా, అంతకుమించి రైతులు కోటీ 34 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. కానీ భారీ వర్షాలు, వరదల కారణంగా ఆగస్టులో 10 లక్షల ఎకరాల్లో, సెప్టెంబర్​లో 5లక్షల ఎకరాల్లో, తాజాగా 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ఆఫీసర్లు ప్రాథమికంగా తేల్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇటీవల కురిసిన వర్షాలకు 7.35 లక్షల ఎకరాల్లో పంటలు ఎఫెక్ట్‌‌ జరిగినట్లు  కేంద్రానికి రాసిన లేఖలో  రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రతి సీజన్​లో ఇన్​పుట్​ సబ్సిడీ అందజేయాలి. కానీ టీఆర్​ఎస్​ సర్కారు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది తప్ప ఆ తర్వాత ఇన్​పుట్​ సబ్సిడీ కింద రైతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. కానీ గడిచిన ఆరేండ్లలో ఎప్పుడూ జరగని నష్టం ఈ వానాకాలం సీజన్​లో రైతులకు జరిగింది. కనీసం ఈసారైనా రాష్ట్ర సర్కారు తమకు ఇన్​పుట్​ సబ్సిడీ ఇప్పించాలని రైతులు వేడుకుంటున్నారు.

వారంల కోద్దామనుకున్న..

రెండెకరాలు కౌలుకు పట్టిన. గవర్నమెంట్ చెప్పినట్టే సన్నరకమైన బీపీటీ సాంబమైసూర్​ వేసిన. ఎకరానికి 40 వేల వరకు ఖర్చు పెట్టిన.  పొట్ట దశకు వచ్చిందని నీళ్లు బంద్​ చేసి  వారంల కోద్దామనుకున్న. ఇంతల్నే వాన పడి పొలం మొత్తం మునిగింది. ఆఫీసర్లు కూడా ఇటు దిక్కు వచ్చి చూడలే. – దాట్ల వెంకటస్వామి, ఎల్కతుర్తి

ఈ ఫొటోలోని రైతు జీల లచ్చయ్య. కరీంనగర్​ జిల్లా మైలారం. మూడెకరాల్లో పత్తి వేసిండు. నాలుగు రోజుల కింద పత్తి ఏరుదామనుకున్నా కూలీలు దొరకలె. ఇంతల్నే విడవకుండా వాన పడింది. దీంతో చెట్ల మీదే పత్తి మొలకెత్తింది. పత్తితోపాటు వరి సాగుకు బ్యాంకులో లక్షా అరవై వేలు లోన్​ తీసుకున్నని లచ్చయ్య చెబుతున్నడు. ఇప్పుడు పంట మొత్తం పోయింది.

పత్తి, మిర్చి మునిగినయ్

ఎకరం సొంత పొలముంటే నాలుగెకరాలు కౌలుకు తీసుకొన్న. మూడెకరాల్లో పత్తి, రెండెకరాల్లో మిర్చి వేసిన. ఈసారి పత్తి  వేయాలని ప్రభుత్వం చెప్పిందని మూడెకరాల్లో పండించిన. మొత్తం మూడు లక్షల వరకు అప్పు చేసి పెట్టుబడి పెట్టిన. పంట చేతికొచ్చే  సమయానికి ఎడతెరిపి లేని వానలతో  మిరప తోట నేలకొరిగింది. పత్తి  చేనులో నీరు చేరి పత్తి కాయలు  మొలకలు వచ్చాయి.  ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలె. – పులి సిద్ధరావు, బాలపేట,  తల్లాడ మండలం

రెండెకరాలు మునిగింది

రెండెకరాల్లో వరి పంటేసిన. కాలం మంచిగైంది.. తిండి గింజలకు రంది లేదనుకున్న. దగ్గర దగ్గర యాభై వేలు పెట్టుబడి అయింది.  బయట రెండు రూపాయల మిత్తికి తెచ్చి పెట్టిన. కోతకు వచ్చిన పొలాన్ని జూస్తే సంబరం అనిపించేది. ఇప్పుడు వానలొచ్చి ఆగం జేసినయ్. పొలమంతా నీళ్లల్ల మునిగింది. పొలంల ఇంక వరద పారుతూనే ఉంది. నీళ్ళు తీసేసినా గింజ చేతికొచ్చేతట్టులేదు.   గవర్నమెంట్ ఆదుకోవాలె. – బాలగాని వెంకన్న, రైతు,విస్నూర్, పాలకుర్తి మండలం, జనగామ

నిండా మునిగినం

ఎనిమిది ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరి పంట వేసినం. దొడ్డు, సన్నాలు పండించినం. అర్జాలాబాయి ఐకేపీ సెంటర్​కు వడ్లు తెచ్చి15 రో జులైంది. సెంటర్​ పెడుతున్నమంటేనే వడ్లు తెచ్చినం. ఇక్కడకు వచ్చినంక దసరా తర్వాత సెంటర్​ పెడతమంటున్నరు.  నాలుగు రోజుల నుంచి పడ్డ వానలకు రాశులన్నీ తడిసి మొలకలొచ్చినయ్​.  రెండు లక్షల రూపాయలకు కౌలు పట్టినం. వడ్లు తెచ్చేందుకు ట్రాక్టర్ కిరాయి రెండు వేలయ్యింది. కూలీలకు రోజుకు నాలుగు వందలిస్తున్నం. పట్టాల కిరాయి కూడా మేమే కట్టినం. వడ్లు మొలకలు వచ్చి మొత్తం మునిగిపోయినం.–సావిత్రమ్మ, గడ్డికొండారం, నల్గొండ జిల్లా. 

