హైదరాబాద్ లో దంచి కొట్టిన వాన

హైదరాబాద్: హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. గంట నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు. రోడ్డుపై ఎదురుగా వచ్చేవారు కనిపించనంతగా వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, నాంపల్లి, కోఠి, ఖైరతాబాద్, అమీర్ పేట్, కూకట్ పల్లి ప్రాంతాల్లో వర్షం కురస్తోంది. ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, అబిడ్స్, రాజేంద్రనగర్, మణికొండలో భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు బయటకు రావొద్దని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది జీహెచ్ఎంసీ.

ఇక రోడ్లపై ప్రయాణించేవాళ్లు నరకం చూస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఓ వైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్ ఆగిపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు కూడా కనబడనంతగా నీళ్లు చేరాయి. దీంతో వెహికల్స్ ముందుకు కదలడంలేదు. ప్రధాన జంక్షన్లన్ని జాం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. కుండపోత వానతో కాలనీల్లోకి నీళ్లు చేరాయి. జనం అవసరముంటేనే బయటకు రావాలంటోంది GHMC. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో చాలమంది రోడ్లపైనే ఆగిపోయారు.

తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌ గఢ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం బుధ‌వారం మ‌రింత‌ బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో 3.1 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతుం‌ది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్ది దక్షిణ దిశ వైపున‌కు వంపు తిరిగి ఉంది. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సుమారుగా సెప్టెంబర్‌ 20న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉం‌ది. దీంతో రాగల మరో మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని.. మంగళవారం హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిన విషయం తెలిసిందే.

Latest Updates