రాష్ట్రంలో భారీ వర్షాలు..రైతు కష్టం వానపాలు

రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.  సూర్యాపేట జిల్లాలో ఈదురుగాలులు, వడగళ్ల వాన కురిసింది. సూర్యాపేట, మునగాల, కోదాడ, హుజూర్ నగర్, గరిడేపల్లి, మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లో అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోదాడ మార్కెట్ యార్డులో దాదాపు వెయ్యి బస్తాల ధాన్యం నీటిలో తడిసిపోయింది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో వర్షం దంచికొట్టింది. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానతో ఐకెపి కేంద్రాల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యం తడిసి ముద్దైంది. ఈదురు గాలులకు మామిడి కాయలు రాలిపోయాయి. వరిచేలు నేలకొరిగాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, మోటకొండూర్, ఆలేరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. భారీగా వగడళ్లు పడటంతో చేతికొచ్చిన పంట నేలపాలైంది. మామిడి తోటల్లో మామిడికాయలు నేలరాలాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. వైర్లు తెగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చేతికొచ్చిన పంట నీటమునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని చాలా మండలాల్లో మామిడి రైతులకు నష్టం వాటిల్లిందంటున్నారు. అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో పిడుగు పాటుకు చిలుకూరి మహేందర్ రెడ్డి అనే రైతు చనిపోయాడు.

అకాల వర్షాలతో నాలుగునెలల్లో 60 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెలలోనే వడగండ్ల వానలతో రాష్ట్రంలో 23 వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందంటున్నారు వ్యవసాయశాఖ అధికారులు. పెద్దపల్లి, మెదక్, నిర్మల్, జనగాం, నల్గొండ, యాదాద్రి, సిరిసిల్ల, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. తిరుమలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వాతావరణం కాస్త చల్లబడడంతో భక్తులు రిలీఫ్ ఫీలయ్యారు. కడప జిల్లా పోరుమామిళ్ళలో పిడుగు పడి గోర్రెల కాపరి రామయ్య చనిపోయాడు.

Latest Updates