ఇన్సూరెన్స్ కట్టించుకోలె

నాకున్న 10 ఎకరాల్లో వరి పంట పండించిన. నాలుగు రోజుల నుంచి పడుతున్న వానలకు ఎనిమిది  ఎకరాల వరి పంట  నీళ్లపాలైంది. రెండు లక్షల రూపాయలు మందు సంచులు దుకాణాల్లో ఉద్దెరకు తెచ్చి పంటకు వేసిన.. ఇంతకుమునుపు క్రాప్​లోన్​ తీసుకున్నప్పుడే ఇన్సూరెన్స్ కట్టేది. పైనుంచి పర్మిషన్​ లేదని ఈసారి లోన్​తోని ఇన్సురెన్స్​ తీసుకోలేదు. ఇన్సూరెన్స్ ఉంటే పరిహారం వచ్చేది. సర్కారు వల్లే కట్టలేదు గనుక ప్రభుత్వమే పరిహారం ఇవ్వాలి. -రౌత్ రాజిరెడ్డి, తిప్పన్నపేట,జగిత్యాల

పత్తి పోయింది, వరి పడింది..

-జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూ రులో వానలకు నేలకొరిగిన వరికి తన పెద్దవ్వతో కలిసి దంట్లు కడుతున్న ఈ మహిళా రైతు పేరు యాట శోభ. వీరికి  మూడెకరాలు ఉండగా, రెండు ఎకరాల్లో వేసిన పత్తి పూర్తిగా జాలువారి పనికిరాకుండా పోయింది. ఒక ఎకరంలో వరి వేస్తే వానలకు ఇలా నేలకొరిగింది.  కూలి ఇచ్చేందుకు పైసలు లేక తమ పెద్దవ్వ బుచ్చమ్మను తీసుకొచ్చి నేలపడ్డ వరిని లేపి ఇలా దంట్లు కడుతోంది.  పత్తికి, పొలానికి కలిపి 70 వేల వరకు మిత్తికి తెచ్చి పెట్టుబడి పెట్టినమని, గీ వానలతో నిండా మునిగినమని

కల్లంలనే మొలకెత్తినయ్​..

కింది ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కోట ప్రభాకర్​ రెడ్డి. ఊరు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​ మండలంలోని తొగర్రాయి. ఈ వానకాలంలో ఆరు ఎకరాల్లో వరి పంట వేశాడు. వరుస వర్షాలతో పంటను సకాలంలో కోయలేకపోయాడు. చివరకు చైన్​ మిషన్​ ద్వారా బురదలోనే కోసి కల్లంలో ఆరబోశాడు. కోతలు మొదలైనా సర్కారు మాత్రం​ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించ లేదు. దీంతో కుప్ప పోసిన ధాన్యం తడిసి మొలకెత్తింది.  పెట్టుబడి కింద దాదాపు రూ. 2లక్షలు ఖర్చు చేసినా వర్షాల కారణంగా నిండామునిగామని  ప్రభాకర్​రెడ్డి

పంట పండిచ్చి దండగే

నల్గొండ జిల్లా కేశరాజుపల్లికి చెందిన పోకల యాదయ్య ఆరు ఎకరాల్లో వరి పంట సాగు చేసిండు. సెంటర్లు స్టార్ట్ చేస్తమని చెబితేనే వడ్లు తీసుకొచ్చిండు. 8 రోజులైనా సెంటర్​ స్టార్ట్​ చేయలే. తీసుకొ చ్చిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు కూలీ మనుషులను పెట్టి వాళ్లకే రోజుకు 500 ఇస్తున్నరు. ఈలోగా వానలకు తెచ్చిన ధాన్యం అంతా నీటిపాలైంది. మొలకలు ఎత్తుతున్నయి. ఎకరానికి 15 వేల చొప్పున పెట్టుబడి పెట్టినమని, ఇన్సురెన్స్ కూడా లేదని, పంట పండిచ్చి దండగే అయిందని వాపోతున్నరు. ఇప్పటికైనా సెంటర్లు స్టార్ట్ చేస్తే బాగుండు.

తాజా వర్షాలకు జరిగిన పంట నష్టం ఇలా..

(వ్యవసాయ అధికారుల అంచనా)

Latest Updates